రైతుల సాధికారతతోనే దేశాభివృద్ధి

– వ్యవసాయ రంగంలో సాంకేతికతను అందిపుచ్చుకోవాలి
– ‘నాబార్డు ఫౌండేషన్‌ డే’ లో గవర్నర్‌ తమిళిసై

నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్‌
దేశంలో 60శాతం ప్రజలు వ్యవసాయంపై ఆధారపడి జీవిస్తున్నారని, రైతుల సాధికారతతోనే గ్రామీణ భారతం అభివృద్ధి చెందుతుందని గవర్నర్‌ తమిళిసై సౌందరరాజన్‌ తెలిపారు. హైదరాబాద్‌లోని నాబార్టు కార్యాలయంలో ఆదివారం ‘నాబార్డు ఫౌండేషన్‌ డే’ కార్యక్రమంలో పాల్గొన్నారు. తెలంగాణ రాష్ట్రంలోని నాబార్డు ఆధ్వర్యంలో సక్సెస్‌పుల్‌ స్టోరీలతో ప్రచురించిన నాలుగు పుస్తకాలను గవర్నర్‌ ఆవిష్కరించారు. అంతకుముందు మిల్లెట్‌ స్టాళ్లను సందర్శించారు. గ్రామీణ మహిళలను వివరాలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఆమె మాట్లాడుతూ రైతులను ఆదుకోవడానికి బ్యాంకులు, నాబార్డు ముందుకు రావాలని, బ్యాంకు రుణాలు, ఇతర కార్యక్రమాలపై రైతులకు అవగాహన కల్పించాలని అన్నారు. రైతులను కేవలం వ్యవసాయ రంగంతోనే ముడిపెట్టకుండా వ్యాపారవేత్తలుగా మార్చడానికి ప్రత్యేక చర్యలు తీసుకోవాలన్నారు. స్వయం సహాయక మహిళా గ్రూపులకు రుణాలు ఇచ్చిన ప్రోత్సహించాలని, రైతులు పండించే పంటలను కొనుగోలు చేసేవిధంగా సాయం చేయాలని చెప్పారు. వ్యవసాయ రంగంలో సాంకేతికతను అందిపుచ్చుకోవాలని, అందుకు బ్యాంకులు సాయం చేయాలని సూచించారు. భారతదేశంలో నాయకుల విగ్రహాలు పెడుతున్నారని, అట్లాంటాలో మాత్రం వ్యవసాయ రంగానికి కీలకంగా ఉన్న కీటకాల విగ్రహాలను ప్రతిష్టించారని గుర్తుచేశారు. నాబార్డు ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మిల్లెట్‌ స్టాల్స్‌ ఆకట్టుకున్నాయని, తాను మూడు పూటలా మిల్లెట్‌ లడ్డూలు తింటానని తెలిపారు. ముఖ్యంగా మహిళలు మిల్లెట్‌ ఆహారాన్ని తీసుకుంటే ఆరోగ్యంతోపాటు అందంగా తయారవుతారని, ఈ విషయాన్ని గవర్నర్‌గా కాకుండా డాక్టర్‌గా చెబుతున్నానని వివరించారు. ఎస్‌బీఐ డిప్యూటీ మేనేజింగ్‌ డైరెక్టర్‌ అమిత్‌ జింగారన్‌ మాట్లాడుతూ నాబార్టు క్రెడిట్‌ ప్లానింగ్‌ బాగుందన్నారు. ఎస్‌హెచ్‌జీలను ఆర్థికంగా ఆదుకోవడం ద్వారా గ్రామాల్లో పేదరిక నిర్మూలన సాధ్యమవుతుందన్నారు. రైతులను స్టార్టప్‌లను ఏర్పాటు చేసేవిధంగా ప్రోత్సహించాలని సూచించారు. నాబార్డు తెలంగాణ రీజియన్‌ సీజీఎం సుశీల చింతల మాట్లాడుతూ గ్రామీణాభివృద్ధిలో నాబార్డు కీలకపాత్ర పోషిస్తున్నదని అన్నారు. అభివృద్ధి ఫలాలను అందరి అందించేందుకు చర్యలు తీసుకుంటున్నదని తెలిపారు. ఈ కార్యక్రమంలో నాబార్టు ఆంధ్రప్రదేశ్‌ రీజియన్‌ సీజీఎం ఎంఆర్‌ గోపాల్‌. యూనియన్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా సీజీఎం కారే భాస్కరరావు, ఎస్‌ఎల్‌బీసీ కన్వీనర్‌ దెబాశిశ్‌ మిత్ర, తెలంగాణ స్టేట్‌ కో-ఆపరేటివ్‌ అపెక్స్‌ బ్యాంకు ఎండీ నేతి మురళీధర్‌, తెలంగాణ గ్రామీణ బ్యాంకు చైర్‌పర్సన్‌ వై.శోభా, ఆంధ్రప్రదేశ్‌ గ్రామీణ వికాస్‌ బ్యాంకు చైర్మెన్‌ కె.ప్రతాపరెడ్డి, నాబార్టు ఏజీఎం డి.రవిశంకర్‌, అధికారులు పాల్గొన్నారు.
బోనాలకు ప్రభుత్వం ఆహ్వానించలేదు రాజ్‌భవన్‌ బోనాల వేడుకల్లో గవర్నర్‌ తమిళిసై
నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్‌
బోనాల పండుగకు రాష్ట్ర ప్రభుత్వం తనను ఆహ్వానించలేదని రాష్ట్ర గవర్నర్‌ తమిళిసై సౌందరరాజన్‌ ఆవేదన వ్యక్తం చేశారు. అయినా ఇది తనకు కొత్తేమీ కాదనీ, గతకొద్ది రోజులుగా జరుగుతున్న తంతేనని తెలిపారు. ప్రభుత్వ ఆహ్వానాలు అందినా, అందకపోయినా తాను హ్యాపీ అనీ, తెలంగాణ ప్రజలే తనకు పరివార్‌ అని చెప్పారు. అందుకే రాజ్‌భవన్‌లో బోనాల వేడుకలు నిర్వహిస్తున్నట్టు చెప్పారు. ఆదివారం హైదరాబాద్‌ లాల్‌దర్వాజా బోనాల సందర్భంగా రాజ్‌భవన్‌లోని నల్లపోచమ్మ అమ్మవారి ఆలయంలో గవర్నర్‌ బోనం సమర్పించి వడి బియ్యం పోశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ తెలంగాణ ప్రజలందరికీ బోనాల శుభాకాంక్షలు తెలిపారు. రాష్ట్ర ప్రజలంతా సుఖ సంతోషాలు, ఆయురారోగ్యాలతో ఉండాలని ఆకాం క్షించారు. తెలంగాణ సంస్కతీ సంప్రదాయాలకు ప్రతీకగా బోనాలు జరుపుకొంటున్నారని తెలిపారు. మరోవైపు చంద్రయాన్‌-3ను విజయవంతంగా ప్రయోగించిన ఇస్రో శాస్త్రవేత్తలకు గవర్నర్‌ అభినందనలు తెలిపారు.

Spread the love