Saturday, September 12, 2026
E-PAPER
Homeజాతీయంమన ఫోనే.. మన శత్రువు

మన ఫోనే.. మన శత్రువు

- Advertisement -

‘క్లాడ్‌’ను ఆయుధంగా మార్చే ప్రయత్నాలు
ఆంత్రోపిక్ భద్రతా నివేదిక

బయోవెపన్స్ నుంచి గూఢచర్యం వరకు ఏఐ దుర్వినియోగం
క్షిపణులు, డ్రోన్ స్వార్మ్‌ల అభివృద్ధికి ప్రయత్నాలు
సామూహిక నిఘా, సైబర్ దాడులు, ప్రచార యుద్ధాలు, డేటా చోరీల్లో క్లాడ్ వినియోగం
ప్రపంచవ్యాప్తంగా దుర్వినియోగ ఘటనలపై రిపోర్టు

కృత్రిమ మేధస్సు (ఏఐ) మానవ జీవితాన్ని సులభతరం చేస్తూనే మరోవైపు తీవ్రమైన భద్రతా సవాళ్లను కూడా సృష్టిస్తోంది. ప్రముఖ ఏఐ సంస్థ ఆంత్రోపిక్ అభివృద్ధి చేసిన క్లాడ్‌ను బయోవెపన్స్, క్షిపణులు, స్వయంచాలక డ్రోన్లు, సామూహిక నిఘా, గూఢచర్యం, సైబర్ దాడులు, తప్పుడు ప్రచారాలకు వినియోగించేందుకు పలు దేశాలు, సంఘటిత నేరగాళ్ల ముఠాలు ప్రయత్నించినట్టు సంస్థ సంచలనాత్మక విషయాన్ని వెల్లడించింది. అత్యాధునిక ఏఐ సామర్థ్యాలు పెరుగుతున్న కొద్దీ వాటి దుర్వినియోగం కూడా కొత్త స్థాయికి చేరుతోందని హెచ్చరించింది.



న్యూఢిల్లీ : ప్రపంచవ్యాప్తంగా కృత్రిమ మేధస్సు (ఏఐ) ఆధారిత వ్యవస్థలను విధ్వంసక కార్యకలాపాలకు ఉపయోగించేందుకు జరుగుతున్న ప్రయత్నాలు ఆందోళన కలిగిస్తున్నాయి. పలు దేశాలతో సంబంధాలున్న వర్గాలు, ఆర్థిక నేరగాళ్లు, ప్రచార నెట్‌వర్క్‌లు, స్పైవేర్ సంస్థలు, రాజకీయ ప్రయోజనాలతో పనిచేసే వ్యక్తులు క్లాడ్ ఏఐని దుర్వినియోగం చేసేందుకు ప్రయత్నించినట్టు ఆంత్రోపిక్ తన తాజా భద్రతా నివేదికలో వెల్లడించింది. 2025 డిసెంబర్ నుంచి ఈ ఏడాది ఆగస్టు వరకు అడ్డుకున్న, గుర్తించిన అత్యంత కీలకమైన, కొత్త తరహా ముప్పులను ఈ నివేదికలో వివరించింది.
తన క్లాడ్ ఏఐ మోడళ్లను బయోవెపన్స్ తయారీ పరిశోధనలు, క్షిపణులు, స్వయంచాలక ఆయుధాలు, సామూహిక నిఘా, గూఢచర్యం, సైబర్ దాడులు, తప్పుడు ప్రచార కార్యక్రమాలు, డేటా చోరీలు వంటి కార్యకలాపాలకు వినియోగించేందుకు ప్రయత్నాలు జరిగినట్టు వెల్లడించింది. క్లాడ్ హైకూ, సోనెట్, ఓపస్ మోడళ్లను ఈ ఘటనల్లో ఉపయోగించేందుకు ప్రయత్నాలు జరిగినట్టు సంస్థ పేర్కొంది. ఇవి సాధారణంగా జరిగే దుర్వినియోగ ఘటనలు కావనీ, ఇప్పటివరకు తాము గుర్తించిన అత్యంత ముఖ్యమైన, కొత్త తరహా ముప్పులలో కొన్ని అని స్పష్టం చేసింది.

బయోవెపన్స్ కోసం క్లాడ్?
అత్యంత సున్నితమైన ఘటనలు జీవశాస్త్ర పరిశోధనలకు సంబంధించినవని ఆంత్రోపిక్ పేర్కొంది. కొందరు శాస్త్రవేత్తలు, ప్రభుత్వ మద్దతు ఉండవచ్చని అనుమానిస్తున్న వినియోగదారులు క్లాడ్ సహాయాన్ని కోరినట్టు వివరించింది. అయితే వారి పరిశోధన నిజంగా శాస్త్రీయ ప్రయోజనాల కోసమా లేక హానికర ఉద్దేశాలతోనా అన్నది ప్రతిసారీ నిర్ధారించడం సాధ్యం కాలేదని పేర్కొంది. చట్టబద్ధమైన జీవశాస్త్ర పరిశోధన, ప్రమాదకరమైన వైరస్‌లు, ఇతర జీవ ఆయుధాల తయారీకి ఉపయోగపడే పరిశోధన మధ్య కొన్నిసార్లు స్పష్టమైన తేడా ఉండదని సంస్థ వివరించింది.
ఆంత్రోపిక్ ఐదు జీవశాస్త్ర దుర్వినియోగ కేసులను గుర్తించింది. వాటిలో ఒకటి ఈ ఏడాది మేలో వెలుగుచూసింది. ఒక శాస్త్రవేత్త చికున్‌గున్యా వైరస్‌పై గెయిన్-ఆఫ్-ఫంక్షన్ పరిశోధన కోసం గ్రాంట్ దరఖాస్తును రూపొందించడంలో సహాయం కోరాడు.

ఈ పరిశోధనలో వైరస్‌లో మార్పులు చేసి, అది మరింత హానికరంగా మారేలా పరిశీలించాలనే ఉద్దేశం ఉన్నట్టు సంస్థ గుర్తించింది. మరో ఘటనలో.. ఒక రీసెల్లర్ వ్యవస్థ ద్వారా ఆర్థోపాక్స్ వైరస్‌కు సంబంధించిన రోగనిరోధక వ్యవస్థను తప్పించుకునే పరిశోధనకు గ్రాంట్ దరఖాస్తును ఒక వినియోగదారు ఓపస్ 5 సహాయంతో గంటలోపే పూర్తి చేసినట్టు వెల్లడించింది. ఆర్థోపాక్స్ వైరస్ కుటుంబంలో మానవులకు తీవ్రమైన వ్యాధులను కలిగించే వైరస్‌లు ఉన్నాయి. వీటిలో మశూచి వైరస్ కూడా ఉంది. మరో కేసులో పక్షిజ్వర వైరస్‌ను క్షీరదాలకు అనుగుణంగా మార్చే ప్రయోగాలను అనేక వారాల పాటు ప్రణాళిక చేస్తున్న పరిశోధకుడిని ఆంత్రోపిక్ గుర్తించింది. అయితే ఈ పరిశోధనల వెనుక హానికర ఉద్దేశం ఉందని తాము కచ్చితంగా చెప్పడం లేదని కూడా స్పష్టం చేసింది.

ఏఐతో ఆయుధాల అభివృద్ధి ప్రయత్నాలు
బయో వెపన్స్‌కే కాకుండా సాధారణ ఆయుధాలకు సంబంధించిన సాఫ్ట్‌వేర్ అభివృద్ధికి కూడా క్లాడ్‌ను ఉపయోగించేందుకు ప్రయత్నాలు జరిగినట్టు ఆంత్రోపిక్ వివరించింది. తుపాకులు, క్షిపణులు, సాయుధ డ్రోన్లు, బాంబులకు సంబంధించిన సాఫ్ట్‌వేర్ అభివృద్ధి ప్రయత్నాలను గుర్తించినట్టు పేర్కొంది. యెమెన్‌కు సంబంధించిన ఒక ఘటనలో కొందరు వ్యక్తులు హ్యూమన్ గైడెన్స్, నావిగేషన్, కంట్రోల్ ఇంజినీర్ల స్థానంలో క్లాడ్ కోడ్‌ను ఉపయోగించేందుకు ప్రయత్నించినట్టు వివరించింది. గైడెడ్ రాకెట్, 2,000 కిలోమీటర్లకు మించి ప్రయాణించగల బహుళ దశల బాలిస్టిక్ క్షిపణి, హైపర్‌సోనిక్ గ్లైడ్ వాహనం వంటి ఆయుధ వ్యవస్థల సాఫ్ట్‌వేర్ అభివృద్ధిపై వారు పనిచేసినట్టు పేర్కొంది. ఈ బృందం గైడెడ్ రాకెట్‌ను పరీక్షించినట్టు, అయితే ఆ ఫీల్డ్ టెస్ట్ విఫలమైనట్టు కనిపిస్తోందని ఆంత్రోపిక్ వెల్లడించింది.

పలు దేశాల్లో నిఘా ప్రయత్నాలు
ఏఐని ఆయుధాల తయారీకి మాత్రమే కాకుండా పలు దేశాల్లో భారీ స్థాయి నిఘా కార్యకలాపాలకు కూడా వినియోగించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆంత్రోపిక్ హెచ్చరించింది. ఇటువంటి సామూహిక నిఘాకు సంబంధించిన తొమ్మిది ఘటనలను గుర్తించినట్టు వెల్లడించింది. సిరియా సైన్యంతో సంబంధాలున్న జర్నలిస్టులను గుర్తించడం, వారి వివరాలను సేకరించడం, ప్రొఫైలింగ్ చేయడం, వారిని నియమించుకునే ప్రయత్నాల కోసం క్లాడ్‌ను ఉపయోగించినట్టు పేర్కొంది.

తప్పుడు ప్రచారానికి ‘క్లాడ్‌’
ఏఐని తప్పుడు సమాచారం, రాజకీయ ప్రచార కార్యక్రమాలకు కూడా వినియోగించేందుకు ప్రయత్నాలు జరిగినట్టు ఆంత్రోపిక్ తెలిపింది. కొన్ని వర్గాలు ప్రచార కార్యక్రమాల ప్రణాళిక కోసం మాత్రమే కాకుండా తప్పుడు, తప్పుదోవ పట్టించే కంటెంట్‌ను తయారు చేయడానికి కూడా క్లాడ్‌ను ఉపయోగించినట్టు పేర్కొంది. పలు దేశాల్లో ఇటువంటి ప్రయత్నాలను అడ్డుకున్నట్టు వెల్లడించింది.

డేటా చోరీలు.. నకిలీ డేటింగ్ యాప్‌లు
ఆర్థిక ప్రయోజనాల కోసం పనిచేసే నేరగాళ్లు కూడా క్లాడ్‌ను దుర్వినియోగం చేసినట్టు ఆంత్రోపిక్ వెల్లడించింది. షైనీహంటర్స్ అనుబంధ వర్గాలతో సంబంధమున్న ఒక ఘటనలో ఆపరేటర్లు 18 లక్షల ఆండ్రాయిడ్ అప్లికేషన్ ప్యాకేజీలను డౌన్‌లోడ్ చేసి, వాటిలో హార్డ్‌కోడ్ చేసిన రహస్య సమాచారాన్ని గుర్తించేందుకు స్కాన్ చేసినట్టు వివరించింది. ఈ సమాచారాన్ని టెలిగ్రామ్ ఆధారిత కార్డింగ్ కార్యకలాపాలకు వినియోగించినట్టు పేర్కొంది. సంబంధిత డేటా ఉల్లంఘనల్లో ఒక టెక్నాలజీ సేవల సంస్థ నుంచి ఒక టెరాబైట్‌కు పైగా చోరీ చేసిన డేటా, కోట్లాది మంది విమాన ప్రయాణికుల రికార్డులు, సాఫ్ట్‌వేర్ సరఫరా వ్యవస్థపై జరిగిన ఉల్లంఘనలు కూడా ఉన్నట్టు వివరించింది. ఇక ఏఐ ఆధారిత డేటింగ్ యాప్‌లను కూడా గుర్తించినట్టు పేర్కొంది.

ముప్పు పెరుగుతుందని హెచ్చరిక
తాము గుర్తించిన మొత్తం ఏడు విభాగాల్లో సంబంధిత ఖాతాలను తొలగించడంతో పాటు భద్రతా వ్యవస్థలను మరింత బలోపేతం చేసినట్టు ఆంత్రోపిక్ వివరించింది. తాము ఈ నివేదికను విడుదల చేయడం వెనుక ఉద్దేశం ఇతర ఏఐ వేదికలు కూడా ఇలాంటి ముప్పులను గుర్తించేందుకు, దుర్వినియోగ పద్ధతులను అర్థం చేసుకునేందుకు, సమష్టిగా భద్రతా వ్యవస్థలను మెరుగుపరచేందుకు సహకరించడమేనని సదరు సంస్థ పేర్కొంది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -