విభజన హామీలు అమలు చేయని మోడీ

విభజన హామీలు అమలు చేయని మోడీ– దొడ్డు వడ్లకూ రాష్ట్ర ప్రభుత్వం బోనస్‌ ఇవ్వాలి :సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌
తెలంగాణ ఏర్పడిన పదేండ్ల కాలంలో కేంద్రంలోని మోడీ ప్రభుత్వం విభజన హామీలను అమలు చేయలేదని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు విమర్శించారు. తెలంగాణ, ఏపీకి చేసిందేమీ లేదన్నారు. హైదరాబాద్‌ మఖ్దూంభవన్‌లో శుక్రవారం ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడుతూ బీజేపీ తాచు పాములాంటిదనీ, దానికి తలతోపాటు తోకలోనూ విషం ఉంటుందని చెప్పారు. ఆ పార్టీది దేశాన్ని ఖండఖండాలుగా విభజించే రాక్షస ఆలోచనా విధానమని అన్నారు. మరో వందేండ్ల వరకు తానే ప్రధానిగా ఉంటానంటూ మోడీ చెప్తున్నారనీ, ఇలాంటి నిరంకుశ, నియంతృత్వ, ఏక వ్యక్తి పాలనను ఎక్కడా చూడలేదన్నారు. పార్లమెంట్‌ ఎన్నికల ఫలితాల తర్వాత బీఆర్‌ఎస్‌కు చెందిన 25 ఎమ్మెల్యేలు కాంగ్రెస్‌లో చేరతారంటూ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌ రెడ్డి ప్రకటించారనీ, దీన్నిబట్టి ఈ ఎన్నికల్లో కాంగ్రెస్‌ గెలుస్తుందని అంగీకరించినట్టేనని అన్నారు. తెలంగాణ ఏర్పాటుకు ముందు కేంద్రం అనేక వాగ్ధానాలు చేసిందనీ, విభజన చట్టంలోని బయ్యారం స్టీల్‌ ఫ్యాక్టరీ, వరంగల్‌ కోచ్‌ ఫ్యాక్టరీ, గిరిజిన విశ్వవిద్యాలయం, ఐఐఎం, షెడ్యూల్‌ 9లో సంస్థల విభజన పూర్తి కాలేదని విమర్శించారు. బీజేపీకి 400 సీట్లు వస్తే రాజ్యాంగాన్ని మార్చేస్తామంటూ ఆ పార్టీ నాయకులు చెప్తున్నారనీ, మోడీ మాత్రం మార్చబోమంటున్నారని చెప్పారు. ముస్లిం రిజర్వేషన్లు తొలగించడమంటే రాజ్యాంగ వ్యతిరేకం కాదా? అని ప్రశ్నించారు. ఏదో ఒక పేరుతో హిందూ, ముస్లింల విభజన తీసుకొచ్చి రెచ్చగొట్టేందుకు ప్రయత్నించారని విమర్శించారు. ఇష్టానుసారంగా మాట్లాడు తున్న మోడీపై ఎన్నికల కమిషన్‌ ఎలాంటి చర్యలు తీసుకునే పరిస్థితుల్లో లేదన్నారు. పార్లమెంట్‌ ఎన్నికల ఫలితాలు ఇండియా కూటమికి అనుకూలంగా ఉంటాయని చెప్పారు. శ్రీరాముని కళ్యాణం జరగకుండానే తలంబ్రాలు పంచడం పాపమని ఆయన అన్నారు. రాష్ట్రంలో ఆర్థిక సంక్షోభానికి కేసీఆర్‌ పాలన కారణమని విమర్శించారు. మేధావులు , వివిధ రంగాల నిపుణులు, రాజకీయ పార్టీల నాయకుల సలహలతో కాంగ్రెస్‌ ప్రభుత్వం ముందు కళ్లాలని సూచించారు. ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టును నిర్మించాలనీ, పాలమూరు-రంగారెడ్డిని పూర్తి చేయాలని కోరారు. వరి వేస్తే ఊరి అని చెప్పిన కేసీఆర్‌కు వ్యవసాయం గురించి మాట్లాడే హక్కు లేదన్నారు. సన్నబియ్యానికి బోనస్‌ ఇవ్వ డాన్ని స్వాగతిస్తున్నా మనీ, దొడ్డు వడ్లకూ వర్తింప చేయా లని డిమాండ్‌ చేశారు. ఈ కార్యక్రమంలో సీపీఐ జాతీయ సమితి సభ్యులు పల్లా వెంకట్‌రెడ్డి, రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు పశ్యపద్మ తదితరులు పాల్గొన్నారు.

Spread the love