రాష్ట్ర ప్రభుత్వ నిధులతోనే కొత్త మెడికల్‌ కాలేజీలు

– కేంద్రానిది రూపాయి కూడా లేదు : వైద్యారోగ్యశాఖ
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌
రాష్ట్రంలో కొత్తగా ఏర్పాటు చేయబోతున్న తొమ్మిది మెడికల్‌ కాలేజీలు పూర్తిగా ఇక్కడి ప్రభుత్వ నిధులతో ఏర్పాటవుతున్నవేనని రాష్ట్ర వైద్యారోగ్యశాఖ స్పష్టం చేసింది. ఈ మేరకు గురువారం ఆ శాఖ ఒక ప్రకటన విడుదల చేసింది. వాటి ఏర్పాటులో కేంద్ర ప్రభుత్వానిది ఒక్క రూపాయి కూడా లేదని తెలిపింది. రాష్ట్రంలో తొమ్మిది ప్రభుత్వ, నాలుగు ప్రయివేటు మొత్తం 13 మెడికల్‌ కాలేజీలకు నేషనల్‌ మెడికల్‌ కమిషన్‌ ఈ ఏడాది అనుమతి ఇచ్చిందని వివరించింది. వాటికి కేంద్రం ఆమోద ముద్రంటూ సామాజిక మాధ్యమాల్లో వస్తున్న వార్తలు పూర్తిగా అవాస్తవమని కొట్టేసింది. ఎన్‌ఎంసీ స్వతంత్ర ప్రతిపత్తి కలిగిన సంస్థ అనీ, నిర్దేశించిన అన్ని నిబంధనలు సంతృప్తిగా పరిచేలా ఉన్నాయా? లేవా? అని పలుమార్లు పరిశీలించిన అనంతరం మెడికల్‌ కాలేజీలకు అనుమతి ఇస్తుందని వెల్లడించింది.

Spread the love