మనది పేగు బంధం.. వారిది ఓటు బంధం

 – ప్రతిపక్షాలవి కుప్పిగంతులు
–  సీనియారిటీకి- సిన్సియారిటీకి మధ్య ఎన్నికలు : ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత
నవతెలంగాణ-బోధన్‌
”ఎన్నికల ముందు ప్రతిపక్షాలు కుప్పిగంతులు వేస్తున్నాయి.. లేనిపోని హామీలు గుప్పించి ప్రజలను ఆగం చేస్తున్నాయి.. వారి మాటలు నమ్మి మోసపోవద్దు.. మనది (బీఆర్‌ఎస్‌) తెలంగాణ పేగు బంధం అయితే.. ప్రతిపక్షాలది ఓటు బంధం” అని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అన్నారు. నిజామాబాద్‌ జిల్లా బోధన్‌ పట్టణంలోని ఎన్‌ఎస్‌ఎఫ్‌ గ్రౌండ్లో బూత్‌ కమిటీలు, కార్యకర్తల సమావేశంలో ఆమె మాట్లాడారు. తెలంగాణ ప్రభుత్వం ప్రతి ఇంటికీ సంక్షేమ పథకాలను అందించిందన్నారు, బీజేపీ, కాంగ్రెస్‌ పార్టీలు తెలంగాణ ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధిని సహించడం లేదని, అందుకే కుల మతాల పేరుతో ప్రజలను విడగొడుతున్నాయని అన్నారు. తెలంగాణ ప్రాంతంలో జీవించడానికి ఏ ప్రాంతం నుంచి వచ్చినా ఆదరిస్తున్నామని చెప్పారు. బోధన్‌ నుంచి పనిచేసిన మాజీ మంత్రి సుందర్శన్‌రెడ్డి నియోజకవర్గానికి ఏమీ చేయలేదని విమర్శించారు. తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత 150 చెరువులను బాగు చేశామన్నారు. అందువల్ల ఈ ఎన్నికలు సీనియార్టీకి, సిన్సియారిటీకి మధ్య జరుగుతున్న ఎన్నికలని చెప్పారు. ఎమ్మెల్యే షకిల్‌ ఆమీర్‌ను భారీ మెజారిటీతో గెలిపించాలని కోరారు. ప్రతిపక్ష పార్టీలకు ఓటుతోనే బుద్ధి చెప్పాలన్నారు. బూత్‌ కమిటీ కార్యకర్తలు ఇంటింటికీ వెళ్లి ప్రభుత్వ పథకాలను వివరించాలని సూచించారు. రాష్ట్రంలో లక్ష 30 వేల మందికి ఉద్యోగాలు ఇచ్చామన్నారు. ప్రయివేట్‌ సంస్థల్లో 30 లక్షలకుపైగా ఉద్యోగ అవకాశాలు కల్పించామని, బోధన్‌లో నిర్వహించిన ఉద్యోగమేళాలో ఎమ్మెల్యే షకీల్‌ 500 మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించారని గుర్తు చేశారు. ప్రతిపక్షాలు నోరు జాగ్రత్తగా పెట్టుకోవాలని గులాబీ దండు తిరగబడితే తట్టుకోలేరని హెచ్చరించారు. రాహుల్‌ గాంధీ భారత్‌ జోడో యాత్ర అంటూ పనికిరాని యాత్ర చేశారని విమర్శించారు. కాంగ్రెస్‌ ప్రభుత్వం గరీబోళ్లని మోసం చేస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే షకీల్‌, జడ్పీ వైస్‌ చైర్‌పర్సన్‌ రజిత యాదవ్‌, ఎంపీపీలు బుద్దె సావిత్రి, కొండెంగల శ్రీనివాస్‌, ఏఎంసీ చైర్మెన్‌ విఆర్‌ దేశారు, జెడ్పీటీసీ లక్ష్మి, బీఆర్‌ఎస్‌ నాయకులు బుద్దే రాజేశ్వర్‌ పాల్గొన్నారు.

Spread the love