కాంగ్రెస్‌తో ఇక చర్చల్లేవ్‌

కాంగ్రెస్‌తో ఇక చర్చల్లేవ్‌– మరో మూడు స్థానాలకు అభ్యర్థులు ఖరారు : సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం
నవతెలంగాణ – ఖమ్మం ప్రాంతీయ ప్రతినిధి
కాంగ్రెస్‌తో ఇక చర్చలకు తావు లేదని, 19 నియోజకవర్గాల్లో సీపీఐ(ఎం) పోటీ చేస్తుందని ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం స్పష్టం చేశారు. ఇప్పటికే రాష్ట్రవ్యాప్తంగా 16 నియోజకవర్గాలకు అభ్యర్థులను ప్రకటించామని, తాజాగా మరో మూడు స్థానాలకు ఎంపిక చేశామన్నారు. ఖమ్మంలోని సుందరయ్య భవనంలో మంగళవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఇల్లందు నియోజకవర్గంలో సీపీఐ (ఎంఎల్‌) ప్రజాపంథాతో చర్చలు జరిపామన్నారు. అనివార్యంగా తామే పోటీ చేయాల్సి వస్తుందని, ఈ స్థానం నుంచి గిరిజన సంఘం నాయకులు దుగ్గి కృష్ణ బరిలో ఉంటారని ప్రకటించారు. అలాగే ఉమ్మడి నల్లగొండ జిల్లాలోని కోదాడ స్థానం నుంచి వ్యవసాయ కార్మిక సంఘం నాయకులు మట్టిపల్లి సైదులు, మునుగోడు నుంచి దోనూరి నర్సిరెడ్డి పోటీలో ఉంటున్నట్టు తెలిపారు.కోమటిరెడ్డి రాజగోపాల్‌ తిరిగి కాంగ్రెస్‌లో చేరి మునుగోడు నుంచి పోటీ చేస్తున్నారనీ, కాంగ్రెస్‌తో పొత్తు ఉన్నప్పటికీ సీపీఐ తమ పార్టీ అభ్యర్థికి మద్దతు ఇవ్వాల్సిందిగా కోరారు.
కాంగ్రెస్‌ నుంచి స్పందనలు..
కాంగ్రెస్‌ నుంచి స్పందనలు వచ్చాయని, అఖిల భారత స్థాయిలో తమ పార్టీ నాయకత్వాన్ని ఏఐసీసీ ముఖ్య నాయకులు సోనియాగాంధీ సంప్రదించారని తమ్మినేని తెలిపారు. సీపీఐ తరహాలోనే ఒక అసెంబ్లీ స్థానంతో పాటు రెండు ఎమ్మెల్సీలకు అంగీకరించాల్సిం దిగా ప్రతిపాదనలు పంపారని చెప్పారు. కానీ తమ పార్టీ రాష్ట్ర నాయకత్వం కాంగ్రెస్‌ ప్రతిపాదనను తిరస్కరించిందని తెలిపారు. స్వతంత్రంగా పోటీ చేయడమే ఉత్తమమనే నిర్ణయానికి వచ్చామన్నారు. దీన్ని బట్టి ఇకమీదట కాంగ్రెస్‌తో ఎలాంటి చర్చలకు అవకాశం లేదని స్పష్టంచేశారు. పార్టీ కమిటీల అభిప్రాయాలకు అనుగుణంగా మిగతా స్థానాల్లో పోటీపై నిర్ణయాలు తీసుకుంటామన్నారు. సీపీఐ(ఎం) అభ్యర్థులతో పాటు తమ పార్టీ బలపరిచే అభ్యర్థులను గెలిపించాల్సిందిగా పిలుపునిచ్చారు. సమావేశంలో సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు పోతినేని సుదర్శన్‌, పాలడుగు భాస్కర్‌, జిల్లా కార్యదర్శి నున్నా నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.

Spread the love