‘దేశ ఆర్థిక వ్యవస్థకు వెన్నెముక ఏమిటి?’ అని ప్రశ్నిస్తే.. చాలా మంది పరిశ్రమలు, వ్యవసాయం, ఐటీ రంగం అని చెబుతారు. కానీ ఈ రంగాలన్నింటినీ కలిపి నడిపించే శక్తి రవాణా వ్యవస్థ. ఒక రైతు పండించిన పంట మార్కెట్‌కు చేరాలంటే, ఫ్యాక్టరీలో తయారైన వస్తువు వినియోగదారుని చేరాలంటే, ఆసుపత్రికి మందులు చేరాలంటే, నిర్మాణ రంగానికి సిమెంట్, ఉక్కు చేరాలంటే, ప్రతిచోటా రోడ్ రవాణానే ప్రధాన ఆధారం. దేశంలో నేడు కోట్లాది మంది డ్రైవర్లు, క్లీనర్లు, మెకానిక్లు, గ్యారేజ్ కార్మికులు, బస్సు సిబ్బంది, డెలివరీ వర్కర్లు, గిగ్ ప్లాట్ఫారమ్ డ్రైవర్లు ఈ రంగంలో పనిచేస్తున్నారు. వీరి శ్రమ వల్లనే దేశ ఆర్థిక వ్యవస్థ నిరంతరంగా కదులుతోంది. అయితే ఈ స్థాయికి రోడ్ రవాణా వ్యవస్థ ఒక్కరోజులో రాలేదు. వేల ఏండ్ల చరిత్ర, అనేక సాంకేతిక మార్పులు, సామాజిక పరిణామాలు, నాటి రాజుల, ప్రభుత్వాల రాజకీయ నిర్ణయాలు, కార్మికుల శ్రమ కలిసి ఈ వ్యవస్థను నిర్మించాయి.
భారతదేశంలో రవాణా చరిత్రను పరిశీలిస్తే.. మొదట మనిషి కాలినడకనే ప్రయాణించేవాడు. గ్రామాల మధ్య కాలిబాటలు, అడవి మార్గాలు మాత్రమే ఉండేవి. తర్వాత మనిషి జంతువులను మచ్చిక చేసుకున్నాడు. వాటితో సహజీవనం చేస్తూ జీవన ప్రయాణాన్ని ప్రారంభించాడు. మానవ ప్రయాణానికి గుర్రాలను వాడేవారు. రాజులు, ధనవంతులు పల్లకీని వాడేవారు. బరువైన వస్తువులను తరలించేందుకు ఎద్దులు, దున్నలు, గాడిదలను ఉపయోగించే వారు.
మానవ చరిత్రలో గొప్ప విప్లవం
ప్రపంచ చరిత్రలో అత్యంత గొప్ప ఆవిష్కరణల్లో చక్రం ఒకటి. చక్రం లేకపోతే రవాణా వ్యవస్థ ఈ స్థాయికి వచ్చేది కాదు. క్రీస్తు పూర్వం 3500 – 4000 ప్రాంతంలో చక్రం కనుగొనబడింది. ప్రాచీన మెసపటోమియా (ప్రస్తుత ఇరాక్ ప్రాంతం)లో దీన్ని ముందుగా ఉపయోగించిన ఆధారాలు కనిపించాయి. చక్రం వల్ల భారీ బరువులను సులభంగా తరలించడం సాధ్యమైంది. దీనివల్ల ఎద్దులు, గుర్రాలు, ఒంటెలు, దున్నలు వంటి జంతువులు కేవలం వ్యవసాయానికే కాకుండా రవాణాకు కూడా ఉపయోగపడ్డాయి. గ్రామాల మధ్య సంబంధాలు పెరిగాయి. వాణిజ్యం విస్తరించింది. అప్పుడే ఎద్దుల బండ్లు భారతదేశ ఆర్థిక వ్యవస్థలో ప్రధాన పాత్ర పోషించాయి. సింధు లోయ నాగరికత (క్రీ.పూ. 2600-1900) తవ్వకాలలో దొరికిన బొమ్మలు, ముద్రలు, మట్టి నమూనాలు చక్రాలున్న బండ్ల వినియోగాన్ని సూచిస్తున్నాయి. అందువల్ల ఎద్దుల బండినే భారతదేశపు తొలి రోడ్ వాహనంగా చరిత్రకారులు గుర్తించారు. ఈ ఎద్దుల బండ్లే గ్రామీణ ఆర్థిక వ్యవస్థకు ప్రాణాధారం. వేల ఏండ్ల పాటు ఇవే దేశంలోని ముఖ్య రవాణా సాధనాలు.
మౌర్యుల కాలంలో…
ప్రాచీన భారతదేశంలో సింధు నాగరికత తర్వాత గణ వ్యవస్థ, జనపదాలు, మహాజనపదాలుగా సమాజం పరిణామం చెందినది. 11 మహాజనపదాలలో మగధ మహాజనపదం నుండి ఒక ‘రాజ్యంగా’ అభివృద్ధి అయినది. ఆ రాజ్యాన్ని పాలించిన రాజులలో నంద వంశం తర్వాత చివరిగా మౌర్య వంశ రాజుగా చంద్రగుప్త మౌర్య తన రాజ్యాన్ని మహా సామ్రాజ్యాంగా విస్తరించారు. భారతదేశం మొత్తాన్ని పాలించాడు. క్రీ.పూ. 4వ శతాబ్దంలో మౌర్య సామ్రాజ్యం ఏర్పడిన తర్వాత రవాణా వ్యవస్థకు మరింత ప్రాధాన్యం లభించింది. చాణక్యుని అర్థశాస్త్రంలో రహదారుల నిర్మాణం, నిర్వహణ, ప్రయాణ భద్రత గురించి ప్రస్తావనలు ఉన్నాయి. మౌర్య రాజులు ప్రధాన పట్టణాలను కలిపే రహదారులు నిర్మించారు. వాణిజ్య మార్గాలను రక్షించారు. విశ్రాంతి కేంద్రాలు ఏర్పాటు చేశారు. ఇది దేశవ్యాప్తంగా వస్తువుల రవాణాను వేగవంతం చేసింది.
మధ్యయుగ రవాణా
మధ్యయుగ కాలంలో రాజపుత్రులు, చోళులు, ఢిల్లీ సుల్తానేట్, విజయనగర సామ్రాజ్యం, మొగల్ సామ్రాజ్యం వంటి ప్రధాన రాజ్యాల కాలంలో రవాణా వ్యవస్థ బాగా అభివృద్ధి చెందింది. రాజ పుత్రులు, చోళులు దేవాలయాల నిర్మాణం మీద దృష్టిపెట్టారు. ఢిల్లీ సుల్తానేట్ కాలంలో అల్లావుద్దీన్ ఖిల్జీ హర్కార (పాదతపాల- కాలినడక రన్నర్లు మైలు మైలుకు మారుతూ మెయిల్ తీసుకొని వెళ్ళే) వ్యవస్థ మొదటి రికార్డెడ్ పోస్టల్ సిస్టమ్‌ని ప్రారంభిస్తే మొహమద్ బీన్ తుగ్లక్, పిరోష తుగ్లక్ గుర్రపు తపాల వ్యవస్థాను ప్రారంభించారు. పిరోష రోడ్ల వ్యవస్థ కూడా మెరుగుపరిచాడు. తర్వాత షేర్షా సూరి రోడ్డు రవాణా చరిత్రలో ప్రముఖమైన గ్రాండ్ ట్రక్ నిర్మాణం చేపట్టాడు. ప్రాచీన ఉత్తరపద రోడ్డును పునర్ నిర్మించి బెంగాల్ నుండి పెషావర్ (కాబూల్) వరకు విస్తరించాడు. రోడ్ల పక్క సరాయిలు (విశ్రాంతి గృహాలు) 1700 పైగా నిర్మాణం చేసాడు. ఈ మార్గం వెంట సరాయిలుతో పాటు బావులు, చెట్లు నాటటం, గుర్రాల మార్పిడి కేంద్రాలు ఏర్పాటు చేయడం ద్వారా ప్రయాణం సులభమైంది. ఇది భారతదేశంలో రోడ్ రవాణా అభివృద్ధికి కీలక మలుపు. రోడ్డును విశాలం చేసి సౌకర్యాలు జోడించి వాణిజ్యం, తపాల సేవలను వేగవంతం చేశాడు. షేర్షా సూరి తర్వాత అక్బర్, షాజహాన్ సమయంలో రోడ్ నెట్‌వర్క్ మెరుగుపడింది. గ్రాండ్ ట్రక్ రోడ్డును షేర్షా పున: నిర్మాణం చేసిన తర్వాత మొఘలులు మరింత మెరుగుపరిచారు. మధ్యయుగంలో గుర్రపు రథాలు, ఒంటెల బండ్లు, ఎద్దుల బండ్లు విస్తృతంగా ఉపయోగించబడ్డాయి.
ఆధునిక రహదారుల ప్రారంభం
బ్రిటిష్ పాలనా కాలంలో భారతదేశంలో రహదారుల అభివృద్ధికి ప్రణాళికా బద్ధమైన కృషి జరిగింది. అయితే ఈ కృషంతా తమ వాణిజ్య ప్రయోజనాల కోసం చేశారు. బ్రిటీష్ వారి కాలంలో నాలుగు ప్రధానమైన మార్పులు జరిగాయి.
వాహనాలు ప్రారంభం – అభివృద్ధి: భారతదేశాన్ని బ్రిటీష్ వాళ్ళు పాలించటం మొదలైన కాలంలోనే ఇంగ్లాండ్‌లో పారిశ్రామిక విప్లవం ప్రారంభమై జర్మనీ, ఫ్రాన్స్, అమెరికా వంటి దేశాలకు విస్తరించింది. అనేక కొత్త యంత్రాలు సాంకేతిక పరిజ్ఞానం అభివృద్ధి చెంది కొత్త ఆవిష్కరణలు జరిగాయి. సైకిల్, బైక్, కార్, ట్రక్, బస్, ఆటో తదితరాలు కనుగొనబడ్డాయి. 1817లో జర్మనీకి చెందిన కార్ల్ వాన్ డ్రైస్ మొదట పెడల్స్ లేని సైకిల్ నిర్మించారు. 1860 తర్వాత పెడల్స్ చైన్ వ్యవస్థ వచ్చింది. 1890లో భారతదేశంలో బ్రిటీష్ వారి ద్వారా సైకిల్ వాడటం ప్రారంభమైంది. మొదట్లో ధనికులు మాత్రమే సైకిల్ వాడేవారు. 1938లో అట్లాస్, హీరో వంటి స్వదేశీ కంపెనీలు రావడంతో సైకిల్ సామాన్యుడికి అందుబాటులో వచ్చింది.
1885లో జర్మనీకి చెందిన గోట్రైబ్ డైమ్లర్ అండ్ విల్హెమ్మేబాచ్ లు మొదటి మోటార్ సైకిల్ (బైక్)ను తయారుచేశారు. భారతదేశంలో 1901లో బ్రిటీష్ వాళ్ళు భారత్‌కు మోటార్ బైక్లు తీసుకొచ్చారు. 1955లో భారతసైన్యం సరిహద్దు రక్షణ కోసం ఆర్డర్ ఇవ్వటంతో రాయల్ ఎన్ఫీల్డ్ బుల్లెట్ దేశంలో విపరీతమైన ప్రజాదరణ పొందింది.
1886లో జర్మనీకి చెందిన కార్ల్ బెంజ్ మొదటి ఆధునిక పెట్రోల్ కార్‌ని కనుగొన్నారు. 1897లో కలకాత్తా చెందిన విలియమ్ రాబర్ట్ సన్ ద్వారా మొదట కార్ దిగుమతి అయింది. టాటా గ్రూప్ అధినేత జెమ్సెట్ టాటా కారు కొనుగోలు చేసిన తొలి భారతీయుడిగా నిలిచారు. 1940లో హిందుస్థాన్ మోటార్స్ తొలిగా కార్ల తయారీని ప్రారంభించింది. 1895 జర్మనీలో 8 సీట్ల సామర్థ్యంతో మోటరైజ్డ్ బస్సును బెంజ్ కంపెనీ నడిపింది. 1920 ప్రారంభంలో ముంబై, కలకత్తా వంటి నగరాల్లో ప్రజా రవాణా కోసం మోటార్ బస్సులు ప్రవేశించాయి. 1926లో ముంబయిలో సిటీ బస్సు సర్వీసులు ప్రారంభమయ్యాయి.
1930 చివరిలో ఇటలీకి చెందిన పియోజియో కంపెనీ త్రివీలర్ ఆటోను రూపొందించింది. 1948లో బద్రాజ్ ట్రేడింగ్ లిమిటెడ్ (ప్రస్తుతం బజాజ్ లిమిటెడ్) ఇటలీ నుండి త్రి వీలర్ ఆటోలను దిగుమతి చేసుకొని ఆటోరిక్షా సేవలను ప్రారంభించింది. 1959లో బజాజ్ సొంతంగా భారతదేశంలో ఆటోరిక్షా ఉత్పత్తిని ప్రారంభించింది.
1896లో ట్రక్కు/లారీ జర్మనీకి చెందిన గాడ్అప్ డైమ్లర్ కనుగొన్నారు. 1920ల్లో బ్రిటీష్ కాలంలో లారీ/ట్రక్కుల దిగుమతి ప్రారంభమైతే 1954లో టాటామోటార్స్ ప్లస్ మెర్సడీస్ బెంజ్ సహకారంతో టాటా మెర్సడీస్ బెంజ్ 312 సిరీయస్ ట్రక్కు ప్రారంభమైంది. ఇది భారత్‌లో మొదటిగా ప్రారంభమైన ట్రక్కు,
1892లో అమెరికన్ ఇంజనీర్ జాన్ఫ్రాలీత్ పెట్రోల్‌తో నడిచే ట్రాక్టర్‌ను ప్రారంభించారు. 1901లో హార్ట్ఫర్ కంపెనీ ట్రాక్టర్స్ తయారీ మొదలు పెట్టింది. 1917 నుండి భారత్‌లో ట్రాక్టర్ల వాడకం ప్రారంభమైన 1947 తర్వాతే వాడకం పెరిగింది.
2 రోడ్ల నిర్మాణం: బ్రిటీష్ వారు మెటల్ రోడ్లు, మెకడమ్ రోడ్లు బాగా అభివృద్ధి చేశారు. వారి హయాంలో 1775లో నిర్మించిన భారక్పూర్ ట్రంక్ రోడ్డు, (బిటి రోడ్ కోల్కత్తా) అత్యంత పురాతనమైన రోడ్లలో ఒకటిగా పేరుగాంచింది. కలకత్తా పరిసరాల్లో వర్షాకాలంలో ఎద్దుల బండ్లు, బురదలో చిక్కుకుపోకుండా చేసిన మొదటి గట్టి రహదారి. కలకత్తా ఆగ్రా రోడ్ 1830లో తూర్పు ఉత్తర భారతదేశాల్ని కలపటానికి నిర్మించారు. తర్వాత కాలంలో ఈ రోడ్డు జిటి రోడ్ నెట్వర్క్ విలీనం అయింది. గ్రేట్ హిందుస్థాన్ టిబెట్ రోడ్డు 1850లో హిమాలయ పర్వతప్రాంతాల్లో నిర్మించిన మొట్టమొదటి కొండ ప్రాంతాల మెటల్ హైవే ఇది. గ్రేట్ డెక్కన్ రోడ్డు దక్కన్ పీఠభూమిలోని నేలల్లో వర్షాకాలంలో కూడా ప్రయాణం సాఫీగా జరిగేందుకు ఈ మెటల్ రోడ్డుని నిర్మించారు. తర్వాత ఇది ఎన్.హెచ్ 44లో విలీనం అయింది. అలాగే భారతదేశంలో అధిక వేడిని తట్టుకోలేక హిల్ స్టేషన్స్ అభివృద్ధి చేశారు. వాటిని చేరుకోవటానికి కష్టతరమైన కొండ ప్రాంతాల్లో ప్రత్యేక ఇంజనీరింగ్ విధానాలతో ఘాట్ మెటల్ రోడ్లు, కాల్కా – షిమ్లా రోడ్డు, మెట్టు పాళయం – ఊటీ ఘాట్ రోడ్డు, సిలిగురి డార్జిలింగ్ రోడ్లు వేశారు. అయితే బ్రిటీష్‌వారు ఈ మెటల్ రోడ్లన్నింటిని పిడబ్ల్యుడి పబ్లిక్ వర్క్స్ డిపార్ట్మెంట్ 1865లో స్థాపించి దాని ద్వారా నిర్మించారు. అలాగే 1951లో టెలీగ్రాఫ్, 1853లో రైల్వే, 1854లో ఆధునిక పోస్టల్ వ్యవస్థను ప్రారంభించారు. అదే విధంగా రహదారుల నిర్మాణాన్ని వీటికి అనుసంధానించటం వల్ల మోటర్ వాహనాల వాడకం పెరిగింది. ఫలితంగా రోడ్డు రవాణా రంగంలో డ్రైవర్ అనే వృత్తి కొత్తగా ప్రారంభమైంది.
తొలి మోటర్ వాహన చట్టం ఏర్పాటు: మోటర్ వాహనాల నమోదు లైసెన్సింగ్ వ్యవస్థ ట్రాఫిక్ నియంత్రణకు ప్రారంభ నిబంధనలు రూపొందించాల్సి వచ్చింది. ఫలితంగా 1914లో మోటార్ వాహనాల చట్టం తెచ్చారు. క్రమంగా రవాణా రంగంలో ప్రైవేట్ మోటార్ కంపెనీలు ప్రారంభమయ్యాయి. బొంబాయి, ట్రాంవే & మోటార్ సర్వీసెస్ కంపెనీ, మద్రాస్ మోటార్ సర్వీసెస్ (ఎమ్ఎమ్ఎస్) సిమ్సన్ & కో వంటి ప్రైవేట్ మోటార్ కంపెనీలు ప్రారంభంతో రవాణా రంగ సేవలు విస్తరించాయి. డ్రైవర్‌తో పాటు క్లీనర్ కండక్టర్ మెకానిక్ పిట్టర్ టైర్ రిపేర్ వర్కర్, గేరేజ్ వర్కర్ వెహికల్ బాడీబిల్డర్ వంటి వృత్తులు ప్రారంభమై విస్తరించాయి.
జయకర్ కమిటీ ఏర్పాటు : ఈ క్రమంలో రోడ్డు రవాణా వ్యవస్థ మరింత అభివృద్ధి చెందాలంటే ఏంచేయాలనే దానిపై అధ్యయనం చేసేందుకు బ్రిటీష్ వారు ఎన్ఆర్ జయకర్ అధ్యక్షతన 1927లో కమిటీ వేసింది. ఈ కమిటీ జయకర్ కమిటీగా ప్రసిద్ధి చెందింది. ఈ కమిటీ ఒక నివేదిక ఇచ్చింది. దీని ఆధారంగా 1929లో బ్రిటీష్ వారు సెంట్రల్ రోడ్డు ఫండ్ స్థాపించారు. 1934లో ఇండియన్ రోడ్డు కాంగ్రెస్ (ఐఆర్సి) స్థాపించారు. 1914 మోటర్ వాహనాల చట్టాన్ని ఆధునీకరించి మోటర్ వాహనాల చట్టం 1939 తీసుకొచ్చారు. 1943లో నాగపూర్ ప్లాన్ పేరుతో రోడ్డు అభివృద్ధికై 20 ఏండ్ల దీర్ఘకాలిక ప్లాన్ ప్రారంభించారు.
స్వాతంత్ర్యానంతరం
బ్రిటీష్ వారు చేసిన అభివృద్ధి అంతా వారి వ్యాపార ప్రయోజనాల కోసం చేయడంతో 1947లో దేశానికి స్వాతంత్య్రం వచ్చేనాటికి దేశంలో సగానికి పైగా గ్రామాలకు పక్కా రోడ్లు లేవు. బస్సు సర్వీసులు చాలా ప్రాంతాలకు అందుబాటులో లేవు. గ్రామాలకు పట్టణాలతో, పట్టణాలను జిల్లా కేంద్రాలతో అనుసంధానించే రవాణా వ్యవస్థ లేదు. ఈ క్రమంలో భారతప్రభుత్వం రోడ్డు రవాణా వ్యవస్థను ఒక మౌళిక సదుపాయంగా కల్పించాల్సిన అవసరాన్ని గుర్తించి దాని అభివృద్ధికి ప్రణాళికబద్ద కృషి ప్రారంభించింది. 1. పంచవర్ష ప్రణాళిక ద్వారా రహదారుల నిర్మాణానికి ప్రధాన్యం ఇచ్చింది. ఆర్టీసీలను ప్రారంభించింది. చట్టాలను రూపొందించింది. దేశవ్యాప్తంగా రోడ్డు నిర్మాణం, వాటిని నిర్వహించేందుకు వివిధ రకాల సంస్థలను ఏర్పాటు చేసింది. 20 ఏండ్ల దీర్ఘకాలిక ప్రణాళికను చేపట్టింది.
ఆర్టీసీలు ఏర్పాటు
ప్రజలకు చౌకైన, సురక్షిత ప్రయాణ సౌకర్యం కల్గించేందుకు అన్ని గ్రామీణ ప్రాంతాల అనుసంధానం కొరకు ఆర్టీసీలను ప్రారంభించారు. బ్రిటీష్ వారి కాలంలో హైదరాబాద్ రాష్ట్రంలో నైజాం 1932లో నిజాం స్టేట్ రైల్ & రోడ్ డిపార్ట్‌మెంట్ ద్వారా ఆర్టీసీని 27 బస్సులు, 166 ఉద్యోగులతో ప్రారంభించింది. స్వాతంత్య్రం వచ్చిన తర్వాత కేంద్ర ప్రభుత్వం రోడ్డు ట్రాన్స్‌పోర్ట్ యాక్ట్ 1950ను తీసుకొచ్చింది. 1948లో వెహికల్ పాలసీ, స్క్రాపేజ్ పాలసీ, ఇంటెలిజెంట్ ట్రాన్స్‌పోర్ట్ సిస్టమ్స్ (ఐటిఎస్) స్మార్ట్ ట్రాఫిక్ మేనేజ్మెంట్ విధానాలు ప్రారంభమయ్యాయి. మోటర్ వెహికల్ యాక్ట్ 1988ని సవరించి మోటర్ వెహికల్ యాక్టు 2019ని తీసుకొచ్చారు. కేంద్ర ప్రభుత్వం ఈ చట్టంలో చాలా కీలక మార్పులు చేసింది. భారీ జరిమానాలు డ్రైవింగ్ లైసెన్స్ ప్రక్రియలో మార్పులు, ఫీజుల పెంపు సర్వీసుల ప్రైవేటీకరణ తదితరాలతో పాటు ప్రధానమైన మార్పు అగ్రిగ్రేటర్లకు అవకాశం కల్పించారు. ఈ మార్పు ఫలితంగా ఓబర్, ఓలా, స్విగ్గీ, జొమాటొ, పోర్టర్, ర్యాపిడో వంటి డిజిటల్ ఫ్లాట్ఫామ్స్ విపరీతంగా మార్కెట్లోకి వచ్చాయి. డిజిటల్ ఫ్లాట్ఫామ్స్ రవాణా రంగంలో యజమాని కార్మిక సంబంధాల్ని కొత్త రూపంలోకి మార్చాయి. కార్మిక చట్టాలు పరిధిలోకి రాకుండా కార్మిక శ్రమను దోపిడీ చేసేవిధంగా డిజిటల్ ఫ్లాట్ఫామ్స్ తమ విధానాలను ఫ్రేమ్ చేసుకుంటున్నాయి. ఈ దోపిడీని అడ్డుకట్ట వేసేవిధంగా దేశవ్యాప్తంగా తగు రీతిలో కొత్త కార్మిక చట్టాలను రూపొందించి పటిష్టంగా అమలు చేయాల్సిన అవసరం ఉంది. తెలంగాణలో మరికొన్ని రాష్ట్రాల్లో ఈ డిజిటల్ ఫ్లాట్ఫామ్ వర్కర్స్ సంక్షేమానికై చట్టాలు రూపొందించినా వాటికి తగిన విధంగా రూల్స్ రూపొందించని కారణంగా ప్రస్తుతం కార్మికులకు ఉపయోగంలేని విధంగా తయారయ్యింది. కేంద్ర ప్రభుత్వం తెచ్చిన ‘మోటార్ వెహికల్ అగ్రిగేటర్ గైడ్లైన్స్ యాక్ట్ 2025’ కేవలం ప్యాసింజర్స్ సర్వీస్ అందించే కార్మికులకు మాత్రమే వర్తించే విధంగా ఉండటం ప్రధాన లోపం. దీనిని సవరించాల్సిన అవసరం ఉంది. కార్మికులకు ఉపయోగపడేలా ఈ చట్టాల్లో మార్పులు జరగాలంటే పోరాటమే కార్మికులకు ఉన్న ఏకైక ఆయుధం.
కలవాల అజయ్ బాబు, 8333818711



