వైద్య రంగంలో ఇద్దరికి నోబెల్‌

Nobel for two in the field of medicine– కోవిడ్‌ టీకాల అభివృద్ధికి కృషి చేసినందుకు…
స్టాకహేోమ్‌ : వైద్య శాస్త్రంలో విశేష కృషి చేసిన ఇద్దరు శాస్త్రవేత్తలను నోబెల్‌ బహుమతి వరించింది. మానవ ఆరోగ్యానికి పెను ముప్పుగా పరిణమించిన కోవిడ్‌ మహమ్మారిని ఎదుర్కొనేందుకు ఎంఆర్‌ఎన్‌ఏ టీకాలను అభివృద్ధి చేసిన విషయం తెలిసిందే. ఈ వ్యాక్సిన్ల తయారీకి దోహదపడిన పరిశోధనల్లో కీలక భాగస్వాములైన కాటలిన్‌ కరికో, డ్రూ వెయిస్‌మన్‌లకు ఈ సంవత్సరపు నోబెల్‌ పురస్కారం లభించింది. హంగరీకి చెందిన కరికో సాగన్‌ విశ్వవిద్యాలయంలో ప్రొఫెసర్‌గా, పెన్సిల్వేనియా యూనివర్సిటీలో అనుబంధ ప్రొఫెసర్‌గా పనిచేస్తున్నారు. ఆమె 2022 వరకూ బయాన్‌టెక్‌ ఆర్‌ఎన్‌ఏ ఫార్మస్యూటికల్స్‌లో సీనియర్‌ ఉపాధ్యక్షురాలిగా కూడా పనిచేశారు. ఇక అమెరికాకు చెందిన వెయిస్‌మన్‌ పెన్సిల్వేనియా యూనివర్సిటీకి చెందిన పెరల్‌మాన్‌ వైద్య పాఠశాలలో టీకాల పరిశోధనా విభాగంలో ప్రొఫెసర్‌గా పనిచేస్తున్నారు. స్వీడన్‌లోని స్టాకహేోమ్‌లో ఉన్న కరోలిన్‌స్కా ఇన్‌స్టిట్యూట్‌ వైద్య విశ్వవిద్యాలయంలో నోబెల్‌ కమిటీ సోమవారం ఈ అవార్డులను ప్రకటించింది. విజేతలకు రూ.8.3 కోట్ల నగదు పురస్కారం లభిస్తుంది. శాస్త్రవేత్తలు ఇద్దరూ పెన్సిల్వేనియా విశ్వవిద్యాలయంలో పరిశోధనలు నిర్వహించారు. విజేతలకు ఈ నెల 10న నోబెల్‌ పురస్కారాలు అందజేస్తారు. స్వీడన్‌కు చెందిన ప్రముఖ శాస్త్రవేత్త, ఇంజినీర్‌, వ్యాపారవేత్త ఆల్‌ఫ్రెడ్‌ నోబెల్‌ పేరిట ప్రపంచంలో వివిధ రంగాలలో విశేష కృషి చేసిన వారికి ఈ అవార్డులు ప్రదానం చేస్తున్న విషయం తెలిసిందే.

Spread the love