ప్రేమంటే ఏమిటంటే..?

ప్రేమంటే ఏమిటంటే..?ప్రేమ… సాధారణంగా స్నేహం నుంచే మొదలవుతుంది. ఎవరైనా ఒకరు నచ్చినప్పుడు వారితో ముందుగా స్నేహం చేసుకుంటారు. ఆ తరువాత తమలో వున్న భావాలను, ఇష్టాయిష్టాలను తెలుసుకుని, అనుకోకుండా ప్రేమలో పడిపోతారు. ప్రేమ అనేది ఒక మధురానుభూతి. ఒక అనిర్వచనీయమైన భావన. చెప్పలేని అనుభూతి. మోయలేని భారం.. రాయలేని కావ్యం. చివరి మజిలీ అంటూ లేని ప్రయాణం. అయితే ఇది స్నేహంతో ప్రారంభమై.. పెండ్లితో ముగిసిపోయేది కాదు. ఆదిలోనే హంసపాదులు ఎన్ని వచ్చినా ఆగిపోయేది అసలే కాదు. అది సమాజంలో నిరంతరం జరిగే ప్రక్రియ. కాలం మారే కొద్ది పెరిగే ఫీలింగ్‌, కేరింగ్‌. తల్లిదండ్రుల నుంచి మొదలుకొని జీవిత భాగస్వామి వరకు ప్రతి సందర్భంలోనూ మనుషులు దీన్ని ఆస్వాదిస్తారు. ఫిబ్రవరి 14న ప్రేమికుల దినోత్సవం సందర్భంగా దాని చరిత్ర, అసలు ప్రేమంటే ఏంటీ, ప్రేమలో ఎలాంటి మార్పులు వస్తున్నాయో ఓ సారి పరిశీలిద్దాం…
ప్రేమ, ప్రణయం.. పేరేదైనా కలిగే ఫీలింగ్‌ ఒక్కటే. పేద, ధనిక.. అంతరాలు ఎంతున్నా.. అనుభవం ఒక్కటే. కులం, మతం.. వర్గాలు ఏవైనా స్వభావం ఒక్కటే. ప్రేమించని.. ప్రేమలో పడని మనుషులు ఉండరు అంటే అతిశయోక్తి కాదేమో. సృష్టిలో ఏ జీవికీ లేని ఓ మంచి అవకాశం మనుషులకు ఉంది. ఈ నేపథ్యంలో ఎవరిని ప్రేమించాలి.. మంచి జీవితం కోసం ఎలాంటి వారిని సెలెక్ట్‌ చేసుకోవాలో తెలుసుకోవడం చాలా అవసరం.
– మనలో చాలా మంది అందం చూసి ఇష్టపడతారు. అందానికి ఆకర్షితులవటం సాధారణ విషయమే. అయితే ప్రేమలో ఇది అంత అవసరం లేదు. ఒక వ్యక్తి అందం కాదు, వ్యక్తిత్వం ముఖ్యం. మనం ప్రేమించే వ్యక్తి ఎలా ఉన్నారు అనే దానికంటే.. అంతరంగిక సౌందర్యం ముఖ్యం. అదే అవతలి వారిని ఆకర్షితుల్ని చేస్తుంది. శారీరక సౌందర్యం ఏనాటికైనా సమసిపోతుంది. కానీ నిజమైన వ్యక్తిత్వం ఎప్పటికీ నిలుస్తుంది. కాబట్టి మీరు ప్రేమించే వారిలో అందం కన్నా వ్యక్తిత్వం చూడండి.
– చాలా మంది తమ పార్ట్‌నర్‌కు బాగా డబ్బులు ఉండాలని కోరుకుంటారు. అలా ఉంటే షాపింగ్‌ చేయటం, తినటం, బైకు, కార్లపై షికారుకు వెళ్లొచ్చు అనుకుంటారు. ఇతరులతో పోల్చుకుంటూ ఇలాంటివి ఆలోచిస్తారు. కానీ నిజానికి అంత డబ్బు అవసరం లేదు. కావాల్సినంత ఉంటే సరిపోతుంది. పైగా ఇద్దరూ ఉద్యోగాలు చేసేవారైతే ఆర్థిక కష్టాలు తీరినట్లే. జల్సాలు చేయకున్నా… తను మీ కడుపు నింపుతున్నారా లేదా, అవసరంలో ఆదుకుంటున్నారా లేదా అన్నది ముఖ్యం. కాబట్టి జేబు నిండా డబ్బు ఉండాల్సిన అవసరం లేదు. భవిష్యత్తులో ఎలా చూసుకుంటారో ఆలోచించండి.
– మనల్ని ప్రేమించేవారు మనకు ప్రయారిటీ ఇవ్వాలని కోరుకుంటాం. ఎక్కడున్నా ఎందరితో ఉన్నా మీకు గౌరవం, ప్రాముఖ్యం ఇచ్చే వాళ్లను ఎంపిక చేసుకోండి. అలా అని అస్తమానం మీతోనే ఉండమని అడగకూడదు. ఎందుకంటే అది అసాధ్యం. వారి వ్యక్తిగత జీవితం వారికీ ఉంటుంది. కాబట్టి అవసరమైనప్పుడు మీకు ప్రయారిటీ ఇచ్చే వాళ్లను చూసుకోండి.
– అందరూ ఉద్యోగం ఉన్న వాళ్లనే కోరుకుంటారు. కొందరికి అది ఉండదు. కానీ మీరంటే చెప్పలేనంత ఇష్టం ఉంటుంది. అలా అని వాళ్లను చులకనగా, పనికిరాని వాళ్లలా చూడకండి. ఇలాంటి వాళ్లను వదిలేయకుండా.. మీవల్ల అయినంత మటుకు సాయం చేసి, అన్ని విధాలా ప్రోత్సహించి ఒక దారికి వచ్చేలా చేయండి. రిలేషన్లో ఉండగా జాబ్‌ పోతే కొందరు బ్రేకప్‌ చెబుతారు. అలా చెయ్యకుండా.. వారికి కావాల్సిన సాయం చేయడం, నైతిక మద్దతు ఇవ్వడం లాంటివి చేయండి.
– అమ్మాయిలు ప్రేమించాలంటే ఉండాల్సిన లక్షణాల్లో నమ్మకం, భద్రతాభావం ముఖ్యం. ఈ రెండు వారికి కలిగితే మీ లవ్‌ ఓకే అయినట్లే. అమ్మాయిలూ.. మీరు సురక్షితంగా ఫీల్‌ అయి, మీకు నమ్మకం కలిగిన వారు ప్రపోజ్‌ చేస్తే వదులుకోకండి. వారి చెయ్యి విడిచిపెట్టకండి. ఎందుకంటే అవి అందరిపై కలగకపోవచ్చు. అబ్బాయిలూ.. మీరూ అమ్మాయిలకి రక్షణనిస్తూ, నమ్మకం కలిగేలా ప్రవర్తించండి. కష్టకాలంలో వారిని ఆదుకుంటాననే భరోసా కల్పించండి.
– ప్రేమ అంటే కేవలం ఇవ్వటం మాత్రమే కాదు.. పొందడం కూడా. అవసరాల కోసమో, ఆర్థిక లాభాల కోసమో ప్రేమించకండి. సోషల్‌ మీడియా వాడకం విపరీతంగా పెరిగిపోయిన నేటి కాలంలో వాట్సాప్‌ స్టేటస్‌లు, ఇన్‌స్టా రీల్స్‌ చూసి లేదా.. అవి చేసిన వారి ప్రేమలో పడిపోకండి.
ప్రేమను వ్యక్త పరచడం ఎలా..?
– నేటి యువతలో ఎన్నో మార్పులు వస్తున్నాయి. ఆలోచనా ధోరణుల్లో పలు మార్పులు చోటు చేసుకుంటున్నాయి. ప్రేమ, పెండ్లి, కెరీర్‌ విషయంలో చాలా స్పష్టంగా ఉంటున్నారు. వారు వెళ్ళే మార్గం సరైనదే అయితే దాన్ని ప్రోత్సహించాల్సిన బాధ్యత తల్లిదండ్రులతో పాటు సమాజానికి కూడా ఉంది.
– అయితే ఆధునిక యుగంలో డిజిటల్‌ ప్రేమలు ఎక్కువై పోయాయి. ప్రతిఒక్కరూ తమ ప్రేమ విషయాలను సెల్‌ఫోన్‌లు, ఫేస్‌బుక్‌ ద్వారా తెలియజేస్తుంటారు. కొందరైతే అసలు చూసుకోకుండా ప్రేమించేసుకుంటున్నారు. ఇలా చేయడం వల్ల ఇష్టాయిష్టాలు ఎదురుగా తెలియజేయడానికి అవకాశం ఉండదు. కాబట్టి వీలైనంతవరకు ఉత్తరం రాయడానికి ఆసక్తి చూపించండి. ఎందుకంటే ఒక కాగితంలో మన మనసులోని భావాలు రాయడం ద్వారా ఎదుటివారు త్వరగా ఆకర్షితులవుతారు.
– పూర్వకాలంలో రాజులు ప్రేమ లేఖలు రాసి పావురాలతో ఇచ్చి పంపేవారు. అలాంటి ప్రేమలో వారు విజయం సాధించారు. కాగితంలో రాసే అక్షరాలు మన మనసులో దాగివున్న భావాలను అర్థం చేసుకోవడానికి ఉపయోగపడుతుంది. ఇలా చేయడం వల్ల ప్రేమ ఇంకా బలపడుతుంది. మీరు ప్రేమిస్తున్న అమ్మాయైనా, అబ్బాయైనా మీ మనసులోని భావాలను తెలిపేముందు వారి ఇష్టాయిష్టాలను తెలుసుకోండి. వారికి నచ్చిన స్థలానికి తీసుకెళ్ళి మీ మనుసులో వున్న భావాలను తెలియజేయండి. అప్పుడే ఇతరుల మనుసులో వున్న భావాలను తేలికగా అర్థం చేసుకోవచ్చు. అప్పుడు ఫలితం దక్కుతుంది.
– మీరు మీరుగానే వుండి, మీ మనసులోని భావాలను వ్యక్తపరిస్తేనే చాలామంచిది. అనవసరమైన విచిత్రచేష్టలు చేయకుండా మీ మనసులోని భావాలను వ్యక్తపరిచేందుకు ట్రై చేయండి.
– మీరు ప్రేమిస్తున్న అమ్మాయి గురించిగాని, ప్రేమ వ్యవహారం గురించి కాని స్నేహితులకు తెలియనివ్వకుండా జాగ్రత్త తీసుకుంటే మంచిది. ఎందుకంటే కొంతమంది అమ్మాయిలు తమ ప్రేమ వ్యవహారాలను స్నేహితుల నుంచి తెలుసుకోవడం ఇష్టపడరు. కాబట్టి ప్రేమ విషయాలలో మీ అంతట మీరుగా పూనుకోవడమే మంచిది.
ప్రేమకు మనం వ్యతిరేకమా..?
ప్రేమికుల దినోత్సవం భారత సంస్కృతికి వ్యతిరేకమంటున్నాయి మతోన్మాద భజరంగ్‌దళ్‌, వీహెచ్‌పీలు. గతంలో అయితే బజరంగ్‌ దళ్‌ అత్యుత్సాహం ఓ ప్రేమ జంట ఆత్మహత్యా యత్నానికి పాల్పడేలా చేసింది. ప్రతి ఏడాది వాలెంటైన్స్‌ డే రోజున ప్రేమ జంటలు కనిపిస్తే పెండ్లి చేస్తామంటూ హడావిడి చేసే బజరంగ్‌ దళ్‌ కార్యకర్తలు పార్కుల వద్ద వాలెంటైన్స్‌ డే రోజున రెచ్చిపోతుంటారు. ప్రేమ జంటలపై దాడులు చేస్తుంటారు. మేడ్చల్‌లో ఓ ప్రేమ జంటకు వాళ్లు బలవంతంగా పెండ్లి చేశారు. ఆ జిల్లాలోని కండ్లకోయలోని ఆక్సిజన్‌ పార్కులో కనిపించిన ఓ ప్రేమ జంటకు అక్కడే పెండ్లి జరిపించారు. అంతే కాదు దాన్ని వీడియో తీశారు. ఈ వీడియోను వారి ట్విట్టర్‌లో షేర్‌ చేశారు. ఈ వీడియో అప్పట్లో సోషల్‌ మీడియోలో వైరల్‌గా మారింది. తమ వీడియో సోషల్‌ మీడియాలో హల్చల్‌ చేస్తుండడంతో అవమానంగా భావించిన ఆ జంట ఆత్మహత్య చేసుకోవాలనుకుంది. అనుమానాస్పదంగా సంచరిస్తున్న వారిని చూసిన పోలీసులు విచారించగా ఆత్మహత్య చేసుకోవాలని వచ్చామని తమగోడు వెళ్లబోసుకున్నారు. ఇలాంటి సంఘటనలు ఎన్నో చూశాం. చివరకు ఆ రోజు అన్నా చెల్లెళ్లు కలిసి వెళుతున్నా బలవంతంగా తాళి కట్టించిన ఘటనలు కూడా జరిగాయి. ప్రేమను ఓ బూతుగా చూపిస్తూ చేస్తున్న ఇలాంటి దాడులను అస్సలు సహించకూడదు.
ప్రేమంటే త్యాగం
ఇటీవల కాలంలో ప్రేమ పేరుతో జరుగుతున్న దాడులను చూస్తూనే ఉన్నాం. తన ప్రేమను కాదన్నందుకు అమ్మాయిలపై విచక్షనా రహితంగా తెగ బడుతున్నారు. నాకు దక్కనిది మరొకరికి దక్కకూడదని ప్రాణాలు తీయడానికి ప్రయత్నిస్తున్నారు.
ప్రేమించడం తప్పు కాదు. ఎదుటి వారి మనసు అర్థం చేసుకోకపోవడం పెద్ద తప్పు. ప్రేమ కోసం చావడం, చంపడం మరింత పెద్ద తప్పు. ప్రేమ త్యాగాన్ని కోరుతుంది. మనం ప్రేమించిన వ్యక్తి సుఖంగా ఉండాలని కోరుకోవడమే నిజమైన ప్రేమ. అలాంటి ప్రేమే ప్రేమను బతికిస్తుంది. ఏది ఏమైనా ప్రేమ గొప్ప అనుభూతి. ప్రపంచాన్ని నడిపించే గొప్ప శక్తి ప్రేమకు ఉంది. సమాజాన్ని మార్చే శక్తి కూడా ప్రేమకు ఉంది. కారల్‌ మార్స్క్‌, జెన్నీల ప్రేమ అలాంటిదే. సమాజంలోని అసమానతలను రూపుమాకేందుకు ఆ జంట ఎన్నో త్యాగాలు చేసింది. కష్టాలను పంచుకుంది. చివరకు కడుపున పుట్టిన బిడ్డలను కూడా దూరం చేసుకుంది. కడవరకు ఓ ఆశయ సాధనకై వారి ప్రేమ నిలిచింది. అలాంటి గొప్ప ప్రేమను ఒక రోజుకు పరిమితం చేసి నేడు హడావుడి చేస్తున్నారు. డబ్బు సంపాదించాలనుకోవడానికి కొందరు ఈ రోజును వాడుకుంటున్నారు. యువత కూడా ఆ మాయాజాలంలో పడిపోతున్నారు. అందులో కొట్టుకు పోకుండా యువతను కాపాడుకోవల్సిన బాధ్యత సమాజంపై ఉంది.
మన దేశంలో ప్రేమ.. పెండ్లి
భారతీయుల ప్రేమ, పెండ్లి గురించి, వాళ్ల ఆలోచనలు ఏమిటో ఓ సర్వే ద్వారా తెలుసుకోవచ్చు. డాటాను పరిశీలిస్తే ఈ అంశాల్లో అనేక దృక్కోణాలు కనబడతాయి. ముఖ్యంగా మన సినిమాలు చూస్తే ప్రేమ తప్ప మరొకటి కనిపించదు. యువత ఆలోచనలన్నీ ప్రేమ, పెండ్లి చుట్టూనే తిరుగుతూ ఉంటాయనిపిస్తుంది. అవే జీవితంగా కనబడుతుంది. అయితే ప్రేమ, పెండ్లి అనేది జీవితంలో ఓ భాగం మాత్రమే అనే విషయం అస్సలు గుర్తు చేయరు. అయితే ఈ సర్వే ప్రకారం మన భారతీయ యువత చాలా వరకు పెద్దలు కుదిర్చిన వివాహాలనే చేసుకుంటున్నట్టు తేలింది. 2018లో 1,60,000 కంటే ఎక్కువ కుటుంబాలపై జరిపిన ఒక సర్వేలో వివాహితుల్లో 93 శాతం తమది పెద్దలు కుదిర్చిన వివాహమేనని చెప్పారు. కేవలం 3 శాతం మాత్రమే ప్రేమ వివాహం చేసుకున్నారు. మరో 2 శాతానిది ప్రేమ, ప్లస్‌ పెద్దలు కుదిర్చిన వివాహం. అంటే పెద్దలే ఈ సంబంధాన్ని కలుపుతారు. పరిచయమయ్యాక, అమ్మాయి, అబ్బాయి ప్రేమలో పడి పెండ్లికి ఒప్పుకుంటారు. కాలంతో పాటు ఈ శాతాలు పెద్దగా పెరగలేదు.
ప్రేమ పెండిండ్లు తక్కువే
2014లో 70,000 కంటే ఎక్కువ మందిపై జరిపిన సర్వేలో పట్టణ ప్రాంత భారతీయుల్లో కులాంతర వివాహాలు చేసుకున్నవారు 10 శాతం కన్నా తక్కువే అని తేలింది. మతాంతర వివాహాలు అంతకన్నా తక్కువ. కేవలం 5 శాతం మాత్రమే మతాంతర వివాహాలు చేసుకున్నట్టు చెప్పారు. కులాంతర వివాహాలు చేసుకునేందుకు అభ్యంతరం లేదని యువత తరచూ చెబుతుంటారు. కానీ డాటా పరిశీలిస్తే అభిప్రాయాలకు, వాస్తవాలకు మధ్య చాలా పెద్ద వ్యత్యాసం కనిపించింది. 2015లో మాట్రిమోనియల్‌ సైట్లలో తమ పేరు రిజిస్టర్‌ చేసుకున్న 1,000 మంది అమ్మాయిలను సంప్రదించారు. సగం మంది కులాంతర వివాహాలను అభ్యంతరం లేదని చెప్పినా, చాలా వరకు అమ్మాయిలు సొంత కులానికి చెందిన అబ్బాయిలనే వివాహం చేసుకోవడానికే మొగ్గు చూపారు. మంచి చదువు, ఉద్యోగం, అందం అన్నీ ఉన్నా ఒక దళిత అబ్బాయికి వెళ్లే ప్రపోజల్స్‌ చాలా తక్కువగానే ఉన్నాయంట. ఇలాంటి పరిస్థితుల్లో మనసుకు నచ్చిన వ్యక్తిని కులాంతర, మతాంతర వివాహం చేసుకోవాలంటే పెద్ద యుద్ధమే చేయాల్సి ఉంటుంది.
తప్పుడు కేసులు పెడుతూ…
2013లో ఢిల్లీలోని ఏడు జిల్లా కోర్టుల్లో లైంగిక దాడులకు సంబంధించిన ప్రతీ కేసులోనూ ఇచ్చిన తీర్పును ఈ సర్వే పరిశీలించింది. సుమారు 600 కేసులుంటాయి. కోర్టుల్లో విచారణ ముగిసిన 460 కేసుల్లో 40 శాతం సమ్మతి ఉన్న జంటలకు సంబంధించిన కేసులే. కోర్టుల్లో విచారణ ముగిసిన 460 కేసుల్లో 40 శాతం అమ్మాయి, అబ్బాయి ఒకరినొకరు ఇష్టపడ్డవారే. చాలావరకు కులాంతర, మతాంతర ప్రేమలే. వాళ్లు ప్రేమించుకుని పెండ్లి చేసుకున్న తర్వాత అమ్మాయి తల్లిదండ్రులు అబ్బాయి మీద లైంగిక దాడులు లేదా అపహరణ కేసులు పెట్టారు. తమ బిడ్డ కులాంతర వివాహం చేసుకుంది అనే కంటే లైంగిక దాడికి గురైంది అని చెప్పుకోవడానికి వారు ఇష్టపడుతున్నారు. రాను రాను పరిస్థితులు మరింత దిగజారే అవకాశాలు కనిపిస్తున్నాయి.
మతోన్మాదుల ఆగడాలు
గత కొన్నేండ్లుగా మతోన్మాద హిందూ గ్రూపులు ‘లవ్‌ జిహాద్‌’ అనే పదాన్ని తెరపైకి తీసుకొచ్చాయి. మతం మార్చడానికే, ముస్లిం అబ్బాయిలు హిందూ అమ్మాయిలను పెండ్లి చేసుకుంటున్నారని ఆరోపించడం ప్రారంభించాయి. బీజేపీ పాలనలో ఉన్న అనేక రాష్ట్రాలు పెండ్లి పేరుతో అమ్మాయిల మతం మార్చే అబ్బాయిలకు కఠిన శిక్షలను అమల్లోకి తీసుకొచ్చాయి. అలాగే మతాంతర వివాహాలను అడ్డుకోవడానికి చట్టబద్ధత తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నాయి. ఇవన్నీ కులాంతర, మతాంతర వివాహాలను మరింత నిరుత్సాహపరుస్తాయి. ఈ సర్వేలోనే బయట పడిన ఓ ఉదాహరణ పరిశీలిస్తే మతాంతర వివాహం చేసుకున్న ఒక జంట… తాము ఎదుర్కున్న సమస్యలను వివరించారు. అమ్మాయి కుటుంబం వాళ్లని వెంటాడి వేధించిందని, తమ పేర్లు, ఇతర వివరాలు బయటపడతాయన్న భయంతో పెండ్లి సర్టిఫికెట్‌ కూడా తీసుకోలేని చెప్పారు. అయితే కొంతమంది యువత మాత్రం ప్రేమపై మంచి అభిప్రాయాన్ని వ్యక్త పరుస్తున్నారు. అయితే ప్రజల్లో అణువణువునా మనువాద భావజాలం నింపుతున్న ఈ తరుణంలో భారతదేశంలో యువత తమ ప్రేమ కొసం పోరాడుతోంది. కొన్ని సందర్భాల్లో గెలిచినా చాలా సందర్భాల్లో ఓడిపోతోంది.

ప్రేమ ఆప్షన్‌ కాకూడదు

‘ప్రేమ’ అనేది తప్పు కాదు. ఉద్యోగం పేరుతో ప్రతిరోజు ర్‌తీవరరటబశ్రీ జీవితం గడుపుతున్న యువతీయువకులకి ఈ ‘ప్రేమికుల రోజు’ ఒక చిన్న ఆటవిడుపు. అయితే వాళ్లు తెలుసుకోవాల్సిన విషయాలు కొన్ని వున్నాయి. ప్రేమకి, ఆకర్షణకు తేడా తెలుసుకోండి. ప్రేమ కూడ ప్రకతిలో ఒక భాగం. మనం తొందర పడినంత మాత్రాన వసంతం ముందుగా రాదు, కోకిలలు కూయవు. ప్రతిదానికీ ఒక సమయం వుంటుంది. అలాగే ప్రేమకి కూడా. ప్రేమ రబషషవరర అవాలి అంటే మానసిక పరిపక్వత, ఆర్థిక స్వాతంత్య్రం, ఒకరిపై ఒకరికి నమ్మకం ఉండాలి. అంతేగానీ ప్రేమ ఆప్షన్‌ కాకూడదు. స్టేటస్‌ సింబల్‌ కాకూడదు. Emotion అంతకన్నా కాదు. నిజమైన ప్రేమికులందరికి ‘ప్రేమికుల రోజు’ శుభాకాంక్షలు.
– గోపాలుని అమ్మాజి
హ్యూమన్‌ సైకాలజిస్ట్‌, ఫ్యామిలీ కౌన్సిలర్‌

వాలెంటెన్స్‌ డే చరిత్ర
అమెరికా, బ్రిటన్‌, కెనడా, ఆస్ట్రేలియా తదితర పాశ్యాత్య దేశాల్లో మాత్రమే జరుపుకునే వాలెంటైన్స్‌ డే గత కొన్నేండ్లుగా మన దేశంలోనూ ప్రాముఖ్యత సంతరించుకుంది. ప్రపంచ వ్యాప్తంగా విస్తరిస్తున్న మార్కెట్‌ దీనికి కారణం. ఈ రోజు గురించి అనేక కథలు ఉన్నాయి. వాటిలో ఒకటి… రోమ్‌ దేశంలో జన్మించిన వాలెంటైన్‌ అనే ఓ ప్రవక్త.. ఈ ప్రేమికుల రోజుకు ఆయనే ఆద్యుడు అంటారు. వాలెంటైన్‌ యువతకు ప్రేమ సందేశాలు ఇస్తూ, ప్రేమ వివాహాలను ప్రోత్సహించేవాడంట. అప్పట్లో రోమ్‌ను పాలిస్తున్న చక్రవర్తి క్లాడియస్‌ కుమార్తె కూడా వాలెంటైన్‌ అభిమానిగా మారడంతో చక్రవర్తికి భయం పట్టుకుంది. దీంతో ప్రేమ సందేశాలతో యువతను తప్పు దోవ పట్టిస్తున్నాడన్న నెపంతో వాలెంటైన్‌కు మరణశిక్ష విధించి ఫిబ్రవరి 14న ఉరితీయించారు. వాలెంటైన్‌ను ఉరితీసిన రెండు దశాబ్దాల తర్వాత అప్పటి పోప్‌ గాలెసియన్స్‌ వాలెంటైన్‌ను ఉరితీసిన రోజును ప్రేమికుల రోజుగా ప్రకటించారు. అప్పటి నుంచి ప్రపంచ వ్యాప్తంగా పలు దేశాల్లో ఈ ప్రేమికుల దినోత్సవాన్ని జరుపుకుంటున్నారు. తమ ప్రేమను వ్యక్తం చేసేందుకు చాలా మంది వాలెంటైన్స్‌ డేను ఎంచుకుంటున్నారు.

– సలీమ,
94900 99083 

Spread the love