ప్రయివేటీకరణ దిశగా విద్యుత్ సంస్థలు
అదానీ,అంబానీల గుప్పెట్లో
మోడీ సర్కార్
డిసెంబర్ 1న చలో ఢిల్లీ
అక్టోబర్‌లో హైదరాబాద్‌లో ఎస్పీడీసీఎల్ ఎదుట భారీ ధర్నా : తెలంగాణ స్టేట్ యునైటెడ్ ఎలక్ర్టిసిటీ ఎంప్లాయీస్ యూనియన్ (సీఐటీయూ) రాష్ట్ర అధ్యక్షులు కె.ఈశ్వర్‌రావు
ఇందిరాపార్కు వద్ద
కార్మికుల ధర్నా
నవతెలంగాణ-సిటీబ్యూరో
కేంద్రంలోని మోడీ సర్కార్ దేశంలోని విద్యుత్ సంస్థలను ప్రయివేటీకరణలో భాగంగా అదానీ, అంబానీలకు కట్టబెట్టేందుకు కుట్ర చేస్తోందని తెలంగాణ స్టేట్ యునైటెడ్ ఎలక్ర్టిసిటీ ఎంప్లాయీస్ యూనియన్ (సీఐటీయూ) రాష్ట్ర అధ్యక్షులు కె.ఈశ్వర్‌రావు అన్నారు. దీన్ని వ్యతిరేకిస్తూ డిసెంబర్ 1న చలో ఢిల్లీ కార్యక్రమానికి తెలంగాణ నుంచి భారీగా తరలివెళ్లనున్నట్టు చెప్పారు. విద్యుత్ బిల్ కలెక్టర్లు, స్పాట్ బిల్లర్లు, ల్యాండ్ లూజర్లు, నాన్ ఆర్టిజన్ కార్మికులు తమ సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ యూనియన్ ఆధ్వర్యంలో శుక్రవారం హైదరాబాద్ ఇంది రాపార్కు ధర్నా చౌక్‌లో ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సమస్యల పరిష్కారం కోసం విద్యుత్ సంస్థల కార్మికులు సంఘటితంగా పోరాడాలని సూచించారు. పీస్ రేట్ విధానాన్ని రద్దు చేయాలని, విద్యా అర్హతలను బట్టి ఖాళీలను భర్తీ చేయాలని కోరారు. జీవో నెం.6 ప్రకారం కనీస వేతనాలు ఇవ్వాలని, మిగిలిపోయిన కార్మికులను ఆర్టిజన్లుగా గుర్తించాలని డిమాండ్ చేశారు. మీటర్ రీడింగ్, బిల్లు కలెక్టర్ల సమస్యల పట్ల ప్రభుత్వం, యాజమాన్యం మొండి వైఖరి నశించాలన్నారు. విద్యుత్ సంస్థల ప్రయివేటీకరణ జరిగితే స్పాట్ బిల్లర్స్‌కు స్పాట్ పెట్టినట్టే అవుతుందని తెలిపారు. సబ్ స్టేషన్స్ కు భూమి ఇచ్చిన వారికి వెంటనే ఉద్యోగాలివ్వాలని డిమాండ్ చేశారు.
సమస్యల పరిష్కారం కోసం ఈ నెల 16న వరంగల్‌లోని పబ్లిక్ గార్డెన్ నుంచి ఎన్పీడీసీఎల్ కార్యాలయం వరకు ర్యాలీగా వెళ్లి సీఎండీకి మెమోరాండం అందజేయనున్నట్టు తెలిపారు. అక్టోబర్‌లో హైదరాబాద్ మింట్ కాంపౌండ్‌లోని ఎస్పీడీసీఎల్ ఎదుట భారీ ధర్నా నిర్వహించనున్నట్టు చెప్పారు. అనంతరం మరో భారీ నిరసన కార్యక్రమం చేపడతామని స్పష్టం చేశారు. యూనియన్ ప్రధాన కార్యదర్శి నలువాల స్వామి మాట్లాడుతూ.. ప్రజా ప్రభుత్వంలో జీవో నెం.6 ప్రకారం బిల్ కలెక్టర్లు, స్పాట్ బిల్లర్లకు కనీస వేతనం రూ.18,500 అమలు చేయాలని డిమాండ్ చేశారు. స్మార్ట్ మీటర్లు పెడితే స్పాట్ బిల్లర్లకు ఇబ్బందులు ఏర్పడుతాయన్నారు. సబ్ స్టేషన్ల నిర్మాణాలకు భూములిచ్చిన కుటుంబంలో ఒకరికి శాశ్వత ఉద్యోగం ఇస్తామని చెప్పి ఔట్ సోర్సింగ్ ఉద్యోగాలివ్వడం సరికాదన్నారు. వెంటనే పర్మినెంట్ ఉద్యోగాలు కల్పించేలా ఈ అసెంబ్లీ సమావేశాల్లోనే తీర్మానం చేయాలని డిమాండ్ చేశారు. యూనియన్ రాష్ట్ర డిప్యూటీ జనరల్ సెక్రెటరీ చంద్రారెడ్డి మాట్లాడుతూ.. విద్యుత్ సంస్థల్లో పనిచేసే కార్మికుల శ్రమను దోచుకునేలా ప్రభుత్వాలు వ్యవహరిస్తున్నాయని చెప్పారు.



