అవయవదానం పునర్జన్మనిస్తుంది

నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్‌
అమ్మ జన్మనిస్తుంది.. అవయవ దానం పునర్జన్మనిస్తుందని రాష్ట్ర మహిళా కమిషన్‌ చైర్‌ పర్సన్‌ సునితా లక్ష్మారెడ్డి తెలిపారు.గురువారం హైదరాబాద్‌లోని రాష్ట్ర మహిళా కమిషన్‌ కార్యాలయంలో 13వ జాతీయ అవయవ దాన దినోత్సవాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ అవయవదానం వల్ల ఒక్కరే పదుల సంఖ్యలో జీవితాలను నిలబెట్టవచ్చనే నిజం తెలుసుకోవాలన్నారు. 2022 సంవత్సరంలో బ్రెయిన్‌ డెడ్‌ అయిన వారి అవయవాలను దానం చేయడంలో దేశంలోనే తెలంగాణ మొదటిస్థానంలో నిలిచిందని తెలిపారు. అవయవ మార్పిడి శస్త్ర చికిత్సల్లోనూ మొదటి స్థానంలో ఉన్నామని పేర్కొన్నారు. దీనికి గుర్తింపుగా కేంద్రం ప్రభుత్వం తెలంగాణకు ‘స్టేట్‌ విత్‌ హయ్యస్ట్‌ నంబర్‌ ఆఫ్‌ డిసీజ్డ్‌ డోనర్స్‌’ అవార్డును ప్రకటించిందని గుర్తుచేశారు. అవయవదానాన్ని ప్రోత్సహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా జీవన్‌దాన్‌ అనే సంస్థను ఏర్పాటు చేసిందని తెలిపారు. అవయవాలు కావాల్సిన వారు ఈ సంస్థలో తమ పేర్లను నమోదు చేసుకోవాలని పేర్కొన్నారు.

Spread the love