Saturday, August 8, 2026
E-PAPER
Homeరాష్ట్రీయంత్వరలో అందుబాటులోకి మూసారాం బ్రిడ్జి

త్వరలో అందుబాటులోకి మూసారాం బ్రిడ్జి

- Advertisement -


శరవేగంగా కొనసాగుతున్న పనులు
ఇటీవల పరిశీలించిన మంత్రులు
నవతెలంగాణ-సిటీబ్యూరో

​ వర్షాకాలంలో మూసీ నది ఉప్పొంగిన ప్రతిసారీ హైదరాబాద్‌‌లోని మూసారాంబాగ్‌, అంబర్‌పేట్‌ – మలక్‌‌పేట్‌ మధ్య వాహనాల రాకపోకలకు ఎదురవుతున్న తీవ్ర అంతరాయానికి త్వరలోనే శాశ్వత పరిష్కారం లభించనుంది. రెండువైపులా నిర్మిస్తున్న బ్రిడ్జి పనులను శరవేగంగా పూర్తి చేస్తున్నారు. కొద్ది రోజుల్లోనే బ్రిడ్జిని ప్రారంభించేందుకు జీహెచ్‌ఎంసీ ఇంజినీరింగ్‌ అధికారులు కసరత్తు చేస్తున్నారు. రూ.52 కోట్ల పరిపాలనా అనుమతులతో నిర్మిస్తున్న మూసారాంబాగ్‌ ‘హైలెవల్‌ వంతెన’ పనులు కొనసాగుతున్నాయి. 220 మీటర్ల పొడవుతో ఆరు లేన్‌ల వంతెనతో పాటు ఇరువైపులా 3.5 మీటర్ల వెడల్పు ఫుట్‌పాత్‌, 6 లేన్‌ల విశాలమైన వంతెన (20 మీటర్ల క్యారేజ్‌వే)తో బ్రిడ్జిని నిర్మిస్తున్నారు. 2022 జనవరి 29న అనుమతి లభించిన ఈ ప్రాజెక్టులో సివిల్‌ పనులకు రూ.36.33 కోట్లు, భూసేకరణకు రూ.60 కోట్లు, విద్యుత్‌ లైన్ల మార్పిడికి రూ.5.94 కోట్లు కేటాయించిన విషయం తెలిసిందే. ట్రాఫిక్‌ అవసరాలకు తగ్గట్టుగా, 2022 నాటికి ఈ మార్గంలో రోజువారీ 2,651 పీసీయూ వాహనాల రద్దీ ఉండగా, 2043 నాటికి ఇది 7,387 కు పెరుగుతుందని అధికారులు అంచనా వేశారు. భవిష్యత్‌ అవసరాలకు అనుగుణంగానే ఈ 6 లైన్‌ల విశాలమైన వంతెన ప్రణాళికలు రూపొందించి, నిర్మాణ పనులను పూర్తి చేస్తున్నారు. ఈ నేపథ్యంలో గత బుధవారం మంత్రులు పొన్నం ప్రభాకర్‌, అజారుద్దీన్‌, జీహెచ్‌ఎంసీ కమిషనర్‌ ఆర్‌వి.కర్ణన్‌ నిర్మాణ పనులను పరిశీలించారు. వీలైనంత త్వరలోనే బ్రిడ్జిని ప్రారంభిస్తామని చెప్పారు.

​ కొనసాగుతున్న డౌన్‌ స్ర్టీమ్‌తోపాటు రోడ్డు ‌పనులు
వంతెన నిర్మాణాన్ని రెండు భాగాలుగా విభజించిన అధికారులు పనుల్లో వేగం పెంచారు. మలక్‌పేట్‌, అంబర్‌పేట్‌ వైపు రిటైనింగ్‌ వాల్స్‌ (రాఫ్ట్‌, లిఫ్ట్‌ కాస్టింగ్‌), క్రాష్‌ బారియర్స్‌, మీడియన్‌ రైలింగ్‌ పనులు పూర్తి చేశారు. మూసారంబాగ్‌ ‌వైపు డౌన్‌ స్ర్టీమ్‌తోపాటు రోడ్డు ‌పనులు కొనసాగుతున్నాయి. జీహెచ్‌ఎంసీ చీఫ్‌ ఇంజినీర్‌ సహదేవ్‌ రత్నాకర్‌ స్వయంగా ఎప్పటికప్పుడూ నిర్మాణ స్థలాన్ని పర్యవేక్షిస్తూ వీలైనంత త్వరలో బ్రిడ్జి పనులు పూర్తి చేసేవిధంగా సిబ్బందికి సూచనలు, సలహాలను అందిస్తున్నారు. వంతెన త్వరలోనే అందుబాటులోకి వస్తుందని, దాంతో వర్షాకాలంలో మూసీ వరదల వల్ల నగరవాసులకు ఎదురయ్యే సమస్య శాశ్వతంగా తొలగిపోతుందని అభిప్రాయపడ్డారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -