‘నయా కహాని’

ఏం బామ్మర్ది ఎలక్షన్‌ దగ్గర కొస్తున్నా కొద్ది మనిషివి కంటికి కనిపించకుండా పోతివి. ఏంది కథ ఏం నడుస్తుంది.
ఏముంది బావ పోయినసారి కంటే గీసారి ఇంకా ఎక్కువ సీట్లు గెలవనింకె తిప్పలపడుతున్నాం.
ఖాళీగుంటే పార్టీ యూత్‌ ప్రెసిడెంట్‌ కుర్చినుండి ఖాళీ చేయిస్తామంటున్నారే.
అందుకే ఇంగా బయట యాడ కనిపిస్తలేను.
అగో బావుంది గీ ముచ్చట. అవును గాని జరిట్రా ఒక ముచ్చట చెప్పాలే నీకు.
ఏందీ బావ రేషన్‌, పింఛను గాని ఇస్తలేరా ఏందీ?
ఏ నువ్వుండగా నాకేం ఫికర్‌ కాని, మన బాయి కాడా పొలం దగ్గర మన శీనుగాడి అదే నీ దోస్తుది ఎనిమిది గుంటల భూమి ఉంది కదా అది నాపోంటి పట్టా చేపియరాదు. నేనిచ్చే ధరకెట్లా వాడు అమ్మడు. రాళ్ళు పాతి లొల్లి చేస్తా, ఎట్లా ఎమ్మెల్యే నీ మాట ఇంటడుకదా మళ్ళోచ్చే ఎలక్షన్స్‌ లా గీ ఛాయిస్‌ దొరుకుతదో లేదో… ఏమంటావ్‌?
ఏం మాట్లాడుతున్నావ్‌ బావ పోయినసారే స్కీమ్‌లా పేర్లతో మనం చేసింది పెద్ద తప్పు. నీకు కావాల్సినోల్లకే ఇప్పించుకున్నావ్‌ అని ఊరంతా గునుగుతుంటే ఆ లొల్లి సరిపోదని మళ్ళా కొత్త లోల్లి తెచ్చి పెడ్తావ్‌. అయినా ఇది అసలే ఎలక్షన్లా టైమ్‌.
అందుకేరా బామ్మర్ది దొరికినప్పుడే దోసుకోవాలే అంటున్నా. వేడిగున్నప్పుడు అన్నం తింటేనే మంచిగుంటది.
నేను చెప్పేది సమజ్‌ అయ్యిందా. ఇప్పుడు నువ్వేది అడిగినా కాదనరు.
సర్లే చూద్దాం తీరు. అవును గానీ వచ్చే ఎలక్షన్లా చాయిస్‌ ఉంటదో లేదో అంటున్నావేంది బావా కండువా ఏమైనా మార్సుకున్నావా ఏంది?… మార్సుకుంటే చెప్పు తీసుకున్నదంతా ఇచ్చేదువు గానీ.
సరే గీ ముచ్చట్లన్ని తర్వాత మాట్లడ్తా, పార్టీ మేనిఫెస్టో ప్రిపేర్‌ చేసుకోవాలే.
అందుకు ప్రజల అభిప్రాయం, అవసరాలు, సమస్యలు తెల్సుకోవడానికి పోతున్నా తర్వాత గలుస్తా…
జరగారదే… ఆ భూమి సంగతేమి తియ్యను గాని నిమళ్ళంగా కూసో.
గీదింత ముచ్చటకు ఎండలా పడి యాడంటా తిరుగుతావ్‌.
అవసరాలు, అభిప్రాయలు, సమస్యలని ఏవో పెద్ద పెద్ద మాటలు మాట్లాడపడితివి. మన ఇళ్ళకాల అంతా అభివృద్దే అని పేపర్లా, టివి లా గంతా పెద్ధగా చూపిస్తుర్రు. న్యూస్‌ చూసేటట్టు లేవు గదా నువ్వు.
అది గాదు బావా ఇంక ఏమైనా సమస్యలు,
పాతవి ఇంకా ఇప్పటికి పూర్తికానివి ఇసోంటివి ఏమైనా ఉంటాయేమో అని.
ఓ గట్లనా సరే గాని ఒకవేళ మళ్ళా గెలిస్తే మొదట ఏం చేద్దాం అనుకుంటున్నారు. ఏముంది బావా రాష్ట్రన్నంతా లిక్కర్‌తో లీడ్‌ చేస్తున్నాం అన్నా సంగతి నీకు ఎరుకనే గదా! ఈ మేధావులు, పక్క పార్టీలు దుమ్ముత్తే పోస్తున్నారు. ప్రజలను తాగుబోతులను చేస్తున్నారు, రోగాల బారిన పడేస్తున్నారు అది ఇది అని తిడుతూ ఓర్వలేకపోతున్నారు. అదే లీడ్‌ చేసే లిక్కరు, లిస్ట్‌లో లీస్ట్‌కి పోతే అభివృద్దికి అప్పులు చేయాల్సి ఒస్తదేమోనే….
ఓస్‌ గింతేనా… తాగి ఆరోగ్యం చెడిపోయినళ్ళకు ఆసుపత్రిలో ఫ్రీ ట్రిట్‌ మెంట్‌ కింద కొత్త స్కీమ్‌ బెట్టుర్రి. ఎట్లాగో ప్రజల సొమ్మును కాజేయటంలో ప్రావీణ్యులు కాబట్టి లిక్కర్‌ మీద ధర పెంచుండ్రి.
నరం లేని నాలుక ఆగుతాదా ఏందీ…
సలహా ఇస్తున్నట్లే అనిపిస్తున్నా తిట్టినట్టు వినిపిస్తుందేందీ బావా..
అరే నేను నిన్నెందుకు తిడ్తరా, చెప్పు ఇంకేమ్‌ చేద్దాం అనుకుంటున్నారు.
ఇంకేముంది బావా, జర పోరాగండ్లు గుస్సయితున్నట్టు కనిపిస్తున్నది ఏదో ఓ భృతి పేరుమీద సహాయం చేయాలే, అమ్మలక్కలకు ఏం కావాలో తెలుసుకోని ఆలోచించుకొని కొత్తగా ఏదైనా చేయాలి.
అట్లనా ఆ భృతితోనా స్థితిగతులేం మారావ్‌ గాని, జీవితాలను నిలబెట్టే పనులేమైనా ఉంటే చేయండి.
పొద్దుమూకే దాకా ఫోన్లనే ఉంటారని కొత్త తెలివితోనా నెల నెల రిచార్జులు, రిచార్జులకు లోన్లులిచ్చే హామిలుగిట్లా ఏమైనా ప్రిపేర్‌ చేస్తున్నరా ఏంది?
నెల జీతం కోసం జీవితం అంతా త్యాగం చేస్తుర్రు గాళ్ళ ఆశల మీద నీళ్ళు సల్లకుండ్రి…
ఏంది బావో… అన్ని తీసుకుంటూనే తిరుగుబాటు చేస్తున్నట్టున్నావ్‌…
ఏందీ కథ పక్క పార్టీలేమైనా కమీషన్‌ ఇస్తామన్నారా ఏందీ..?
ఏ ఊకోరా… అన్నింటిని తప్పుపట్టట్లే… రేపటి తరాన్ని నిలబెట్టేది మీరే గదరా ఉచిత పథకాల పేర్లతో ఊరిస్తే మీకు ఉపాదేట్లా, ఉన్నోడు ఉన్నోడుగానే వెనకేసుకుంటాడు గాని లేనోడేమైపోతాడేమో అని ఫికరు. ఏమైనా ప్రజల సమస్యలు శాశ్వతంగా పోగొట్టే పథకం తెస్తే ఈ తిప్పలన్నీ ఉండవుగా!

– పి.సుష్మ

Spread the love