Monday, June 29, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్ఆర్టిఐ కమిషనర్ ఆదేశాలపై అధికారుల నిర్లక్ష్యం

ఆర్టిఐ కమిషనర్ ఆదేశాలపై అధికారుల నిర్లక్ష్యం

- Advertisement -

రికార్డుల పరిశీలనకు సహకరించని అధికారులు
కలెక్టర్ కు, కమీషన్ ఫిర్యాదు చేస్తాం
నవతెలంగాణ-అచ్చంపేట
(ఆర్ టి ఐ) సమాచార హక్కు చట్టం రాష్ట్ర కమిషన్ ఆదేశాలను అచ్చంపేట మండల పరిషత్ అభివృద్ధి శాఖ అధికారులు నిర్లక్ష్యం చేస్తున్నారని అధికారులపై చర్యలు తీసుకోవాలని సమాచార హక్కు చట్టం రక్షణ సమితి రాష్ట్ర కార్యదర్శి యాదగిరి సోమవారం ప్రకటనలో పేర్కొన్నారు. ఆయన తెలిపిన వివరాల ప్రకారం.. అచ్చంపేట మండలంలోని సిద్దాపురం, మన్నేవారి పల్లి, ఐనోల్, బొమ్మన్ పల్లి నాలుగు గ్రామాలకు సంబంధించిన సమాచారాన్ని కోరుతూ 15 నెలల (465రోజులు) క్రితం ఆర్టీఐ దరఖాస్తులు చేయడం జరిగింది. ఇలాంటి సమాచారం అధికారులు ఇవ్వకపోవడంతో జిల్లా కలెక్టర్‌ కు, తెలంగాణ రాష్ట్ర సమాచార కమిషన్‌ను ఆశ్రయించారు.

కమిషన్ స్పందించి జూన్ 29న సంబంధిత రికార్డుల పరిశీలనకు అనుమతిస్తూ ఆదేశాలు జారీ చేసిందన్నారు. ఆదేశాల మేరకు సోమవారం మధ్యాహ్నం రికార్డుల పరిశీలన కోసం మండల కార్యాలయానికి వెళ్లగా సంబంధిత అధికారులు అందుబాటులో లేక కార్యాలయాలు ఖాళీగా కనిపించాయని పేర్కొన్నారు.  మండల ఎంపీడీవోను ఫోన్‌లో సంప్రదించగా, భోజన విరామం కారణంగా అధికారులు బయటకు వెళ్లారని చెప్పి, కొద్దిసేపటి తర్వాత కార్యాలయానికి వచ్చినట్లు తెలిపారు.

రికార్డుల పరిశీలనలో భాగంగా నాలుగు గ్రామాలకు సంబంధించిన రికార్డులను చూపించాలని కోరగా, తెలంగాణ రాష్ట్ర సమాచార కమిషన్ నుంచి ఎలాంటి లేఖ తమకు అందలేదని అధికారులు చెప్పారని ఆరోపించారు. అయితే కమిషన్ లేఖ అందలేదని లిఖితపూర్వకంగా ఇవ్వాలని కోరడంతో  కార్యాలయంలో వెతికి చివరకు కమిషన్ పంపిన లేఖతో పాటు సమాచారం కోసం వచ్చిన మరికొన్ని దరఖాస్తులు కూడా బయటపడినట్లు తెలిపారు.

ఈ విషయంపై ప్రశ్నించగా, సంబంధిత అధికారి బదిలీపై వెళ్లిపోయారని, తమకు ఈ వ్యవహారంపై పూర్తి సమాచారం లేదని అధికారులు సమాధానం ఇచ్చినట్లు పేర్కొన్నారు. ఇలాంటి నిర్లక్ష్య, బాధ్యతారాహిత్య వైఖరి కలిగిన అధికారుల వ్యవహారాన్ని జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లడంతో పాటు తెలంగాణ రాష్ట్ర సమాచార కమిషన్‌కు కూడా ఫిర్యాదు చేస్తామని  తెలిపారు. సమాచార హక్కు చట్టాన్ని గౌరవించకుండా ప్రజలకు సమాచారం అందించడంలో నిర్లక్ష్యం ప్రదర్శిస్తున్న అధికారులపై తగిన చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -