ఒకే దేశం…ఒకే పెన్షన్‌

– ఎందుకు అమలు చేయరు?
– కనీస పెన్షన్‌ రూ.9వేలుగా నిర్ణయించాలి
– ‘నో ఇన్‌క్రీజ్‌ ఇన్‌ పెన్షన్‌-నో ఓట్‌’ స్టిక్కర్‌ ఆవిష్కరణలో టాప్రా అధ్యక్షప్రధాన కార్యదర్శులు నారాయణరెడ్డి, కృష్ణమూర్తి
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్‌
‘ఒకే దేశం..ఒకే టాక్స్‌’ అంటూ గొప్పలు చెబుతున్న కేంద్ర ప్రభుత్వం ‘ఒకే దేశం…ఒకే పెన్షన్‌’ను ఎందుకు చేయడంలేదని తెలంగాణ ఆల్‌ పెన్సనర్స్‌ అండ్‌ రిటైర్డ్‌ పర్సన్స్‌ అసోసియేషన్‌(టాప్రా) రాష్ట్ర అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు పి.నారాయణరెడ్డి, పి.కృష్ణమూర్తి ప్రశ్నించారు. కనీసం పెన్షన్‌ రూ.9వేలు ఉండాలని, దీన్ని కేంద్ర ప్రభుత్వం అమలు చేయాలనీ, ఈపీఎస్‌ పెన్షన్‌ లేని బీపీఎల్‌ ఉద్యోగులకు ఆసరా ఫించన్‌ ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. హైదరాబాద్‌లోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో మంగళవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ‘నో ఇన్‌క్రీజ్‌ ఇన్‌ పెన్షన్‌-నో ఓట్‌’ స్టిక్కర్‌ ఆవిష్కరించారు.
అనంతరం వారు మాట్లాడుతూ వచ్చే ఎన్నికల్లో తమ సమస్యలను ఏ పార్టీ పరిష్కరిస్తుందో, వాటిని మ్యానిఫెస్టోలో చేరుస్తుందో, పెన్షన్‌ పెంచుతామని ప్రస్తావిస్తుందో ఆ పార్టీకే ఓటేస్తామని ప్రకటించారు. పెన్షన్‌ పెంపు, ఇతర సమస్యలను పరిష్కరించాలని దశాబ్ధ కాలంగా పోరాడుతున్నా కేంద్రప్రభుత్వం నిమ్మకునీరెతి ్తనట్టుగా వ్యవహరిస్తున్నదని అన్నారు. భగత్‌సింగ్‌ కోషియారి కమిటీ రిపోర్టు ప్రకారం డీఏ మూడువేలకుపైగా చెల్లించాలని, పెరుగుతున్న ధరలకనుగుణంగా డీఏ పెంచాలని డిమాండ్‌ చేశారు. తెలంగాణ రాష్ట్రంలో బీపీఎల్‌ పెన్షనర్లకు ఆరోగ్యశ్రీ పథకాన్ని అమలు చేయాలని డిమాండ్‌ చేశారు. ఈ సమావేశంలో సంఘం కోశాధికారి కె.నాగేశ్వర్‌రావు, ఉపప్రధాన కార్యదర్శి బ్రహ్మచారి, ఉపాధ్యక్షులు జనార్ధన్‌రెడ్డి, నాయకులు అరుణ, సమ్మయ్య, బి. రామారావు, ఎన్‌.సోమయ్య పాల్గొన్నారు.

Spread the love