Monday, June 1, 2026
E-PAPER
Homeరాష్ట్రీయంప్రయివేట్ రంగంలో రిజర్వేషన్ల సాధన కోసం ఉద్యమం

ప్రయివేట్ రంగంలో రిజర్వేషన్ల సాధన కోసం ఉద్యమం

- Advertisement -

​రాష్ట్ర ప్రభుత్వం వికలాంగులకిచ్చిన హామీలను అమలు చేయాలి
పెన్షన్ రూ.6వేలకు పెంచాలి
జులై లో రాష్ట్ర వ్యాప్త ఉద్యమం : ఎన్‌పీఆర్డీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎం.అడివయ్య
యాద్రాద్రిలో ముగిసిన 
రాష్ట్ర విద్యా, 
వైజ్ఞానిక తరగతులు


నవతెలంగాణ-యాదగిరిగుట్టరూరల్

ప్రయివేట్ రంగంలో రిజర్వేషన్ల సాధన కోసం ఉద్యమిస్తామని, అందుకోసం చట్టం చేయాలని ఎన్‌పీఆర్డీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎం.అడివయ్య డిమాండ్ చేశారు. యాదాద్రిభువనగిరి జిల్లా యాదగిరిగుట్ట పట్టణంలోని లక్ష్మీ నరసింహ ఫంక్షన్‌హాల్‌లో జరుగుతున్న ఎన్‌పీఆర్డీ విద్యా, వైజ్ఞాఁక రాష్ట్ర స్థాయి శిక్షణా తరగతులు ఆదివారం ముగిశాయి. ఈ సందర్భంగా నిర్వహించిన సభలో ఆయన మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వం వికలాంగులను మోసం చేస్తోందని విమర్శించారు. కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థల్లో ఖాళీగా ఉన్న వికలాంగుల బ్యాక్‌లాగ్ పోస్టులను భర్తీ చేయాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వరంగ సంస్థలను ప్రయివేట్‌పరం చేయడం వల్ల వికలాంగులు ఉద్యోగాలు కోల్పోతున్నారని తెలిపారు. 2014లో మోడీ అధికారంలోకి వచ్చిన తర్వాత వికలాంగులు హక్కులు, చట్టాలను అమలు చేయకుండా మోసం చేస్తున్నారని విమర్శించారు. హక్కుల కోసం పోరాడుతున్న వారిపై నిర్బంధం మోపుతున్నారని చెప్పారు. సంపన్నులకు రాయితీలు ఇస్తున్న ప్రభుత్వం వికలాంగుల పెన్షన్స్ పెంపు కోసం ఎందుకు నిధులు కేటాయించడం లేదన్నారు. సంక్షేమరంగాన్ని నిర్వీర్యం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. 2016 వికలాంగుల హక్కుల పరిరక్షణ చట్టం అమలు, పర్యవేక్షణ కోసం చీఫ్ కమిషనర్‌ను ఎందుకు నియమించడం లేదని ప్రశ్నించారు.

నేషనల్ ట్రస్ట్, నేషనల్ పాలసీ, మెంటల్ హెల్త్ కేర్ యాక్ట్, ఐక్య రాజ్య సమితి హక్కుల ఒప్పందపత్రం ఎందుకు అమలు చేయడం లేదన్నారు. వికలాంగులకు సామాజిక భద్రత కల్పించే బాధ్యత కేంద్ర ప్రభుత్వానికి లేదా అని ప్రశ్నించారు. మోడీ పాలనలో దేశంలో వికలాంగులపై దాడులు, దౌర్జన్యాలు పెరిగిపోతున్నా అరికట్టడం లేదన్నారు. వికలాంగుల రక్షణ కోసం ప్రత్యేక చట్టం చేయాలని డిమాండ్ చేశారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వలపై పెన్షన్ పెంపు కోసం జులై నెలలో ఉద్యమం చేస్తామని స్పష్టం చేశారు. ఎన్‌పీఆర్డీ రాష్ట్ర అధ్యక్ష‍ులు కె.వెంకట్ మాట్లాడుతూ.. రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి రాకముందు ఆరు గ్యారంటీలు, 420 హామీలను ఇచ్చిందని, వికలాంగుల కోసం నాలుగు హామీలను ఇచ్చిందన్నారు. 30 నెలలవుతున్నా ఇచ్చిన హామీలను ఎందుకు అమలు చేయలేదని ప్రశ్నించారు. రాష్ట్రంలో వికలాంగుల సామాజిక, ఆర్థికస్థితి దిగజారి పోతుందని తెలిపారు. వికలాంగుల అభివద్ధి, సంక్షేమం పట్ల రాష్ట్ర ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదన్నారు. ఈ సమావేశంలో రాష్ట్ర కోశాధికారి ఆర్.వెంకటేశ్, రాష్ట్ర ఉపాధ్యక్ష‍ులు బొల్లేపల్లి స్వామి, జిల్లా అధ్యక్ష‍ులు సూరపంగ స్వామి, కార్యదర్శి వనం ఉపేందర్, కోశాధికారి లలిత, రాష్ట్ర ఆఫీస్ బేరర్స్ జె.రాజు, కాషాప్ప, యశోద, గంగాధర్, లింగయ్య, భువనగిరి జిల్లా నాయకులు శ్రీహరి, భగవంత్‌రెడ్డి, విజయ్, లక్ష్మీ, నరేష్, సంతోష్, వివిధ జిల్లాల నాయకులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -