ఎన్టీఏను రద్దు చేయాలి

NTA should be abolished– ‘నీట్‌’ లీకేజీపై సుప్రీంజడ్జితో సమగ్ర విచారణ జరిపించాలి
– మళ్లీ పరీక్ష నిర్వహించాలి

– ప్రధాని మోడీ, బీజేపీ నాయకత్వం స్పందించాలి
– రాష్ట్ర వ్యాప్తంగా కదం తొక్కిన విద్యార్థి, యువజన లోకం
– కేంద్ర విద్యాశాఖ మంత్రి రాజీనామాకు డిమాండ్‌
– కేంద్రం దిష్టిబొమ్మలు దహనం
నీట్‌ పేపర్‌ లీకేజీకి కారణమైన ఎన్టీఏ సంస్థను తక్షణమే రద్దు చేయాలి.. అవకతవకలపై సుప్రీంకోర్టు జడ్జితో సమగ్ర విచారణ జరిపించాలి.. నైతికంగా కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ రాజీనామా చేయాలి.. ప్రధాని మోడీ, బీజేపీ నాయకత్వం స్పందించాలి.. నీటి పరీక్షను మళ్లీ నిర్వహించాలంటూ.. శుక్రవారం రాష్ట్ర వ్యాప్తంగా విద్యార్థులతో కలిసి యువత కదం తొక్కింది. విద్యార్థి సంఘాలు, యువజన సంఘాలతోపాటు పలుచోట్ల కాంగ్రెస్‌ ఆధ్వర్యంలో ధర్నాలు చేపట్టారు. కేంద్రం దిష్టిబొమ్మలు దహనం చేశారు.
నవతెలంగాణ- విలేకరులు
రంగారెడ్డి జిల్లా దిల్‌సుఖ్‌నగర్‌లో ఎస్‌ఎఫ్‌ఐ ఆధ్వర్యంలో రాస్తారోకో చేశారు. ఈ సందర్భంగా సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి టి.నాగరాజు పాల్గొని మాట్లాడుతూ.. నీట్‌ పరీక్ష పత్రాలు బీజేపీ పాలిత రాష్ట్రాలైన బీహార్‌, గుజరాత్‌, హర్యానాలోనే లీకయ్యాయని, అందులో బీజేపీ నాయకుల పాత్ర కీలకంగా ఉందని అన్నారు. ఈ కుంభకోణంపై సిట్టింగ్‌ జడ్జితో విచారణ జరిపించాలని డిమాండ్‌ చేశారు. కేంద్ర విద్యా శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ రాజీనామా చేయాలని, నీట్‌ పరీక్షను రద్దు చేయాలని కోరారు. లేని పక్షంలో ఎస్‌ఎఫ్‌ఐ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళనలు చేపడతామని, ఢిల్లీని ముట్టడిస్తామని హెచ్చరించారు. మేడ్చల్‌ మల్కాజిగిరి జిల్లా ఈసీఐఎల్‌ చౌరస్తా అంబేద్కర్‌ విగ్రహం వద్ద ఎస్‌ఎఫ్‌ఐ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు.
ఖమ్మం నగరంలోని ఎస్‌ఆర్‌బీజీఎన్‌ఆర్‌ ప్రభుత్వ డిగ్రీ కళాశాల నుంచి జెడ్పీ సెంటర్‌ వరకు స్టూడెంట్‌ మార్చ్‌ నిర్వహించారు. వందలాది మంది విద్యార్థులు పాల్గొని.. మోడీ డౌన్‌ డౌన్‌, మోడీ, బీజేపీ సర్కార్‌ ముర్దాబాద్‌ అంటూ పెద్దఎత్తున నినాదాలు చేస్తూ ఇల్లందు క్రాస్‌ రోడ్‌ మీదుగా జెడ్పీ సెంటర్‌ వరకు విద్యార్థిలోకం కదం తొక్కి గర్జించింది. అనంతరం జెడ్పీ సెంటర్‌లో జరిగిన సభలో ఎస్‌ఎఫ్‌ఐ, డీవైఎఫ్‌ఐ, ఏఐఎస్‌ఎఫ్‌, యూత్‌ కాంగ్రెస్‌, ఏఐవైఎఫ్‌, పీడీఎస్‌యూ, పీవైఎల్‌, ఎన్‌ఎస్‌యూఐ నేతలు మాట్లాడారు. దేశ వ్యాప్తంగా నీట్‌ పేపర్‌ లీకేజీపై విద్యార్థులు, తల్లిదండ్రులు ఆందోళనలు చేస్తుంటే కనీసం ప్రధాని, బీజేపీ నాయకత్వం స్పందించకపోవడం దారుణమని అన్నారు. బీజేపీ అధికారంలో ఉన్న బీహార్‌, గుజరాత్‌ తదితర రాష్ట్రాల్లో పేపర్‌ లీకేజీ అయిందని, దీనిలో బీజేపీ నేతల ప్రమేయం ఉందని ఆరోపించారు.
ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో ఎస్‌ఎఫ్‌ఐ ఆధ్వర్యంలో ఆందోళన చేపట్టారు. చేవెళ్ల పట్టణంలో రాస్తారోకో నిర్వహించారు. ఇబ్రహీంపట్నంలో భారీ ర్యాలీ తీశారు. ప్రధాన రహదారిపై ఆందోళన చేపట్టారు. నీట్‌ను వెంటనే రద్దు చేయాలని డిమాండ్‌ చేశారు.
మెదక్‌, సంగారెడ్డి, సిద్దిపేట జిల్లా కేంద్రాలతో పాటు ఇతర ప్రాంతాల్లో ఎస్‌ఎఫ్‌ఐ, డీవైఎఫ్‌ఐ నాయకులు, కాంగ్రెస్‌ పార్టీ నాయకులు నిరసన ప్రదర్శనలు నిర్వహించారు. సంగారెడ్డిలో ఎస్‌ఎఫ్‌ఐ, డీవైఎఫ్‌ఐ ఆధ్వర్యంలో కొత్త బస్టాండ్‌ వరకు ర్యాలీ తీశారు. సిద్దిపేట జిల్లా కేంద్రంలో ఎస్‌ఎఫ్‌ఐ ఆధ్వర్యంలో నిరసన వ్యక్తం చేశారు. మెదక్‌, నర్సాపూర్‌ పట్టణాల్లో మెదక్‌ ఎమ్మెల్యే రోహిత్‌రావు, కాంగ్రెస్‌ పార్టీ మెదక్‌ జిల్లా అధ్యక్షులు ఆంజనేయులు గౌడ్‌, మాజీ ఎమ్మెల్యే మదన్‌ రెడ్డి, నర్సాపూర్‌ కాంగ్రెస్‌ పార్టీ నియోజకవర్గ ఇన్‌చార్జి ఆవుల రాజిరెడ్డి ఆధ్వర్యంలో ధర్నాలు నిర్వహించి, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ దిష్టిబొమ్మలు దహనం చేశారు.
విద్యారంగాన్ని కార్పొరేట్‌కు అప్పజెప్పే కుట్రలో భాగంగానే పాలకులు పేపర్‌ లీకేజీలకు పాల్పడుతున్నారని విద్యార్థి సంఘాల నాయకులు విమర్శించారు. నీట్‌ పరీక్షలో అవకతవకలపై కఠిన చర్యలు తీసుకోవాలంటూ కామారెడ్డి జిల్లా కేంద్రంలో ఎస్‌ఎఫ్‌ఐ, ఎన్‌ఎస్‌యూఐ, పీడీఎస్‌యూ, బీవీఎం ఆధ్వర్యంలో విద్యార్థులు భారీ ర్యాలీ నిర్వహించారు. కొత్తబస్టాండ్‌ ఎదుట కేంద్ర ప్రభుత్వం దిష్టిబొమ్మ దహనం చేశారు.
కరీంనగర్‌ జిల్లా కేంద్రంలోని తెలంగాణ చౌక్‌ నుంచి కలెక్టరేట్‌ వరకు ఎస్‌ఎఫ్‌ఐ, ఏఐఎస్‌ఎఫ్‌, ఎన్‌ఎస్‌యూఐ ఆధ్వర్యంలో స్టూడెంట్‌ మార్చ్‌ నిర్వహించారు. నీట్‌ పరీక్ష లీక్‌, యూజీసీ నెట్‌ పరీక్ష రద్దుతో విద్యార్థుల భవిష్యత్‌తో చెలగాటం ఆడుతున్న ఎన్‌టీఏపై సుప్రీంకోర్టు సిట్టింగ్‌ జడ్జితో న్యాయ విచారణ జరిపించాలని డిమాండ్‌ చేశారు. ఎన్‌టీఏ చైర్మెన్‌ ప్రదీప్‌ కుమార్‌ జోషి రాజీనామా చేయాలని, ఈ వ్యవహారంపై కేంద్ర ఎన్డీఏ సర్కార్‌ మౌనం వీడాలని లేకపోతే తెలంగాణలో కేంద్ర మంత్రులను, బీజేపీ ఎంపీలను ఎక్కడికక్కడా అడ్డుకుంటామని ఏఐఎస్‌ఎఫ్‌ రాష్ట్ర అధ్యక్షుడు కసిరెడ్డి మణికంఠరెడ్డి, ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా కార్యదర్శి గజ్జెల శ్రీకాంత్‌, ఏఐఎస్‌ఎఫ్‌ జిల్లా కార్యదర్శి మచ్చ రమేష్‌, ఎన్‌ఎస్‌యూఐ జిల్లా ఉపాధ్యక్షుడు ఇమ్రాన్‌ హెచ్చరించారు. సూర్యాపేటలో ఎస్‌ఎఫ్‌ఐ ఆధ్వర్యంలో ప్రధాని మోడీ దిష్టిబొమ్మ దహనం చేశారు. నీట్‌పై విచారణ జరిపించాలంటూ ఆదిలాబాద్‌ జిల్లా కేంద్రంలో ఆందోళన చేశారు. హనుమకొండలో డీవైఎఫ్‌ఐ ఆధ్వర్యంలో నిరసన తెలిపారు.

Spread the love