ఎన్నికల విధులను అధికారులు సమర్థవంతంగా నిర్వహించాలి

– రిటర్నింగ్‌ అధికారి వెంకట్‌రెడ్డి
నవతెలంగాణ-తుంగతుర్తి
ఎన్నికల విధులను అధికారులు సమర్ధవంతంగా నిర్వహించాలని నియోజకవర్గ ఎన్నికల రిటర్నింగ్‌ అధికారి, జిల్లా అడిషనల్‌ కలెక్టర్‌ వెంకట్‌రెడ్డి అన్నారు.శనివారం నియోజకవర్గ కేంద్రంలో పీఓ, ఏపీఓ ,పోలింగ్‌ సిబ్బందికి బాలుర గురుకుల పాఠశాలలో నిర్వహించిన శిక్షణా కార్యక్రమంలో పాల్గొని అవగాహన కల్పించారు.ఎన్నికల విధులు నిర్వహించే అధికారులు, సిబ్బంది ట్రైనింగ్‌ క్లాసులను ఆషామాషిగా తీసుకోవద్దన్నారు.పోలింగ్‌ డే సందర్భంగా పిఓలు తీసుకోవాల్సిన చర్యలు బాధ్యతపై మాస్టర్‌ ట్రైనర్లచే క్లుప్తంగా వివరించారు. ఎన్నికల కమిషన్‌ ప్రతి అంశంపై విధులకు సంబంధించిన నిబంధనలు జారీ చేసిందన్నారు.ఈ నేపథ్యంలో పీఓ బుక్‌లో పొందుపరిచిన నియమావళి ప్రకారంగా విధులు నిర్వహించాలన్నారు.మాక్‌పోలింగ్‌ సందర్భంగా పాటించాల్సిన అంశాల గూర్చి వివరించారు. మాక్‌ పోలింగ్‌ ఉదయం 5:30 గంటల లోగా పూర్తిచేయాలని, కనీసం ఇద్దరు ఏజెంట్లు తప్పనిసరిగా ఉండాలని పేర్కొన్నారు.కొందరు పీఓలు శిక్షణకు రాకుండా ఓవర్‌ కాన్ఫిడెన్స్‌తో తప్పులు చేస్తారని చెప్పారు.ఎన్నికల ప్రవర్తనా నియమావళిని పాటించాలని,తప్పులు జరిగితే క్రమశిక్షణ చర్యలు తీసుకుంటామన్నారు.ఎన్నికల సమయంలో సస్పెండ్‌ చేస్తే ప్రభుత్వం కూడా పట్టించుకోదని తెలిపారు.ఈ సమావేశంలో అసిస్టెంట్‌ రిటర్నింగ్‌ అధికారి, తుంగతుర్తి తహసీల్దార్‌ యాదగిరిరెడ్డి, మద్దిరాల తహసీల్దార్‌ అమీన్‌సింగ్‌, తుంగతుర్తి డిప్యూటీ తహసీిల్దార్‌ హరిశ్చంద్రప్రసాద్‌, నియోజకవర్గ పరిధిలోని వివిధ మండలాల తహసీల్దార్లు, పోలింగ్‌ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Spread the love