ఉల్లి మంట కమలదళంలో కలవరం

onion fire Disturbance in Kamaladalam– ఎన్నికల వేళ ఘాటెక్కుతున్న ఆనియన్‌
– గతంలో ప్రభుత్వాలనే కూల్చేసిన ప్రజాగ్రహం
– ధరలను అదుపు చేసేందుకు చర్యలు ప్రారంభించిన కేంద్రం
న్యూఢిల్లీ : నవంబర్‌లో ఐదు రాష్ట్రాల శాసనసభలకు, వచ్చే సంవత్సరం ఏప్రిల్‌-మే నెలల్లో లోక్‌సభకు ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో నరేంద్ర మోడీ ప్రభుత్వానికి ఉల్లి ఘాటు తప్పేలా లేదు. కొద్ది నెలల క్రితం ఉల్లి ధరలు ఆకాశాన్ని తాకి ఆ తర్వాత దిగి వచ్చాయి. ప్రజలు ఊపిరి పీల్చుకునే లోపే టమాటా ధరలు కొండెక్కాయి. ఎట్టకేలకు అవి సాధారణ స్థాయికి చేరడంతో అంతా హమ్మయ్య అనుకున్నారు. ఇంతలోనే ఇప్పుడు ఉల్లి ధరలు మళ్లీ ఆకాశం వంక చూస్తూ మధ్య తరగతి ప్రజలను బెంబేలెత్తిస్తున్నాయి. ఉల్లి ధరల సెగకు గతంలో మన్మోహన్‌ సింగ్‌ ప్రభుత్వం ప్రజాగ్రహానికి గురైన విషయం గుర్తుండే ఉంటుంది. 2010లో ఉల్లి ధరలు బాగా పెరిగాయి. దీంతో అప్పటి మన్మోహన్‌ సింగ్‌ ప్రభుత్వం ఎగుమతులను నిలిపేసి దిగుమతి సుంకాలను తగ్గించింది. అయినప్పటికీ చిల్లర వ్యాపారులు ఉల్లి ధరలను పెంచి విక్రయించారు. మూడు సంవత్సరాల తర్వాత కూడా ప్రజలు ఈ విషయాన్ని మరచిపోలేదు. 2013 ఆగస్టులో జరిగిన శాసనసభ ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీ ఢిల్లీ, రాజస్థాన్‌ రాష్ట్రాల్లో అధికారం కోల్పోయింది. దేశంలో స్వాతంత్య్రానంతరం ఏర్పడిన తొలి కాంగ్రెసేతర జనతా పార్టీ ప్రభుత్వం కూడా ఉల్లి ధరల ధాటికి 1980 సార్వత్రిక ఎన్నికల్లో పతనమైంది. ఇప్పుడు అదే కమలదళాన్ని కలవరపెడుతోంది. దేశంలో సగటు ఉల్లి చిల్లర ధరలు ఏకంగా 57% పెరగడంతో రిటైల్‌ మార్కెట్లలో కిలో ఉల్లిని పాతిక రూపాయలకు విక్రయించాలని కేంద్రం శుక్రవారం నిర్ణయించింది. వినియోగ వ్యవహారాల మంత్రిత్వ శాఖ తెలిపిన సమాచారం ప్రకారం దేశంలో సగటున కిలో ఉల్లి ధర రూ.47కి చేరింది. గత సంవత్సరం ఇదే సమయంలో ఉల్లి ధర రూ.30 పలికింది. దేశ రాజధానిలో శుక్రవారం కిలో ఉల్లిని రూ.40కి విక్రయించారు. ఆగస్ట్‌ మధ్య నుండే ఉల్లిని కొనుగోలు చేసి నిల్వ చేస్తున్నామని, ధరలు మరింత పెరగకుండా ఇప్పుడు రిటైల్‌ మార్కెట్లలో వినియోగదారులకు తక్కువ ధరకే వాటిని అందుబాటులో ఉంచామని వినియోగ వ్యవహారాల మంత్రిత్వ శాఖ కార్యదర్శి రోహిత్‌ కుమార్‌ సింగ్‌ చెప్పారు. ఆగస్ట్‌ మధ్య నుంచి 1.7 లక్షల టన్నుల ఉల్లిని 22 రాష్ట్రాలలోని వేర్వేరు ప్రాంతాలలో నిల్వ చేసి ఉంచారు. ఆ నిల్వలను రిటైల్‌ మార్కెట్లలో ఎన్‌సీసీఎఫ్‌, నాఫెడ్‌ వంటి సహకార సంస్థలు, వాహనాల ద్వారా కిలో రూ.25కి సబ్సిడీ రేటుపై వినియోగదారులకు అందజేస్తున్నారు. రాజధాని ఢిల్లీలో కూడా సబ్సిడీ రేటుపై ఉల్లిని విక్రయిస్తున్నారు. ఖరీఫ్‌ సీజన్‌లో ప్రతికూల వాతావరణ పరిస్థితుల కారణంగా ఉల్లి సాగు ఆలస్యమైందని, దీంతో పంట ఆలస్యంగా చేతికి వచ్చిందని వినియోగ వ్యవహారాల మంత్రిత్వ శాఖకు చెందిన సీనియర్‌ అధికారి ఒకరు చెప్పారు. ఖరీఫ్‌ పంట ఇప్పటికే మార్కెట్‌కు చేరాల్సి ఉండగా ఇంకా రాలేదు. మరోవైపు నిల్వ చేసిన రబీ ఉల్లి నిల్వలు ఖాళీ అవుతున్నాయి. దీంతో సరఫరా పరిస్థితి సంక్లిష్టంగా మారింది. ఫలితంగా అటు హోల్‌సేల్‌ మార్కెట్‌లోనూ, ఇటు రిటైల్‌ మార్కెట్‌లోనూ ఉల్లి ధరలు పెరిగాయి. ఈ సంవత్సరం ఉల్లిని రెట్టింపు పరిమాణంలో నిల్వ చేశామని, దీనివల్ల దేశీయంగా ఉల్లి లభ్యత పెరిగి రాబోయే రోజుల్లో ధరలు అందుబాటులోకి వస్తాయని ఆ అధికారి ఆశాభావం వ్యక్తం చేశారు. 2023-24 ఆర్థిక సంవత్సరంలో ఎన్‌సీసీఎఫ్‌, నాఫెడ్‌ ద్వారా వినియోగ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఐదు లక్షల టన్నుల ఉల్లిని నిల్వ చేసింది. రాబోయే రోజుల్లో మరో రెండు లక్షల టన్నులు సేకరించాలని భావిస్తోంది.

Spread the love