విచారణలోనే ఆరోపణల వాస్తవాలు తేలల్చాలి : హైకోర్టు
ఆత్మహత్య నోట్‌లో పేర్లు లేవన్న కారణంతో కేసు రద్దు చేయలేం
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
అదనపు కట్నం కోసం వేధింపులకు గురిచేసి మహిళ ఆత్మహత్యకు పాల్పడినట్టు నమోదైన కేసులో నిందితులపై కొనసాగుతున్న క్రిమినల్ చర్యలను రద్దు చేసేందుకు హైకోర్టు నిరాకరించింది. ఫిర్యాదు, చార్జిషీట్, సాక్షుల వాంగ్మూలాల్లో నిందితులపై నిర్దిష్ట ఆరోపణలు ఉన్నందున వాటి నిజానిజాలను విచారణలోనే తేల్చాల్సి ఉంటుందని స్పష్టం చేసింది. ఈ మేరకు జస్టిస్ జె. శ్రీనివాస్‌రావు సెప్టెం బర్ 1న క్రిమినల్ పిటిషన్ నంబర్లు 13192, 13370 /2026పై ఉమ్మడి ఉత్తర్వులు జారీ చేశారు. చెన్నబోయిన సాయి కృష్ణ (ఏ1), చెన్నబోయిన స్వరూపారాణి (ఏ3), మరో ముగ్గురు నిందితులు సెక్షన్ 528 బీఎన్ఎస్ఎస్ కింద దాఖలు చేసిన పిటిషన్లను కోర్టు కొట్టివేసింది.
కేసు వివరాల ప్రకారం.. చెన్నబోయిన సౌందర్యకు సాయి కృష్ణతో 2019 నవంబర్ 10న వివాహం జరిగింది. 2021 ఆగస్టు 5న వారికి కుమారుడు జన్మించాడు. వివాహం అనంతరం అదనపు కట్నం కోసం తన కుమార్తెను భర్త, అత్తమామలు వేధించారని సౌందర్య తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేశారు. మొదట 498-ఏ, 306, 109 ఐపీసీ కింద కేసు నమోదు కాగా, దర్యాప్తు అనంతరం 304-బీ ఐపీసీ కింద మార్చారు. దర్యాప్తు అధికారి 26 మంది సాక్షుల వాంగ్మూలాలను నమోదు చేసి చార్జిషీట్ దాఖలు చేశారు. కేసు ఎస్.సి. నంబర్ 626/2023గా సెషన్స్ కోర్టుకు వెళ్లింది. చార్జిషీట్‌లోని వివరాల ప్రకారం… వివాహ సమయం లో సౌందర్య తల్లిదండ్రులు 25 తులాల బంగారం, రూ.4 లక్షల కట్నం ఇచ్చారని, అనంతరం మరో రూ.10 లక్షల అదనపు కట్నం తీసుకురావాలని ఆమెను వేధించారని ఆరోపణలు ఉన్నాయి. గర్భవతిగా ఉన్న సమయంలోనూ ఆమెను శారీరకంగా, మానసికంగా వేధించారని, తల్లిదండ్రుల ఇంట్లో ఉన్న సమయంలోనూ సాయి కృష్ణ ఫోన్ ద్వారా అదనపు కట్నం కోసం ఒత్తిడి చేశాడని చార్జి షీట్‌లో పేర్కొన్నారు. 2022 మే 10న సౌందర్యను తిరిగి అత్తింటికి తీసుకెళ్లిన తర్వాత కూడా అదనపు కట్నంతో పాటు ఆమె జీతాన్ని ఇవ్వాలని డిమాండ్ చేసినట్టు, కొట్టి నట్టు ఆరోపణలు నమోదయ్యాయి. సౌందర్య అరో బిందో ఫార్మా కంపెనీ, మియాపూర్‌లో ఉద్యోగం చేస్తూ నెలకు రూ.30 వేల జీతం పొందుతున్నట్టు రికార్డుల్లో ఉంది.
2023 జనవరి 25న సౌందర్య ఉదయం తన కుమారుడిని తల్లిదండ్రుల వద్ద ఉంచి ఉద్యోగానికి వెళ్లింది. సాయంత్రం 6 గంటలకు తిరిగి వచ్చి కుమారుడిని తీసుకుని అత్తింటికి వెళ్లింది. సాయంత్రం 6.15 గంటలకు ఆమె సోదరుడు ఫోన్ చేయగా ఇంటికి సురక్షితంగా చేరుకున్నట్టు చెప్పింది. రాత్రి 8 గంటలకు ఫోన్ చేసినా స్పందించలేదు. రాత్రి 9 గంటలకు సౌందర్య తండ్రికి ఫోన్ రావడంతో వాళ్ళు ఆస్పత్రికి వెళ్లగా, ఆమె స్ట్రెచర్‌పై పడి ఉండటాన్ని చూశారు. ఆమె మెడపై గాయం గుర్తు ఉన్నట్టు ఫిర్యాదులో పేర్కొన్నారు. ఇంట్లో సీలింగ్ ఫ్యాన్‌కు చున్నీతో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నట్టు దర్యాప్తు రికార్డుల్లో ఉంది.
నిందితుల తరఫు న్యాయవాది వాదిస్తూ.. సౌందర్య రాసిన సూసైడ్ నోట్‌లో నిందితుల పేర్లు లేవని, ఆత్మ హత్యకు వారెవరూ ప్రేరేపించినట్టు అందులో పేర్కొనలేదని తెలిపారు. ఫిర్యాదు, సాక్షుల వాంగ్మూలాల్లోనూ నిర్దిష్ట ఆరోపణలు లేవని, సాధారణ ఆరోపణల ఆధారంగానే కుటుంబ సభ్యులను కేసులో ఇరికించారని పేర్కొన్నారు. అయితే ప్రభుత్వ తరఫు అదనపు పబ్లిక్ ప్రాసిక్యూటర్ జితేందర్‌రావు వీరమళ్ల వాదిస్తూ.. చార్జిషీట్, సాక్షుల వాంగ్మూలాల్లో నిందితుల పాత్రపై నిర్దిష్ట ఆరోపణలు ఉన్నాయని, అదనపు కట్నం, జీతం కోసం వేధింపులు కొనసాగాయని తెలిపారు. వివాహమైన ఏడేళ్లలోపే మరణం సంభవించినందున 304-బీ ఐపీసీ నిబంధనలు వర్తిస్తాయని వాదించారు.
సూసైడ్ నోట్‌లో నిందితుల పేర్లు లేకపోవడం ఒక్కటే కారణంతో కేసును రద్దు చేయలేమని హైకోర్టు పేర్కొంది. సుప్రీంకోర్టు నరేశ్‌కుమార్ వర్సెస్ స్టేట్ ఆఫ్ హర్యానా తీర్పును ప్రస్తావిస్తూ, సూసైడ్ నోట్‌ను మొత్తం పరిస్థితులకు సంబంధించిన సమగ్ర పత్రంగా పరిగణించలేమని తెలిపింది. కేసులోని ఇతర ఆధారాలు, పరిసర పరిస్థితులు, వేధింపులు, కట్నం డిమాండ్‌కు సంబంధించిన ఆరోపణల ను కూడా పరిశీలించాల్సి ఉంటుందని పేర్కొంది. కేసులో సాక్షులుగా సౌందర్య తల్లిదండ్రులు, సోదరుడు, పొరుగు వారు, సహోద్యోగులు, సంఘటనకు సంబంధించిన సీసీటీవీ ఫుటేజీ అందించిన వ్యక్తి, వైద్యులు, ఫోరెన్సిక్ అధికారులు తదితరులు ఉన్నారని కోర్టు గుర్తించింది. ఆరోపణలు నిజమా కాదా, సాక్ష్యాలకు ఎంత విలువ ఉందన్నది విచారణలో తేలాల్సి ఉందని స్పష్టం చేసింది. చార్జిషీట్‌లో 304-బీ ఐపీసీ నేరానికి సంబంధించిన ప్రాథమిక అంశాలు ఉన్నందున ఈ దశలో దానిని రద్దు చేయడానికి కారణం లేదని పేర్కొంది. ఫిర్యాదులో నేరానికి సంబంధించిన అంశాలు వెల్లడైనప్పుడు విచారణకు ముందే కేసును రద్దు చేయడం సరికాదని, బీఎన్ఎస్ఎస్ సెక్షన్ 528 కింద హైకోర్టుకు ఉన్న అంతర్గత అధికారాన్ని ఉపయోగించి చట్టబద్ధమైన ప్రాసిక్యూషన్‌ను అడ్డుకోలేమని జస్టిస్ జె. శ్రీనివాస్‌రావు స్పష్టం చేశారు. దీంతో సాయి కృష్ణతో పాటు స్వరూపారాణి, మరో ముగ్గురు నిందితులు దాఖలు చేసిన రెండు క్రిమినల్ పిటిషన్లను కొట్టివేశారు.
కేటీఆర్ సిబ్బందికి ఊరట
రాష్ట్ర మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పీఆర్వో మహేశ్ మాణిక్య, వ్యక్తిగత సహాయకుడు మహేందర్‌రెడ్డిలకు హైకోర్టులో ఊరట లభించింది. సైఫాబాద్ పోలీసులు నమోదు చేసిన కేసుల్లో తదుపరి విచారణ వరకు వారిపై కఠిన చర్యలు తీసుకోవద్దని పోలీసులను ఆదేశించింది.
ఈ నెల 7న అసెంబ్లీ వద్ద పోలీసుల విధులకు ఆటంకం కలిగించేలా బీఆర్ఎస్ నేతలను రెచ్చగొట్టారన్న ఆరోపణలతో వారిపై కేసు నమోదైంది. ఎఫ్ఐఆర్‌లను కొట్టివేయా లంటూ వారు దాఖలు చేసిన పిటిషన్లను జస్టిస్ జె.శ్రీనివాసరావు శుక్రవారం విచారించారు. పోలీసులకు, ఫిర్యాదు దారుకు నోటీసులు జారీ చేశారు. తదుపరి విచారణను ఈ నెల 21కి వాయిదా వేశారు.
అదనపు కట్నం వేధింపుల కేసు కొట్టివేతకు ‘నో’
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



