ఉల్లిపాయలు, ఇసుకతో అతి పెద్ద శాంటా

Big Santa with onions and sand–  శిల్పాన్ని రూపొందించిన సుదర్శన్‌
పూరీ: ఒడిశాకు చెందిన ప్రముఖ సైకత కళాకారుడు సుదర్శన్‌ పట్నాయక్‌ మరోసారి తన నైపుణ్యాన్ని చాటారు. పూరీలోని బ్లూ ఫ్లాగ్‌ బీచ్‌లో ఉల్లిపాయలు, ఇసుక ఉపయోగించి ప్రపంచంలోనే అతి పెద్ద శాంటాక్లాజ్‌ సైకత శిల్పాన్ని రూపొందించారు. క్రిస్మస్‌ సందర్భంగా ‘గిఫ్ట్‌ ఏ ప్లాంట్‌, గ్రీన్‌ ద ఎర్త్‌’ అన్న సందేశంతో 100 అడుగుల పొడవు, 20 అడుగుల ఎత్తు, 40 అడుగుల వెడల్పు ఉన్న భారీ శాంటాక్లాజ్‌ను తీర్చదిద్దిటనట్లు తెలిపారు. దీని కోసం రెండు టన్నుల ఉల్లిపాయలు వినియోగించినట్లు చెప్పారు. ‘ఒక మొక్కను బహుమతిగా ఇవ్వండి, భూమిని పచ్చగా చేయండి’ అన్న సందేశంతో ఈ సైకత శిల్పాన్ని తయారు చేసినట్లు వెల్లడించారు. కాగా, ప్రస్తుత కాలంలో ఎక్కువ చెట్లను నాటాల్సిన అవవసరం ఉందని సుదర్శన్‌ పట్నాయక్‌ తెలిపారు. అందుకే ప్రపంచంలోనే అతి పెద్ద శాంటాక్లాజ్‌ సైకత శిల్పంలో ఉల్లిపాయలను కూడా టన్నుల్లో వినియోగించినట్లు చెప్పారు. ‘వాతావరణ మార్పుల ప్రభావం గురించి మనందరికీ తెలుసు. కాబట్టి ఇది మనందరికీ ఒక సందేశం. మరిన్ని చెట్లను నాటడం ఆవశ్యకత. ఈ సైకత శిల్పాన్ని పూర్తి చేయడానికి 8 గంటలు పట్టింది. ఇసుక, ఉల్లిపాయలతో కూడిన అతిపెద్ద శాంతాక్లాజ్‌ సైకత శిల్పం ఉన్న భారతదేశాన్ని క్రిస్మస్‌ జరుపుకుంటున్న ప్రపంచం చూస్తుంది’ అని ఎక్స్‌లో పేర్కొన్నారు. దీనికి సంబంధించిన వీడియో క్లిప్‌ను అందులో పోస్ట్‌ చేశారు.

Spread the love