అమ్మ ప్రేమ‌కు అవ‌ధుల్లేవు

అమ్మ ప్రేమ‌కు అవ‌ధుల్లేవుఅమ్మ అంటే అనురాగం, అనుబంధం, ఆత్మీయత. అన్నింటికీ మించి అమ్మంటే మనకు ముందుగా స్ఫురించేది ప్రేమ. నిస్వార్థ ప్రేమ ఆమె సొంతం. రెక్కలు ముక్కలు చేసుకొని బిడ్డల్ని పెంచి పెద్దచేస్తుంది. బుడిబుడి అడుగుల నుంచే నడతను, ఆ తర్వాత భవితను నిర్దేశిస్తుంది. చిన్న తప్పు చేసినా కడుపులో దాచుకుని కనికరిస్తుంది. బిడ్డ ఆకలి, బాధ, సుఖ, సంతోషాలు తల్లి మాత్రమే గ్రహించగలదు. బిడ్డ విజయాలు సాధించినప్పుడు అమ్మ ఆనందానికి అవధులుండవు. ఈ రోజు ‘మాతృదినోత్సవం’ సందర్భంగా ప్రముఖ బుల్లితెర నటి, కూచిపూడి కళాకారిణి జ్యోతిరెడ్డి అమ్మతో తన అనుబంధాన్ని మనతో ఇలా పంచుకున్నారు.
అమ్మ వెంకట రత్నం, నాన్న వెంకట సుబ్బారెడ్డి, బిఎస్‌ఎన్‌ఎల్‌లో ఉద్యోగం చేసేవారు. మా స్వగ్రామం తెనాలి. నాన్న ఉద్యోగ రీత్యా హైదరాబాద్‌లో స్థిరపడిపోయారు. మేము ముగ్గురు ఆడ పిల్లలం. నేను అందరికంటే చిన్నదాన్ని. అమ్మకు నాట్యం అంటే చాలా ఇష్టం. నేను కడుపులో ఉన్నప్పుడు అమ్మ శోభా నాయుడు నాట్య ప్రదర్శనలు ఎక్కువగా చూసేవారట. నాకు ఆరేండ్లు ఉన్నప్పుడు నాట్య గురువు కృష్ణ కుమారి వద్ద నెల రోజులు కూచిపూడి నేర్చుకున్నాను. అప్పటి నుంచి ప్రోగ్రామ్స్‌ ఇవ్వడం మొదలు పెట్టాను.
ఏదైనా అమ్మతో చెప్పాల్సిందే
ఏ పని చేయాలన్నా, చీర, డ్రెస్‌ ఏది కొనుక్కోవాలన్న అమ్మతో చెప్పాల్సిందే. అమ్మ నన్ను ఒక డాన్సర్‌గా చూడాలని అనుకున్నారు. అయితే ఎవరి దగ్గర నేర్పించాలి అనే విషయంలో ఆవిడకు సరైన అవగాహన లేక పోయింది. నాకు చిన్నప్పుడు కాళ్ళ నొప్పులు ఉండేవి. అమ్మకు ఎవరో సలహా ఇచ్చారు ఫలానా చోట ఒకావిడ డాన్స్‌ నేర్పిస్తారు, మీ అమ్మాయికి డాన్స్‌ నేర్పించండి, కాళ్ళ నొప్పులు తగ్గిపోతాయి అని. అనుకోకుండా అమ్మ కోరిక అలా తీరింది. ఒక రోజు నాట్య ప్రదర్శన ఇస్తుండగా వేదాంత రాధేశ్యాం నా నాట్య ప్రదర్శన చూసి అమ్మతో మీ అమ్మాయికి కూచిపూడి నాట్యం నేర్పించండి, కళ అందరికీ రాదు అని. అలా గురువుల దగ్గర నేర్చుకుంటూ ప్రదర్శనలు ఇస్తూనే ఉన్నాను.
అమ్మతోనే అనుబంధం
అమ్మ కంటే మించిన హితులు, శ్రేయోభిలాషులు ఎవరుంటారు. కోప్పడినా, తిట్టినా, కొట్టినా అమ్మతోనే అనుబంధం. సుమారు 30 ఏండ్లుగా కూచిపూడి నృత్య ప్రదర్శనలు కొన్ని వేల సంఖ్యలో ఇచ్చాను. ఒక రోజు త్యాగరాయ గాన సభలో ప్రదర్శన జరుగుతుండగా దేవదాసు కనకాల చూసి అమ్మతో దూరదర్శన్‌లో ‘డామిట్‌ కధ అడ్డం తిరిగింది’ అనే సీరియల్‌ తీస్తున్నాను. అందులో మీ అమ్మాయి నటించడానికి అవకాశం ఇస్తాను పంపిస్తారా’ అని అడిగారు. అమ్మ ఎటువంటి అభ్యతరం చెప్పలేదు. నేెను ఈ రోజున ఇలా ఉన్నానంటే అమ్మ ప్రోత్సాహమే. నన్నూ, నా అవసరాలను దగ్గర ఉండి చూసుకునేవారు. నాకు పుట్టినరోజు, పండుగ రోజు అంటూ ఏమీ ఉండేవి కావు. ఎప్పుడు షూటింగ్స్‌, డాన్స్‌ అంతే. అమ్మ మాత్రం నా ఇష్టాలను గుర్తుపెట్టుకొని స్వయంగా వండి పెట్టేవారు.
నీ కంటూ ఓ జీవితం లేదు
‘అమ్మా నీ పోస్ట్‌కి ప్రమోషన్‌ అంటూ లేదు. అప్పుడు నీ పిల్లలను చూసుకున్నావు, ఇప్పుడు నా పిల్లలను చూసుకుంటున్నావు. నీ కంటూ ఓ జీవితం లేదు’ అని ఈ మధ్య అమ్మతో అంటే నవ్వేసి ‘నా పిల్లలను, నా పిల్లల పిల్లలను చూసుకోవ డంలో నాకెంతో సంతోషం, తృప్తి ఉన్నాయి. ఇంతకంటే నాకేం కావాలి’ అంది. అమ్మా… ఏమిచ్చి నీ రుణం తీర్చుకోగలను. ఈ రోజున నేను ఇలా ఉన్నాను అంటే నీ ప్రోద్బలంతోనే…
– పాలపర్తి సంధ్యారాణి

Spread the love