బియ్యం ఇవ్వడానికి సిద్ధం..అధికారులు సేకరించండి: కొమరవెల్లి చంద్రశేఖర్ 

నవతెలంగాణ – సిద్దిపేట

తమ వద్ద ఉన్న 4 లక్షల పైచిలుకు మెట్రిక్ టన్నుల సిఎంఆర్ బియ్యంను వెంటనే అధికారులు తీసుకోవాలని రైస్ మిల్లర్ ల అసోసియేషన్ జిల్లా అధ్యక్షులు కొమరవెల్లి చంద్రశేఖర్ ( చందు) కోరారు. బుధవారం రైస్ మిల్ అసోసియేషన్ భవనంలో ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం నుండి జిల్లా రైస్ మిల్లులకు రావాల్సిన రూ 100 కోట్లు వెంటనే విడుదల చేయాలని కోరారు. ప్రస్తుతం వస్తున్న దాన్యం నిల్వలు చేయడానికి స్టోరేజీలను అధికారులు చూపించాలని కోరారు. గతంలో ఉన్న సిఎంఆర్ బియ్యాన్ని సేకరించకుండానే ప్రస్తుతం ఎండాకాలం పంటకు సంబంధించిన బియ్యాన్ని మాత్రమే అధికారులు,  ప్రభుత్వం తీసుకుంటున్నారని, తమ వద్ద నిలువగా ఉన్న బియ్యాన్ని కూడా వెంటనే సేకరించాలని డిమాండ్ చేశారు. 11 నెలలుగా నిలువ ఉన్న బియ్యం మూలంగా క్వింటాలకు 6 నుండి 7 కిలోల బియ్యం తరుగు వస్తుందని, బియ్యాన్ని కాపాడటానికి పురుగుమందలు చల్లుతున్నామని, కూలీలను పెట్టవలసి వస్తుందని, క్వింటాలకు రూ 500 రూపాయలు ఇవ్వాలని కోరారు. కొన్ని వార్తాపత్రికల్లో వస్తున్న కథనాలు ఈ జిల్లాలో లేవని, ఇక్కడ బియ్యం ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నప్పటికీ అధికారులే తీసుకోవడం లేదని, టెండర్ ద్వారా కొనుగోలు చేసిన వారు సేకరించడం లేదని అన్నారు. కరోనా కంటే ముందు ఖరీఫ్, రబీల సిఎంఆర్ బియ్యము వెంట వెంటనే తీసుకునేవారని, కరోనా తరువాత బియ్యం తీసుకోవడంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య సమన్వయ లోపం మూలంగా మిల్లుల యజమానులు నష్టపోతున్నారని అన్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించాలని కోరారు. ఈ కార్యక్రమంలో సంగం ప్రధాన కార్యదర్శి బుచ్చయ్య, ఉపాధ్యక్షులు బాలకిషన్, కోశాధికారి విష్ణుమూర్తి, సభ్యులు భూపతి,  శంకర్, కాశీనాథ్, శివకుమార్ తదితరులు పాల్గొన్నారు.
Spread the love