నీట్‌ అవకతవకలపై విచారణ జరపాలి

CPI(M) State Secretary Tammineni– బాధ్యులను కఠినంగా శిక్షించాలి
– విద్యార్థుల ఆందోళనలకు పరిష్కారం చూపాలి : సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని
– ఈనెల 20న ధర్నాలు, ప్రదర్శనలకు పిలుపు
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌
జాతీయ అర్హత, ప్రవేశ పరీక్ష (నీట్‌)లో జరిగిన అవకతవకలపై న్యాయ విచారణ జరిపి, బాధ్యులను కఠినంగా శిక్షించాలని భారత కమ్యూనిస్టు పార్టీ (మార్క్సిస్టు)- సీపీఐ(ఎం) రాష్ట్ర కమిటీ కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేసింది. నష్టపోయిన విద్యార్థులకు న్యాయం జరిగేలా తక్షణ చర్యలు తీసుకోవాలని కోరింది. ఈ మేరకు ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం సోమవారం ఒక ప్రకటన విడుదల చేశారు. మోడీ నాయకత్వంలోని బీజేపీ/ఎన్డీయే పాలనలో ఉన్నత చదువుల కోసం నిర్వహిస్తున్న ప్రవేశ పరీక్షల్లో అవకతవకలు, లీకేజీలు సర్వసాధారణంగా మారాయని విమర్శించారు. విద్యార్థుల జీవితాలు గందరగోళమయ్యాయని ఆందోళన వ్యక్తం చేశారు. నీట్‌కు సంబంధించి బీహార్‌, గుజరాత్‌లలో ప్రశ్నాపత్రాలు లీక్‌ చేశారనీ, పెద్దఎత్తున అవకతవకలు జరిగాయని తెలిపారు. ఈ పరీక్షలు రాసిన 24 లక్షల మంది విద్యార్థులు, వారి కుటుంబాలు తీవ్ర ఆందోళనలో ఉన్నాయని పేర్కొన్నారు. తెలుగు రాష్ట్రాలనుంచి అత్యధిక సంఖ్యలో విద్యార్థులు ఈ ప్రవేశ పరీక్షలు రాశారని వివరించారు. న్యాయ విచారణకు ఆదేశించాలనీ కేంద్ర ప్రభుత్వాన్ని ఆయన డిమాండ్‌ చేశారు. విద్యార్థుల కుటుంబాలకు న్యాయం చేయాలని కోరుతూ ఈ నెల 20న అన్ని జిల్లాకేంద్రాల్లో నిరసన ప్రదర్శనలు, ధర్నాలు చేయాలని పిలుపునిచ్చారు.

Spread the love