ఎంపీ అభ్యర్థి మల్లురవిని భారీ మెజార్టీతో గెలిపించండి: ఎమ్మెల్యే

– మల్లురవి సతీమణి రాజాబాన్సీదేవి
– పాల్గొన్న సీపీఐఎం మండల నాయకుడు చింతల నాగరాజు, కామ్రేడ్లు
నవతెలంగాణ – ఉప్పునుంతల
ఇందిరమ్మ హయాంలోనే మహిళలకు పూర్తి హక్కులు అందుతాయని అందుకే నాగర్ కర్నూల్ పార్లమెంట్ అభ్యర్థి డాక్టర్ మల్లు రవిని భారీ మెజార్టీతో గెలిపించాలని అచ్చంపేట ఎమ్మెల్యే డాక్టర్ చిక్కుడు వంశీకృష్ణ, ఎంపీ అభ్యర్థి మల్లురవి సతీమణి రాజా భాన్సీ దేవి కోరారు. ఉప్పునుంతల మండల కేంద్రంలోని కొత్త యశోద ఫంక్షన్ హాల్ లో మండల మహిళా ఆత్మీయ సమ్మేళన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఇందిరాగాంధీ హయాంలోనే మహిళలకు అన్ని రంగాలలో రిజర్వేషన్లు హక్కులు కల్పించడం జరిగిందని వారు గుర్తు చేశారు. పార్లమెంట్ ఎన్నికల మేనిఫెస్టో మహిళలకు అధిక ప్రాధాన్యత ఇస్తూ సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టడం జరిగిందన్నారు. ఆర్థికంగా వెనుకబడిన కుటుంబాలలో ప్రతి మహిళకు సంవత్సరానికి లక్ష రూపాయల ఆర్థిక సహాయం సగం జనాభా పూర్తి హక్కుల ద్వారా మహిళలకు అన్ని ప్రభుత్వ ఉద్యోగాల్లో 50 శాతం రిజర్వేషన్లు కల్పించడం జరుగుతుందన్నారు. అంగన్వాడి, ఆశ ,మధ్యాహ్నం భోజన కార్మికులకు నెలవారి గౌరవ వేతనాన్ని పెంచుతామన్నారు. సావిత్రిబాయి పూలే హాస్టల్ పథకం ద్వారా దేశవ్యాప్తంగా అన్ని జిల్లా కేంద్రాల్లో కనీసం ఒక వర్కింగ్ ఉమెన్స్ హాస్టల్ ఏర్పాటు చేస్తామని, దేశవ్యాప్తంగా ఈ హాస్టల్ సంఖ్యను రెట్టింపు చేస్తామని పార్టీ హామీ ఇచ్చిందని తెలంగాణ రాష్ట్రంలో ఇచ్చిన హామీలకు కాంగ్రెస్ పార్టీ పాటుపడుతుందని వారు తెలిపారు. మే 13న జరగబోయే పార్లమెంటు ఎన్నికల్లో హస్తం గుర్తుపై ఓటు వేసి ఎంపీ అభ్యర్థి మల్లు రావిని భారీ మెజార్టీతో గెలిపించి సోనియమ్మ రుణం తీర్చుకుందాం అని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో రాష్ట్ర నాయకులు మోపతయ్య, మండల పార్టీ అధ్యక్షులు కట్ట అనంతరెడ్డి,మాజీ సర్పంచ్ కట్ట సరితా రెడ్డి, మండల ముఖ్య నేతలు మహిళా కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
Spread the love