వీడిన ఆర్మీ ఆయుధాల చోరీ మిస్టరీ
ఆయుధాలను స్వాధీనం చేసుకుని
దర్యాప్తు చేస్తున్నాం : వివరాలు వెల్లడించిన
డీజీపీ సీవీ ఆనంద్
నవతెలంగాణ- ప్రత్యేక ప్రతినిధి
దేశంలోనే సంచలనం రేపిన మద్రాస్ ఆర్మీ రెజిమెంట్ లోని ఆయుధాగారం నుంచి భారీ ఎత్తున ఆయుధాల చోరీ మిస్టరీని రాష్ట్ర పోలీసులు ఛేదించారు. చోరీకి పాల్పడ్డ ఆర్మీ రిటైర్డ్ హవల్దార్‌ను అరెస్ట్ చేయడంతో పాటు చోరీ అయిన ఆయుధాలను స్వాధీన పర్చుకున్నారు. రాష్ట్ర డీజీపీ సీవీ ఆనంద్ శుక్రవారం హైదరాబాద్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వివరాలు వెల్లడించారు. ‘బొల్లారంలోని మద్రాస్ రెజిమెంట్‌లో హవల్దారుగా పనిచేసిన ఉప్పుతోళ్ళ మల్లేష్ ఈ ఏడాది జూన్ నెలలో రిటైర్డ్ అయ్యారు. ప్రవర్తన సరిగా లేకపోవడంతో పాటు అనారోగ్య కారణాల వల్ల ఉన్నతాధికారులు ఆయనను ఉద్యోగం నుంచి తొలగించారు. మద్రాస్ రెజిమెంట్ ఆయుధాగారాల నుంచి 7 పిస్టళ్లు , 4 ఏకే 47, ఇన్సాస్, మందుగుండు సామాగ్రీ చోరీ జరిగిందని ఆగస్టు 30న ఆర్మీ అధికారులు ఫిర్యాదు చేయడంతో కేసును నమోదు చేసుకొని దర్యాప్తును ప్రారంభించాం. సమస్య తీవ్రత దృష్ట్యా రాష్ట్ర పోలీసులతో పాటు ఆర్మీ ఇంటెలిజెన్స్ అధికారులు, ఎన్ఐఏ అధికారులు రంగంలోకి దిగి దర్యాప్తును ప్రారంభించారు. రాష్ర్ట పోలీసు దర్యాప్తు బృందాలు బొల్లారంలోని ఘటనా స్థలాన్ని సందర్శించి అన్ని కోణాల్లో విచారణ ప్రారంభించాయి.
ఆయుధాగార ఇన్‌చార్జీలు వినోద్ నాయర్, మధు నాయర్లతో పాటు సెక్యూరిటీ గాడ్స్, ఆ ప్రాంత పర్యవేక్షక ఆర్మీ అధికారులను ప్రశ్నించారు. ఆ సమయంలోనే వచ్చిన సమాచారం మేరకు జూన్ లో రిటైర్డ్ అయిన హవల్దార్ మల్లేష్ కదలికలపై దృష్టి సారించాం. మా దగ్గర ఉన్న ఆధారాలతో నిందితుడి కదలికల గురించి ప్రశ్నించాం. వాస్తవాలు చెప్పకుండా అతడు దాచిపెట్టాడు. తొలుత విచారణ కోసం మేం పిలిస్తే రాలేదు. ఫోన్ కాల్ లిస్ట్, వాట్సప్ చాటింగ్‌లు డిలీట్ అయ్యాయి. ఆ తర్వాత మల్లేశ్‌ను ప్రశ్నిస్తున్నప్పుడు ఆయన ముఖంలో చెమటలు పట్టి భయం కనిపించింది. కేసు తీవ్రతను ఆయన భార్యకు వివరించాం. ఆమె గట్టిగా ప్రశ్నించడంతో నిందితుడు నిజం అంగీకరించాడు. చోరీ చేసిన ఆయుధాలను నాగర్ కర్నూల్ జిల్లా అమ్రాబాద్ మండలంలోని స్వగ్రామానికి తీసుకెళ్లి గుంతతీసి పాతిపెట్టాడు. నిందితుడు ఇచ్చిన సమాచారం మేరకు వాటిని స్వాధీనం చేసుకున్నాం’’ అని డీజీపీ వివరించారు.
చోరీ చేసిందిలా…
‘ఆగస్టు 30 న రాత్రి 11 గంటల ప్రాంతంలో మల్లేష్ మద్రాస్ రెజిమెంట్ లోని ఆయుధాగారం ఉన్న ప్రాంతానికి కొద్ది దూరంలో తన స్కూటీని నిలిపి ఆయుధ గారం వద్దకు వచ్చాడు. చీకటి ప్రాంతంలో ఒక మూలాన ఉన్న గది తాళాలను పగలగొట్టి అందులో నుంచి ఆయుధాలను తీసుకున్నాడు. తర్వాత పక్కనే ఉన్న మరో గది తాళం పగలగొట్టి అందులో నుంచి వివిధ ఆయుధాలకు చెందిన బుల్లెట్ బాక్సులను తీసుకున్నాడు. వాటన్నింటిని తీసుకుని సమీపంలోని మందిరం వద్దకు ఉదయం నాలుగు గంటల ప్రాంతంలో చేరుకున్నాడు. అక్కడ ఆయుధాలను ఉంచి కంటోన్మెంట్ ఏరియాలోని బాలాజీ నగర్ లోగల తన ఇంటికి చేరుకున్నాడు. తర్వాత తన బ్రీజా కారును తీసుకొని మందిరం వద్దకు చేరుకుని ఆయుధాలను కారులో వేసుకొని అచ్చంపేటకు బయలుదేరాడు. మరుసటి రోజు ఉదయం ఒంటిగంట ప్రాంతంలో అచ్చంపేట సమీపంలోని కౌకూరుకు చేరుకొని శివారు ప్రాంతంలో గుంత తవ్వి ఆయుధాలను పాతిపెట్టి దానిపై చెత్తను పోసి ఇంటికి చేరుకున్నాడు. మరుసటి రోజు అనుమానంతో పాతి పెట్టిన ఆయుధాలను తీసుకొని తన పాత ఇంటికి వచ్చాడు’ అని డీజీపీ వివరించారు.
ఆయుధాలను చోరీ చేయడం వెనుక గల కారణాలను ఇంకా వెల్లడించాల్సి ఉందనీ, మరింత లోతుగా దర్యాప్తు చేస్తున్నామని డీజీపీ తెలిపారు. సోషల్ మీడియాలో కొందరు సంఘ విద్రోహ శక్తులతో మాట్లాడాడనే అనుమానం పైనా ఆరా తీస్తున్నామని తెలిపారు. తనను ఆర్మీ నుంచి తొలగించారని కోపంతోనే నిందితుడు ఈ చోరీకి పాల్పడి ఉంటాడని ప్రాథమికంగా అనుమానిస్తున్నామని డీజీపీ తెలిపారు. దేశంలోనే సంచలనం రేపిన ఈ ఆయుధాల చోరీ వ్యవహారాన్ని తమ అధికారులు అతి తక్కువ సమయంలో ఛేదించారని దర్యాప్తు అధికారులను అభినందించారు. ఈ సందర్భంగా స్వాధీనం చేసుకున్న ఆయుధాలను మీడియాకు ప్రదర్శించారు. ఈ సమావేశంలో శాంతి భద్రతల విభాగం డీజీపీ మహేష్ భగవత్, రాష్ట్ర ఇంటలిజెన్స్ అదనపు డీజీ విజయ్ కుమార్, నగర పోలీస్ కమిషనర్ వీసీ. సజ్జనార్ మల్కాజ్‌గిరి సీపీ సుమతి తదితరులు పాల్గొన్నారు.



