పచ్చడి మెతుకులూ.. పిరమాయే !

Pachdi metukulu.. Piramaye!– పెరిగిన మామిడికాయల ధరలు
– ఈదురు గాలులు, అకాల వర్షాలతో తగ్గిన దిగుబడి
– వేరుశనగ నూనె, కారం ధరలు అందనంత ఎత్తులో..
నవతెలంగాణ-మల్హర్‌రావు
ఊరగాయ పచ్చళ్లలో మామిడికి ఒక ప్రత్యేకత ఉంటుంది. ఆ పచ్చడికి ఉండే రుచి మరోదానికి ఉండదు. అందుకే అత్యధికులు మామిడి పచ్చడిని ఆస్వాదిస్తుంటారు. వేసవిలో పెట్టే పచ్చళ్లలో అత్యధికం మామిడి పచ్చడినే. దీనికి మరోపేరు ఊరగాయ, ఆవకాయ. ఈ సమయంలో గ్రామాల్లో ప్రతి ఇంట్లో ఊరగాయ తయారు చేసుకొని నిల్వ ఉంచుకునే సంప్రదాయం కొనసాగుతోంది. గుడిసెలో ఉండే పేదోడి నుంచి మేడలో ఉండే ధనికుడి వరకు అందరూ ఇష్టంగా తినేది ఆవకాయ పచ్చడి. పేదలు ఎక్కువగా కడుపు నింపుకునేది ఈ పచ్చడి మెతుకులతోనే. ఇప్పుడు మామిడి, అందులోకి ఉపయోగించే ఇతర వస్తువుల ధరలు పెరగడంతో పేద, మధ్యతరగతి ప్రజలకు పచ్చడి పెట్టుకోవడం కూడా భారంగా మారింది. మామిడికాయల దిగుబడి గణనీయంగా తగ్గడంతోపాటు నూనె, కారం ధరలు కూడా ఆకాశాన్ని అంటుతున్నాయి. ఈ సారి మామిడి కాయడమే తక్కువగా ఉంటే.. అవి కూడా అకాల వర్షాలకు రాలిపోయాయి.
మామిడి కాయల ఉత్పత్తిలో తెలంగాణ రాష్ట్రం కీలక పాత్ర పోషిస్తోంది. మామిడి తోటల సాగు విస్తీర్ణంలో దేశంలోనే తొమ్మిదో స్థానంలో తెలంగాణ ఉంది. 2021-22 సంవత్సరానికి తెలంగాణలో 3.21లక్షల ఎకరాల్లో మామిడి తోటలు సాగయ్యాయి. 11.65 లక్షల టన్నుల మామిడి ఉత్పత్తి అయింది. ఈసారి చాలా ప్రాంతాల్లో మామిడి తోటలున్నా దిగుబడి లేదు. ఉదాహరణకు.. జయశంకర్‌-భూపాలపల్లి జిల్లా మల్హర్‌రావు పరిధిలో తాడిచెర్ల, రుద్రారం, కొండంపేట, మల్లారం, ఆన్‌సాన్‌పల్లి గ్రామాల్లో దాదాపుగా 400 ఎకరాల మామిడి తోటలున్నాయి. ఎకరానికి నాలుగు టన్నుల చొప్పున లెక్కిస్తే 1600 టన్నుల దిగుబడి రావాల్సి ఉంది. కానీ, 800 టన్నులు మాత్రమే దిగుబడి వచ్చింది. రాష్ట్రమంతటా ఇదే పరిస్థితి. దీంతో ఈ సంవత్సరం ప్రారంభంలో చీడపీడలు, పూత, కాత దశలో వైరస్‌, కాయలు కోతకొచ్చే సమయంలో గాలివాన బీభత్సంతో చెట్లకు కాయ నిల్వలేదు. దీంతో దిగుమతి గణనీయంగా తగ్గింది. ప్రస్తుతం మార్కెట్లో పచ్చడి మామిడి కాయల ధర అందనంత దూరంలో ఉంది. గతంలో కంటే ఈ ఏడాది మామిడికాయల ధరలు మూడింతలు పెరిగినట్టు వ్యాపారులు చెబుతున్నారు. ఏటా వేసవిలో పచ్చడి మామిడి కాయలు కిలో రూ.30 నుంచి రూ.40 వరకు పలికేవి. అయితే ఈ ఏడాది కిలో రూ.80 నుంచి రూ.100 వరకు ధర పలుకుతున్నాయి. దీనికి తోడు పచ్చడి తయారీకి అవసరమయ్యే వేరుశనగ నూనె, ఎండుమిర్చి కారం, మసాలా దినుసులు, వెల్లుల్లి ధరలు కూడా పెరిగాయి.
సర్వ సాధారణంగా ప్రతి వేసవి ఏప్రిల్‌, మే నెలల్లో మామిడి కాయలతో నిలువ పచ్చళ్ళు తయారు చేసుకుంటారు. ఈ తంతు ప్రతి ఇంట్లో కొనసాగుతుంది. పచ్చళ్ళ తయారీకి ప్రధానంగా చిన్నరసం, నాటు రసం, తెల్ల గులాబీ వంటి మామిడి కాయలను వినియోగిస్తారు. ప్రస్తుతం మార్కెట్‌లో తెల్లగులాబీ, నాటు రసం, చిన్న మల్లిక వంటి రకాలు అందుబాటులో ఉన్నాయి. మామిడి కాయల ఉత్పత్తి మధ్యస్థంగా ఉన్నప్పటికీ ఈ ఏడూ వాతావరణ పరిస్థితులు కూడా అనుకూలించకపోవడంతో దిగుబడి తక్కువగా ఉంది. దీనికి తోడుగా ఇటీవల అకాల వర్షాలు, ఈదురు గాలులతో కాయలన్నీ రాలిపోవడంతో నష్టం వాటిల్లింది.
ధరలు బాగా పెరిగాయి : సమ్మక్క గృహిణి
ఈ ఏడాది పచ్చడి మామిడికాయల ధరలు మూడింతలు పెరిగాయి. వీటికి తోడుగా నూనె, కారం, వెల్లుల్లి ధరలు కూడా ఎక్కువగానే ఉన్నాయి. మాలాంటి సామాన్యులకు పచ్చడి తయారీ భారంగా మారింది.
పండ్లు తినలేం.. పచ్చడి పెట్టలేం.. : ఓదెలు, మామిడి రైతు
ఈ ఏడాది మామిడి తోటలకు ప్రారంభంలో చీడపీడలు ఆశించి, పూత కాత దశలో వైరస్‌ సోకింది. కోత దశలో అకాల వర్షాలు, ఈదురు గాలులతో ఉన్న కాయలు నేలరాలాయి. మామిడి పండ్లకు, పచ్చడి కాయలకు డిమాండ్‌ పెరిగింది. పండ్లు తినే పరిస్థితి, పచ్చడి పెట్టే పరిస్థితి లేదు.

Spread the love