ఎంపీ బ్రిజ్‌ భూషణ్‌ను వెంటనే అరెస్టు చేయాలి

– అతని పార్లమెంటు సభ్యత్వాన్ని రద్దు చేయాలి : సీఐటీయూ రాష్ట్ర అధ్యక్ష కార్యదర్శులు చుక్క రాములు, పాలడుగు భాస్కర్‌ డిమాండ్‌
– మహిళా రెజ్లర్లకు మద్దతుగా నిరసన కార్యక్రమాలు
నవతెలంగాణ- విలేకరులు
మహిళా రెజ్లర్లను లైంగికంగా వేధించిన బీజేపీ ఎంపీ బ్రిజ్‌ భూషణ్‌ చరణ్‌ సింగ్‌ను వెంటనే అరెస్టు చేయాలని సీఐటీయూ రాష్ట్ర అధ్యక్ష కార్యదర్శులు చుక్క రాములు, పాలడుగు భాస్కర్‌ డిమాండ్‌ చేశారు. అతని పార్లమెంటు సభ్యత్వం రద్దు చేయాలని కోరారు. మహిళా రెజ్లర్లకు మద్దతుగా బుధవారం రాష్ట్ర వ్యాప్తంగా సీఐటీయూ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాలు నిర్వహించారు. దిష్టిబొమ్మలు దహనం చేశారు.
సిద్దిపేట జిల్లా కేంద్రంలో కేంద్ర ప్రభుత్వ దిష్టిబొమ్మ దహనం చేశారు. ఈ సందర్భంగా చుక్క రాములు మాట్లాడుతూ.. తమను లైంగికంగా వేధించిన బీజేపీ ఎంపీ బ్రిజ్‌ భూషణ్‌ను అరెస్టు చేయాలని మహిళా రెజ్లర్లు ఢిల్లీ నడిబొడ్డులో పోరాటం చేస్తున్నా కేంద్ర ప్రభుత్వానికి పట్టడం లేదని విమర్శించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, హౌంమంత్రి అమిత్‌ షా స్పందించకపోవడం దారుణమన్నారు. భరతమాత ముద్దు బిడ్డలమని, మహిళలకు అత్యంత గౌరవాన్ని ఇస్తున్నామని చెప్పుకునే బీజేపీ ప్రభుత్వానికి ఢిల్లీలో కొంతకాలంగా రెజ్లర్లు చేస్తున్న న్యాయమైన పోరాటం కనబడటం లేదా అని ప్రశ్నించారు. మహిళా రెజ్లర్లు ప్రపంచ వ్యాప్తంగా, దేశం గర్వపడే విధంగా ఎన్నో పతకాలు సాధిస్తే.. వారిని ఈ ప్రభుత్వం చిన్నచూపు చూస్తోందని విమర్శించారు. ఇప్పటికైనా కేంద్రం ప్రభుత్వం స్పందించి బ్రిజ్‌భూషణ్‌ను వెంటనే అరెస్టు చేయాలని డిమాండ్‌ చేశారు.
ఖమ్మం జిల్లా మధిర పట్టణంలోని శాంతి థియేటర్‌ ఎదురుగా కేంద్ర ప్రభుత్వ దిష్టిబొమ్మ దహనం చేశారు. ఈ సందర్భంగా సీఐటీయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పాలడుగు భాస్కర్‌ మాట్లాడుతూ.. మహిళా రెజ్లర్లపై లైంగిక వేధింపులకు పాల్పడిన భారత రెజ్లర్స్‌ ఫెడరేషన్‌ అధ్యక్షుడు, ఎంపీ బ్రిజ్‌ భూషణ్‌ చరణ్‌ సింగ్‌ను తక్షణమే పదవి నుంచి తొలగించి, అరెస్టు చేయాలని కోరారు. రెజ్లర్ల న్యాయమైన డిమాండ్లు పరిష్కరించాలని డిమాండ్‌ చేశారు. బీజేపీ నిర్లక్ష్య వైఖరి నశించాలన్నారు.
మహిళా రెజ్లర్లకు సంపూర్ణ మద్దతుగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కేంద్రంలోని సీపీఐ(ఎం) జిల్లా కార్యాలయం ఎదుట తెలంగాణ అంగన్వాడీ టీచర్స్‌ అండ్‌ హెల్పర్‌ యూనియన్‌(సీఐటీయూ) ఆధ్వర్యంలో నిరసన తెలిపారు. అలాగే, అంబేద్కర్‌ విగ్రహం వద్ద నిరసన కార్యక్రమం చేపట్టారు.
హనుమకొండ కాజీపేట చౌరస్తాలో కండ్లకు నల్ల రిబ్బన్లు కట్టుకుని నిరసన తెలిపారు. సీఐటీయూ రాష్ట్ర నాయకులు కాసు మాధవి ఆధ్వర్యంలో హనుమకొండలోని అంబేద్కర్‌ సెంటర్‌లో దిష్టిబొమ్మ దహనం చేసి, రాస్తారోకో నిర్వహించారు. నక్కలగుట్ట కాలోజి సెంటర్‌లో, వరంగల్‌ జిల్లా నాయుడు పంపు జంక్షన్‌ వద్ద నిరసన తెలిపారు. మహబూబాబాద్‌ జిల్లాలోని అంబేద్కర్‌ సెంటర్‌లో పీఓడబ్ల్యూ, పీవైఎల్‌, ఐఎఫ్‌టీయూ, పీడీఎస్‌యూ, ఐకెఎంఎస్‌ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేపట్టారు. యాదాద్రి భువనగిరి జిల్లా బీబీనగర్‌ మండల కేంద్రంలో బీజేపీ ఎంపీ బ్రిజ్‌ భూషణ్‌ దిష్టిబొమ్మ దహనం చేశారు. బొమ్మలరామారం మండలంలో రాస్తారోకో చేశారు. సూర్యాపేట జిల్లా కేంద్రంలోని వ్యవసాయ మార్కెట్‌ సమీపంలో రాస్తారోకో నిర్వహించారు.

Spread the love