ప్రేమికుల రోజున …!

కలిసి నడవడం అంటే
వెనుక నడవడం అనుకున్నావు! కాదా …
మరి నా అడుగుల గుర్తులు ఏవి?!
వెనక్కి తిరిగి చూద్దామా!
అందరినీ కాదని ఎదిరించి
నీ తోడుగ నడిచినప్పుడు!
పెద్ద యుద్దాన్నే
గెలిచినంత సంబరం!
నమ్మక దారానికి ఎగరేసిన
ఆశల గాలిపటం!
వాస్తవ చిక్కులలో విలవిలలాడుతుంటే!
ఆ యుద్దంలో
నేలకొరిగిన తలలే
యాదికొస్తున్నాయి!
మరి మన ప్రేమ జెండా
రెపరెపలాడినట్టేనా?!
గతాన్ని గుంతలు గుంతలుగా
తవ్వి కళ్ళ ముందు
‘మట్టి’ దిబ్బలగా పోస్తున్న
ఈ ‘ప్రేమికుల రోజు’ ను!
వచ్చే ఏడాదికైనా
మన ప్రేమోత్సవ దినంగా
మలుచుకుందామా!
‘కలిసి’ నడవడానికైతే
నేను సిద్దం!
‘వెనుక’డుగు వేయించవుగా!!
– తిప్పాన హరిరెడ్డి,
9493832412

Spread the love