ఉల్లి ధరలు భారీగా పెరగనున్నాయి

నవతెలంగాణ- ఢిల్లీ: మహారాష్ట్రతోపాటు దేశవ్యాప్తంగా ఉల్లిగడ్డల సంక్షోభం ఏర్పడే పరిస్థితులు నెలకొన్నాయి. మార్కెట్లో ఉల్లి సరఫరా తగ్గి ధరలు కొండెక్కే అవకాశం ఉందని భావిస్తున్నారు. ఉల్లిగడ్డలు సరఫరా చేసే నాసిక్‌లో తిరిగి వేలం పాటలు నిలిచిపోవడంతో ఈ పరిస్థితి ఏర్పడనుంది. నాసిక్‌ ఉల్లిగడ్డ వ్యాపారులు తాజాగా బుధవారం ప్రభుత్వానికి హెచ్చరిక జారీ చేశారు. నాసిక్‌ జిల్లాలోని అన్ని వ్యవసాయ మార్కెట్‌ కమిటీలలో వేలంను నిలిపివేస్తున్నామని, తమ ఆందోళనలు నిరవధికంగా కొనసాగుతాయని చెప్పారు. ఉల్లిగడ్డ ఎగుమతులపై సుంకాన్ని 40 శాతం పెంచుతూ కేంద్రం తీసుకున్న నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ ఈ ఆందోళన జరుపుతున్నట్టు నాసిక్‌ డిస్ట్రిక్ట్‌ ఆనియన్‌ ట్రేడర్స్‌ అసోసియేషన్‌ తెలిపింది.  కేంద్రం నిర్ణయం వల్ల అటు ఉల్లిగడ్డ ఎగుమతి దారులే కాక రైతులు సైతం తీవ్రంగా నష్టపోతున్నారని, అందుకే దీనిని ఉపసంహరించుకునే వరకు జిల్లాలోని అన్ని మార్కెట్‌ కమిటీలలో వేలాన్ని నిరవధికంగా నిలిపివేస్తున్నట్టు అసోసియేషన్‌ స్పష్టం చేసింది. కాగా, ఆందోళన చేసే వ్యాపారుపై తగు చర్యలు తీసుకుంటామని మహారాష్ట్ర మార్కెటింగ్‌ శాఖ మంత్రి అబ్దుల్‌ సత్తార్‌ హెచ్చరించారు.

Spread the love