ఏఐతో నా మాటలు వక్రీకరిస్తున్నారు

ఏఐతో నా మాటలు వక్రీకరిస్తున్నారు– అమిత్‌ షా, నడ్డా వ్యాఖ్యలను కూడా..
– ప్రత్యర్థులు చర్యల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి
– ఫేక్‌ వీడియో బాధ్యులపై చర్యలు తీసుకోవాలి
– ఈసీని కోరిన ప్రధాని మోడీ
ముంబయి : కృత్రిమ మేధ(ఏఐ) టెక్నాలజీ సహాయంతో ప్రత్యర్థులు తన మాటలను, అమిత్‌ షా చేసే వ్యాఖ్యలను వక్రీకరిస్తున్నారని ప్రధాని మోడీ అన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా పశ్చిమ మహారాష్ట్రలోని సతారా జిల్లాలోని కరాద్‌లో పర్యటించిన ఆయన.. సోషల్‌ మీడియా, టెక్నాలజీ దుర్వినియోగంపై ఆందోళన వ్యక్తం చేశారు. బీజేపీ నేతృత్వంలోని ప్రభుత్వాన్ని ఎదుర్కోలేని రాజకీయ ప్రత్యర్థులు ఇప్పుడు టెక్నాలజీని దుర్వినియోగం చేసి సోషల్‌ మీడియాలో నకిలీ వీడియోలను ప్రచారం చేస్తున్నారని మోడీ తెలిపారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలనీ, నకిలీ వీడియోల గురించి అధికారులకు తెలియజేయాలని కోరారు. ”సామాజిక వైషమ్యాలు సృష్టించటానికి నా, అమిత్‌ షా, జె.పి నడ్డా వంటి నాయకుల మాటలనును వక్రీకరించటానికి ప్రత్యర్థులు ఏఐను ఉపయోగిస్తున్నారు. టెక్నాలజీని ఉపయోగించుకుని ఇంతమంది నా వాయిస్‌లో ఫేక్‌ వీడియోలు తీస్తున్నారు. దీనితో ప్రమాదం ఏర్పడుతున్నది. ఏదైనా ఫేక్‌ వీడియో కనిపిస్తే పోలీసులకు సమాచారం ఇవ్వండి” అని మోడీ ప్రజలను కోరారు. ”వచ్చే నెలలో పెద్ద ఘటనను సృష్టించే యోచన ఉన్నదన్నారు. ” ఇలాంటి ఫేక్‌ వీడియోల నుంచి సమాజాన్ని రక్షించటం మన బాధ్యత. ఇలాంటి ఫేక్‌ వీడియోల వెనుక ఉన్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఈసీని నేను కోరుతున్నాను” అని ఆయన అన్నారు.40 ఏండ్లుగా ‘వన్‌ ర్యాంక్‌-వన్‌ పెన్షన్‌ పథకం అందకుండా ఉన్న సైనికుల కుటుంబాలను కాంగ్రెస్‌ వంచించిందని మోడీ తెలిపారు. దేశవ్యాప్తంగా దళితులకు రిజర్వేషన్లు లభిస్తుండగా, ఓటు బ్యాంకు రాజకీయాల కోసం కాశ్మీర్‌లో కాంగ్రెస్‌ దళితులకు కోటా రాకుండా చేసిందన్నారు. తాను జీవించి ఉన్నంత వరకు రాజ్యాంగం, మత ఆధారిత రిజర్వేషన్ల మార్పును అనుమతించబోనని మోడీ చెప్పారు.

Spread the love