Sunday, May 24, 2026
E-PAPER
Homeదర్వాజఒకే ఒక ఎండాకాలం

ఒకే ఒక ఎండాకాలం

- Advertisement -

అంతా అయిపోయింది
అందరూ చేతులెత్తేశారు
ఇక ఏమి మిగిలిపోలేదని
గొంతెత్తి చెపుతున్నారు
కాలం మారింది
యుద్ధ తంత్ర విద్య
మిధ్యా మంత్రంగా మారింది
తాను పట్టిన కుందేలుకు మూడు కాళ్లు
ఒక ఎండమావుల కాలం కొనసాగుతుంది
నిన్న మొన్న తొడుక్కున్న వస్త్రాలు
విడిచి కాలం చాకిరేవుకు అప్పగించింది
పచ్చని లేచిగుళ్ల దుస్తులను
ప్రకృతి దర్జీ రహస్యంగా కుట్టి
చెట్టుకు బహుమతిగా ఇచ్చింది
ఒక జీరో షాడో డే దందా నడుస్తున్నది
ఇంతకాలం నిరాకరించిన దాన్ని
ఇప్పుడు అందరూ అంగీకరిస్తున్నారు
ఇంతకాలం వ్యతిరేకించిన దాన్ని
ఇప్పుడు అందరూ ఆమోదిస్తున్నారు
ఒక బతికివున్న శవయాత్ర సాగుతున్నది
పునాదిలో కదలిక
ఉపరితలంలో ఒక బడలిక
అందరూ చిటికె లేస్తూ
ఆవులింతలు తీస్తున్నారు
అందరూ వేడి పకోడీలా
సెగలు పొగలు కక్కుతున్నారు
ఒక దపుడుకల్లం ఆశ విడిచి పోనంటున్నది
నిలుచున్న సిగ్నల్ టవర్స్
నేల కూలిపోతున్నాయి
తలెత్తుకున్న జాజురంగు స్తూపాలు
ఎదురుగాలికి దీపాల్లా ఆరిపోతున్నాయి
ఒక త్యాగ రాగాల
ఊరేగింపు కొనసాగుతున్నది
ఊర్లను ఖాళీచేసి
అడవిని అడ్రస్ గా మార్చుకుంది
అభివృద్ధి అర్థం మారిపోయింది
ఆయుధం గొంతు పొలమారిపోతుంది
ఒక లొంగుబాటు పశ్చాత్తాపం ప్రకటిస్తున్నది
నీకు ఒప్పు అనిపించింది
ఇతరులకు తప్పు అనిపిస్తుంది
వేరొకరికి తప్పు అనిపించింది
నీకు ఒప్పుగా కనిపిస్తుంది
ఆకాశంలో తెల్లారే చుక్క లేని
ఒక సంక్లిష్ట భగ్న కలల రాత్రి నడుస్తున్నది
బుద్ధుడు పూలే అంబేడ్కర్
ఎంత చెప్పినా మన చెవికి ఎక్కదు
మరోపక్క మార్క్స్ లెనిన్ మావో
బొమ్మ తుపాకీ యుద్ధఫలం దక్కదు
కర్తలు కర్మలు స్వర్గ నరకాలు
మడి కట్టిన దైవం తొంగి చూస్తున్నది
ఒక సమాచార అనారిక క్రీడ సాగుతున్నది
ఇక ఏమీ మిగిలిపోలేదని
అందరూ చేతులెత్తేశారు
తమను తాము పండ్లో అని
అమ్ముకొని అమ్ముకొని
అందరూ తకాయించి పోయారు
ఒక దళారి సంత కొనసాగుతున్నది
బూడిద కింద నిజం నిప్పును
కప్పి పుచ్చుతున్నారు
ప్రశ్న సూదిని ముల్లె కడుతున్నారు
రాశికి రాని రంగానికి రాని
ఒక ఎద్దు ఎనుపోతు వ్యవసాయం చేస్తున్నారు
చెర్ల నీళ్లు చెరువు వెనుక పడ్డాక
ఊము తడి కన్పీటి సంతాప
సందేశం తెలుపుతున్నారు
పొంతన లేని చింతన సభలు పెడుతున్నారు
అంతా అయిపోయిందని
అందరూ చేతులెత్తేస్తున్నారు
సమస్యల్ని అనామతు పద్దులోకి నెట్టేస్తున్నారు
చూపు ఉన్నా గుడ్డివాళ్లు
కాళ్లు ఉన్నా అవుటివాళ్ళు
చెవులున్నా చెవిటి వాళ్ళు
భర్తల్ని చంపి భార్యలకు పింఛన్లు
మంజూరు చేస్తున్న ఒక రాజ్యం నడుస్తున్నది
న్యాయ దేవత కళ్ళకు గంతలు విప్పేసినా
న్యాయం నాలుగు కాళ్ల మీద నడుస్తున్నది
అమాయకులు జైళ్లలో మగ్గుతున్నారు
అన్యాయం రాజ మార్గంలో
ఒళ్ళు విరుచుకుని సాగుతున్నది
ఒకేవొక ఎండాకాలం సాగుతున్నది
జూకంటి జగన్నాథం

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -