ఆస్తుల్ని పిల్లలకు దక్కనివ్వరు

Children are not allowed to inherit property– పిట్రోడా ‘వారసత్వ పన్ను’ వ్యాఖ్యలపై మోడీ విమర్శలు
అంబికాపూర్‌ (ఛత్తీస్‌గఢ్‌) : కాంగ్రెస్‌ నాయకుడు శ్యామ్‌ పిట్రోడా ‘వారసత్వ పన్ను’ వ్యాఖ్యల నేపథ్యంలో ఆ పార్టీపై ప్రధానమంత్రి మోడీ తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు. ప్రజల ఆస్థులు, హక్కులు హరించాలని కాంగ్రెస్‌కు ‘ప్రమాదకరమైన ఉద్దేశాలు’ ఉన్నాయని, పిట్రోడా వ్యాఖ్యలతో ఇవి బయటకు వచ్చాయని మోడీ ఆరోపించారు. ఛత్తీస్‌గఢ్‌లోని సుర్గుజా జిల్లాలో అంబికాపూర్‌లో జరిగిన ఎన్నికల ప్రచారంలో బుధవారం మోడీ పాల్గొన్నారు. ‘కాంగ్రెస్‌ యొక్క ప్రమాదకరమైన ఉద్దేశాలు ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయి. ఇప్పుడు వారి నుంచి ‘వారసత్వపు పన్ను’ ఆలోచన బయటకు వచ్చింది’ అని విమర్శించారు. రాహుల్‌ గాంధీ సలహాదారే ఈ విషయాన్ని బహిరంగంగా వెల్లడించారని అన్నారు. ‘మీరు బతికిఉన్నంతవరకూ పన్నులతో వేధించే కాంగ్రెస్‌, మీ జీవితం ముగిసిన తరువాత కూడా మిమ్మల్ని వదిలి పెట్టదు. వారసత్వ పన్ను విధించి మీ ఆస్థులను, మీ పిల్లల హక్కులను లాక్కోవాలనుకుంటుంది’ అని మోడీ విమర్శించారు. ‘సామాన్య భారతీయులు వారి వారి ఆస్థులను వారి పిల్లలకు ఇవ్వడం కాంగ్రెస్‌కు ఇష్టం లేదు’ అని మోడీ చెప్పారు. ‘వారి నుంచి నిన్ననే ఈ ప్రకటన వచ్చినా.. వారికి ఈ ఆలోచన ఎప్పటి నుంచో ఉంది’ అని మోడీ ఆరోపించారు. ‘కాంగ్రెస్‌ దృష్టి కేవలం మీ రిజర్వేషన్‌పైనే కాదు, మీ సంపాదన, మీ ఇండ్లు, దుకాణాలు, భూములపై కూడా ఉంది. ప్రతి ఒక్కరి ఆస్తులపై ఎక్స్‌రే నిర్వహిస్తామని కాంగ్రెస్‌కు చెందిన ‘షెహజాదా’ (రాహుల్‌ గాంధీని ఉద్దేశించి) చెప్పారు. మన తల్లులు, సోదరీమణులు కలిగి ఉన్న ఇల్లు, అల్మారాతో పాటు దేశంలోని ప్రతి కుటుంబాన్ని కాంగ్రెస్‌ పరిశీలిస్తుంది, మా ఆదివాసీలు గిరిజనుల ఆభరణా లను ధరిస్తారు. వారి నుంచి మంగళసూత్రం కూడా కాంగ్రెస్‌ నాయకులు లాగేసుకుంటారు’ అని మోడీ విమర్శించారు. ‘మన దగ్గర దోచుకుని ఎవరికి పంచుతారో తెలుసా?’ అని మోడీ ప్రశ్నించారు.

Spread the love