నెలరోజులు… వరుస సమీక్షలు

– జోడెద్దులుగా అభివృద్ధి-సంక్షేమం
– అధికారుల బదిలీలకు తొలి ప్రాధాన్యత
– పాలన పరుగులుతీయాలి : సీఎం, డిప్యూటీ సీఎంల ఆకాంక్ష
– ప్రణాళికలు సిద్ధం చేసిన రేవంత్‌ సర్కార్‌
నవతెలంగాణ-హైదరాబాద్‌బ్యూరో
నెలరోజులు…వరుసగా అన్ని ప్రభుత్వ శాఖలపైనా సమీక్షలు. ఏ జిల్లాకు ఆ జిల్లాలోనే సమీక్షలు. జిల్లా మంత్రుల అధ్యక్షతన అధికారులతో పాటు స్థానిక ప్రజాప్రతినిధులతో కలిసి వరుస సమావేశాల నిర్వహణ. అభివృద్ధి-సంక్షేమం జోడెద్దుల బండిలా పరుగులు తీయాలి. ఈ మేరకు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క నిర్ణయించారు. దానిలో భాగంగా ఆదివారం ఉప ముఖ్యమంత్రి అధ్యక్షతన మధిరలో సమీక్ష సమావేశం కూడా నిర్వహించారు. ఈనెల 12, 13 తేదీల్లో ఖమ్మం జిల్లాలో సమీక్షా సమావేశాలు జరపాలని నిర్ణయించారు. దీనికి కూడా ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క హాజరవుతారని ఆయన కార్యాలయం ఆదివారం తెలిపింది. ఎలక్షన్‌ కోడ్‌ ముగియడంతో రేవంత్‌ సర్కార్‌ పాలనపై దృష్టి కేంద్రీకరించింది. రాష్ట్ర స్థాయిలో అన్ని శాఖల పనితీరుపై సీఎం రేవంత్‌రెడ్డి పూర్తిస్థాయి సమీక్షలు చేయనున్నారు. ఈ విషయాన్ని ముఖ్యమంత్రి కార్యాలయం తెలిపింది. ఏండ్ల తరబడి ఒకే పోస్ట్‌లో పాతుకుపోయిన అధికారుల బదిలీల ప్రక్రియను తొలి దశలో చేయాలని ప్రభుత్వం భావిస్తుంది. ఈ మేరకు వచ్చే వారంలో అన్ని ప్రభుత్వ శాఖల్లోనూ భారీగా బదిలీలు జరుగుతాయనే చర్చ ప్రభుత్వ వర్గాల్లో జరుగుతుంది. ఈ ప్రక్రియ పూర్తయ్యాక అధికారుల పనితీరుపై ప్రతి నెలా నివేదికలు, సమీక్షలు చేయాలని కూడా సీఎం రేవంత్‌రెడ్డి నిర్ణయించారు. ఈనెల 9న ఉపాధ్యాయుల పదోన్నతులు, బదిలీ కార్యాచరణ ప్రారంభమైంది. ఈనెలాఖరు నాటికి ఈ ప్రక్రియ ముగియనుంది. మరోవైపు ఆరు గ్యారెంటీల అమలుపై ప్రధానంగా దృష్టి పెట్టి, దానికి అవసరమైన ఆర్థికాభివృద్ధిని రాబట్టుకోవాలని భావిస్తున్నారు. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, రాజీవ్‌ ఆరోగ్యశ్రీ పరిమితిని రూ.10 లక్షలకు పెంపు, రూ.500 గ్యాస్‌ సిలిండర్‌, 200 యూనిట్ల లోపు గృహ విద్యుత్‌ వినియోగదారులకు జీరో బిల్లుల మంజూరును అమల్లోకి తెచ్చారు. స్వయం సహాయక బృందాలకు వడ్డీ లేని రుణాలు ఇస్తామని హామీ ఇచ్చారు. సంక్షేమం- అభివృద్ధి జోడెడ్ల బండి తరహాలో పాలనను ముందుకు తీసుకెళ్లాలని సీఎం, డిప్యూటీ సీఎం భావిస్తున్నారని ఆయా కార్యాలయాలు తెలిపాయి.
12 ,13న ఖమ్మంలో సమీక్ష
నీళ్లు, నియామకాల పేరుతో అధికారంలోకి వచ్చిన గత పాలకులు ఖమ్మం జిల్లాలో ఇందిరా, రాజు సాగర్‌ ప్రాజెక్టు పనులను నిర్లక్ష్యం చేశారనీ, సాగునీటి ప్రాజెక్టుల విషయంలో ఒక్క అడుగు కూడా ముందుకు పడలేదని డిప్యూటీ సీఎం కార్యాలయం తెలిపింది. ఈ నేపథ్యంలో ఈనెల 12న సీతారామ సాగునీటి ప్రాజెక్టు, వైరా రిజర్వాయర్‌కు సాగర్‌ కాల్వ అనుసంధానం, నాగార్జునసాగర్‌ ప్రాజెక్టు సాగునీటి సరఫరా అంశాలను సమీక్షించనున్నారు. నాగార్జునసాగర్‌ ఎడమ కాలువ ద్వారా వైరా రిజర్వాయర్‌కు సాగునీటిని మళ్లించేందుకు ఎన్నికల కోడ్‌కు ముందే రూ.75 కోట్లు మంజూరు చేస్తూ ఉత్తర్వులు ఇచ్చినట్టు డిప్యూటీ సీఎం కార్యాలయం తెలిపింది. 13న జరిగే సమీక్షలో సాగునీటి ప్రాజెక్టు పనులు, వాటి ప్రగతిని తెలుసుకుంటారు. మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి సంయుక్తంగా ఆయా ప్రాజెక్టుల వద్దకు క్షేత్రస్థాయి పర్యటన చేపడతారని తెలిపారు. సీతారామ ప్రాజెక్టు పరిధిలో దుమ్ముగూడెం నుంచి జూలూరుపాడు వరకు జరుగుతున్న పనులు, ఏనుకూరు నుంచి వైరా రిజర్వాయర్‌కు నాగార్జునసాగర్‌ ఎడమ కాలువను లింక్‌ చేయడం వంటి పనులను వారు పరిశీలిస్తారు. అలాగే మన ఊరు- మనబడి, వివిధ సంక్షేమ పథకాల అమలును సైతం పరిశీలిస్తారు.

Spread the love