రాముడ్ని కాంగ్రెస్‌ అవమానించింది : మోడీ విమర్శలు

రాముడ్ని కాంగ్రెస్‌ అవమానించింది : మోడీ విమర్శలుపిలిభీత్‌ : అయోధ్యలో రామ మందిర నిర్మాణాన్ని అడ్డుకునేందుకు కాంగ్రెస్‌ అనేక ప్రయత్నాలు చేసిందని, ప్రాణ ప్రతిష్ణ వేడుక ఆహ్వానాన్ని తిరస్కరించి రాముడ్ని అవమానించిందని ప్రధానమంత్రి నరేంద్రమోడీ మంగళవారం ఆరోపించారు. ఉత్తరప్రదేశ్‌లోని పిలిభీత్‌లో బిజెపి ఎన్నికల ప్రచారంలో మోడీ ప్రసంగించారు. ‘అయోధ్యలో రామ మందిరాన్ని నిర్మించకుండా ఉండేందుకు కాంగ్రెస్‌ ఎన్నో ప్రయత్నాలు చేసింది. ప్రాణాప్రతిష్ట ఆహ్వానాన్ని తిరస్కరించడం ద్వారా రాముడ్ని అవమానించింది. పైగా ఈ వేడుకకు హాజరైన ఆ పార్టీ నాయకులపై ఆరేళ్ల నిషేధం విధించింది’ అని మోడీ విమర్శించారు. అలాగే కాంగ్రెస్‌ బుజ్జగింపులు అనే బురదలో కూరుకుపోయిందని, దాని నుంచి ఎప్పటికీ బయటకు రాలేదని మోడీ ఆరోపించారు. కాంగ్రెస్‌ తయారు చేసిన మేనిఫెస్టో ముస్లిం లీగ్‌దేనని కూడా మోడీ విమర్శించారు. కేంద్రంలో కాంగ్రెస్‌ ప్రభుత్వం ఉన్నప్పుడు ప్రపంచ దేశాల నుంచి భారత్‌ సహాయం కోరేదని, ఇప్పుడు ప్రపంచానికే భారత్‌ సహాయం చేస్తుందని అన్నారు. కోవిడ్‌ సమయంలో ప్రపంచం మొత్తానికి ఔషధాలు అందుబాటులో ఉంచామని గుర్తుచేశారు. ఈ కార్యక్రమంలో ఉత్తరప్రదేశ్‌ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌, ఇతర బిజెపి నాయకులు పాల్గొన్నారు.

Spread the love