మోడీ ఆత్మస్తుతి ..పరనింద..

నవతెలంగాణ న్యూఢిల్లీ: ఐదు రాష్ర్టాల అసెంబ్లీ ఎన్నికలతోపాటు త్వరలో లోక్‌సభ ఎన్నికలు జరుగనున్న నేపథ్యంలో ప్రధాని మోడీ ఎన్నికల తాయిలాలు ప్రకటించడం ప్రారంభించారు. ఉచితాలకు వ్యతిరేకంటూ తరచూ ఊదరగొట్టే ప్రధాని.. ఇప్పుడు ఎన్నికల వేళ అదే ఉచితాలను ప్రకటిస్తున్నారు. ఎన్నికల్లో ప్రజలను ఆకర్షించే లక్ష్యంతో ‘ఉచిత్‌ రేషన్‌’ స్కీమ్‌ను మరో ఐదేండ్లు పొడిగించనున్నట్టు ఎన్నికల సభలో ప్రకటించారు. ఛత్తీస్‌గఢ్‌, మధ్యప్రదేశ్‌లో శనివారం నిర్వహించిన ఎన్నికల ర్యాలీల్లో మోడీ పాల్గొన్నారు. ఛత్తీస్‌గఢ్‌లోని దుర్గ్‌, మధ్యప్రదేశ్‌లోని రత్లాంలో జరిగిన బీజేపీ ఎన్నికల ప్రచార సభలో ప్రధాని మాట్లాడారు. ఉచిత రేషన్‌ పొడిగింపును ‘మోడీ గ్యారంటీ’గా ఆయనకు ఆయనే గొప్పగా చెప్పుకొన్నారు. ఈ పథకం పొడిగింపు వల్ల పేదలకు డబ్బు ఆదా ఆవుతుందని, వాటితో వేరే అవసరాలు తీర్చుకోవచ్చని అన్నారు. దుర్గ్‌ ర్యాలీ సందర్భంగా ఛత్తీస్‌గఢ్‌లోని కాంగ్రెస్‌ ప్రభుత్వంపై మోడీ విమర్శలు గుప్పించారు. ఆ పార్టీ పేదలను పేదలుగానే ఉంచాలని అనుకుంటుందని ఆరోపించారు. మోసం తప్ప పేదలకు కాంగ్రెస్‌ ఏమీ ఇవ్వలేదన్నారు. ఛత్తీస్‌గఢ్‌ సీఎం భూపేశ్‌ బఘేల్‌కు బెట్టింగ్‌ యాప్‌ నిర్వాహకులతో సంబంధం, వారి నుంచి కాంగ్రెస్‌కు ముడుపులు అందుతున్నాయని వస్తున్న ఆరోపణలు మోడీ ప్రస్తావించారు.

Spread the love