గుజరాత్‌లో ఒక్క రైతూ లబ్ది పొందలే

– కేంద్ర ప్రాయోజిత పథకం ‘బీజ్‌ గ్రామ్‌ యోజన’ పని తీరు
– రెండేండ్లుగా నిధులు విడుదల చేయని కేంద్రం
– స్వంత రాష్ట్రాన్నే పట్టించుకోని మోడీ
– కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై రైతుల ఆగ్రహం
– పంటలకు సిద్ధమవుతున్న సమయంలో అన్నదాతకు తప్పని కష్టాలు
న్యూఢిల్లీ : ప్రధాని మోడీ తన స్వంత రాష్ట్రం గుజరాత్‌లోని రైతులను పట్టించుకోవటం లేదు. ఇందుకు కేంద్ర ప్రాయోజిత పథకం ‘బీజ్‌ గ్రామ్‌ యోజన'(సీడ్‌ విలేజ్‌ ప్రోగ్రామ్‌) పని తీరే నిదర్శనం. ఈ పథకం కింద రెండేండ్లుగా కేంద్రంలోని మోడీ సర్కారు నిధులు విడుదల చేయలేదు. దీంతో బీజ్‌ గ్రామ్‌ యోజన కింద గుజరాత్‌లోని ఒక్క రైతు కూడా ప్రయోజనాన్ని పొందలేకపోయాడని ప్రభుత్వ గణాంకాలు వెల్లడిస్తున్నాయి. దీంతో ఇటు వర్షకాలం సమీపించి విత్తుకు రైతులు సిద్ధమవుతున్న తరుణంలో మోడీ సర్కారు తీరు తమకు శాపంగా మారిందని రైతన్నలు వాపోతున్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల పని తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
రైతన్నకు నకిలీ కష్టాలు
రైతులు చౌక ధరలకు నాణ్యమైన విత్తనాలు అందేలా ఆర్థిక సాయం చేయటం సదరు పథకం ఉద్దేశ్యం. 2014లో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. అయితే, కేంద్రం 2021-22 మరియు 2022-23 సంవత్సరాలకు గానూ బీజ్‌ గ్రామ్‌ యోజనకు నిధులు విడుదల చేయలేదు. మరోపక్క, రైతన్నలను నకిలీ వీరులు టార్గెట్‌ చేస్తున్నారు. మాయమాటలు చెబుతూ రాష్ట్రంలోని రైతన్నలకు నకిలీ విత్తనాలను అంటగడుతున్నారు. దీంతో రాష్ట్రంలో అనేక మంది రైతులు నకిలీ ఊబిలో చిక్కుకుపోయి మోసపోతున్నారని రైతు నాయకులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
రెండేండ్లలో కూడా ప్రయోజనం పొందని రైతు
ప్రభుత్వ గణాంకాల ప్రకారం.. బీజ్‌ గ్రామ్‌ యోజనను ప్రారంభించినపుడు గుజరాత్‌లో 11,052 మంది రైతులు లబ్ది పొందారు. అయితే, ఆ సంఖ్య తర్వాతి ఏడాదికి 1,223కు తగ్గటం గమనార్హం. 2016, 2017 ఏడాదుల్లో అయితే ఏ ఒక్క రైతు కూడా ఈ పథకం కింద ప్రయోజనం పొందలేదు. 2018లో 1849 మంది, 2019లో 7,301 మంది రైతులు మాత్రమే లబ్ది పొందారు.
2020లో ఈ సంఖ్య అత్యధికంగా 15,984కి చేరింది. కానీ, 2021 మరియు 2022లో మాత్రం గుజరాత్‌లోని ఏ ఒక్క అన్నదాత కూడా ఈ పథకం కింద లబ్దిని పొందలేదు.
లోక్‌సభలో ఎంపీ ఉపేంద్ర సిన్హ్‌ రావత్‌ అడిగిన సమాధానానికి కేంద్రం సమాధానమిస్తూ.. 2020-21లో కేటాయించిన మొత్తం 1.56 కోట్లు పూర్తిగా వినియోగం జరిగిందనీ, 2021-22 మరియు 2022-23లో మాత్రం ప్రభుత్వం (కేంద్రం) ద్వారా ఎలాంటి నిధులూ విడుదల కాలేదని వివరించటం గమనార్హం.
స్పందించని రాష్ట్ర ప్రభుత్వం.. కాంగ్రెస్‌ ఆగ్రహం
కాగా, బీజ్‌ గ్రామ్‌ యోజనపై ప్రశ్నలకు సంబంధించి గుజరాత్‌ వ్యవసాయ మంత్రి రాఘవ్‌జీ పటేల్‌ స్పందించలేదు. దీంతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల పని తీరుపై గుజరాత్‌లోని ప్రధాన ప్రతిక్షం కాంగ్రెస్‌ ఆగ్రహం వ్యక్తం చేసింది. రాష్ట్ర వ్యవసాయం విభాగం కేంద్రానికి ప్రతిపాదన పంపాల్సిన అవసరం ఉన్నదని గుజరాత్‌ కాంగ్రెస్‌ రైతు విభాగం అధ్యక్షులు పాల్‌ అంబ్లియా అన్నారు.
కేంద్రంలో, రాష్ట్రంలో తమ ప్రభుత్వమే ఉంటే డబుల్‌ ఇంజిన్‌ సర్కారుతో అభివృద్ధి, సంక్షేమంలో ముందుకెళ్లొచ్చని చెప్పిన మోడీ.. సాక్షాత్తూ తన స్వంత రాష్ట్రం విషయంలోనే రైతులను నిర్లక్ష్యం చేస్తున్నారని రైతు సంఘాల నాయకులు, సామాజికవేత్తలు ఆరోపించారు. ఇటు రాష్ట్రంలో, అటు కేంద్రంలో బీజేపీ ప్రభుత్వాలే ఉన్న రైతులకు ఒరిగిందేమీ లేదని అన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తమ బాధ్యతను గుర్తెరిగి రైతులను ఆదుకోవాలని డిమాండ్‌ చేశారు.

Spread the love