– మున్సిపాల్టీల్లో రూ.21వేలు, జీహెచ్‌ఎంసీలో రూ.24 వేలు ఇవ్వాల్సిందే
– సెప్టెంబర్ 30న నిరవధిక సమ్మె ప్రకటన : పాలడుగు భాస్కర్
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
రాష్ట్ర వ్యాప్తంగా మున్సిపాల్టీల్లో పనిచేస్తున్న కాంట్రాక్టు, ఔట్‌సోర్సింగ్, ఎన్‌ఎంఆర్, ఫిక్స్‌డ్ పే తదితర పద్ధతుల్లో పనిచేస్తున్న సిబ్బందినందర్నీ పర్మినెంట్ చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని సీఐటీయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పాలడుగు భాస్కర్ డిమాండ్ చేశారు. జీహెచ్‌ఎంసీలో పనిచేసేవారికి రూ.24వేలు, మున్సిపాల్టీల్లో పనిచేసేవారికి రూ.21 వేలు ఇవ్వాలని కోరారు. లేనిపక్షంలో సెప్టెంబర్ 30న నిరవధిక సమ్మె ప్రకటన చేస్తామని హెచ్చరించారు. గురువారం హైదరాబాద్‌లోని సీఐటీయూ సెంట్రల్ సిటీ కార్యాలయంలో తెలంగాణ మున్సిపల్ వర్కర్స్, ఎంప్లాయీస్ యూనియన్ సమావేశం ఆ యూనియన్ రాష్ట్ర కార్యదర్శి పి.సుధాకర్ అధ్యక్షతన జరిగింది. అందులో యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జనగాం రాజమల్లు, వర్కింగ్ ప్రెసిడెంట్ ఎర్ర నర్సింహులు, ఉపాధ్యక్షులు ఇ.అంజయ్య, ఆర్.వాణి, డి.కిషన్, గుర్రం అశోక్, బాలనర్సింహ్మ, జినక శ్రీను, కార్యదర్శులు రాజనర్సు, వెంకటస్వామి, ఎం.శ్రవణ్‌కుమార్, జి.యాదమ్మ, పుట్ట ఆంజనేయులు, తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా భాస్కర్ మాట్లాడుతూ..మున్సిపల్ కార్మికులు వేతనాల పెంపు, హక్కుల కోసం దశలవారీగా పోరాటాలను నిర్వహించనున్నట్టు ప్రకటించారు. ఈ నెల 20 నుంచి 25వ తేదీ వరకు కరపత్రాల పంపిణీ, 25 నుంచి 30 వరకు జనరల్ బాడీ సమావేశాలు నిర్వహించాలని కార్మికులకు సూచించారు. 31 మున్సిపల్ కమిషనర్లు, చైర్‌పర్సన్స్‌కు వినతిపత్రాలు అందజేయాలనీ, సెప్టెంబర్ ఐదో తేదీన ఎమ్మెల్యేల ఇండ్ల వద్ద ధర్నాలు చేయాలని పిలుపునిచ్చారు. సెప్టెంబర్ 11న మంత్రులకు సామూహికంగా వినతిపత్రాలు అందజేత, 12 నుంచి 20 వరకు కార్మికుల నుంచి సంతకాల సేకరణ, 20 నుంచి 29 వరకు రాష్ట్ర వ్యాప్తంగా జీపు జాతా నిర్వహించనున్నట్టు ప్రకటించారు. జీపుజాతా ముగింపు సందర్భంగా 30న చలో హైదరాబాద్ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని కార్మికులకు పిలుపునిచ్చారు.