పడావేనా..!

Do you want to drop..!నిర్మాణం పూర్తైనా ఇచ్చుదెప్పుడో..
– డబుల్‌ ఇండ్ల కోసం లబ్దిదారుల ఎదురుచూపులు
– చాలా చోట్ల అసంపూర్తిగా ఇండ్లు…

– అలాట్‌మెంట్‌ చేసినచోటా పట్టాలివ్వలే…పొసెషన్‌ చూపలే
– పూర్తయిన వాటిని పేదలకు పంపిణీ చేయాలి : సీపీఐ(ఎం)
డబుల్‌ ఇండ్ల నిర్మాణంలో గత ప్రభుత్వం ఊరించి ఊరించి చివరికి చేతులెత్తేసింది. లక్షలాది మంది నిరుపేదల ఆశలను వమ్ముచేసింది. కొంతమందికే ఇచ్చి చేతులు దులుపేసుకుంది. సకాలంలో ఇండ్ల నిర్మాణం పూర్తి చేయకుండా, పూర్తైన ఇండ్లను అర్హులైన పేదలకు కేటాయించకుండా, కేటాయించిన ఇండ్లకు పొసెషన్‌ చూపకుండా గందరగోళం సృష్టించింది. ఎన్నికల వేళ కొన్నిచోట్ల హడావుడి చేసి అలాట్‌మెంట్‌ చేసినా పట్టాలిచ్చి ఇండ్లు అప్పగించని పరిస్థితి. ప్రస్తుతం రాష్ట్రంలో కాంగ్రెస్‌ ప్రభుత్వం వచ్చాక ఇందిరమ్మ ఇండ్లు కట్టిస్తామని ప్రకటించింది. అయితే వివిధ దశల్లో నిర్మాణంలో ఉన్న వేలాది డబుల్‌ బెడ్‌రూం ఇండ్లను పూర్తి చేసి అర్హులైన లబ్దిదారులకు కేటాయించాలని పేదలు కాంగ్రెస్‌ ప్రభుత్వాన్ని కోరుతున్నారు.
నవతెలంగాణ-మెదక్‌ ప్రాంతీయ ప్రతినిధి
గత ప్రభుత్వం ఇండ్లులేని పేదల కోసం డబుల్‌ బెడ్‌ రూం ఇండ్ల పథకాన్ని చేపట్టింది. అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా వీటిని కేటాయించి నిర్మాణం చేపట్టింది. రాష్ట్ర వ్యాప్తంగా 292938 ఇండ్లను నిర్మించాలని మంజూరు చేసింది. ఇందుకోసం రూ.12560 కోట్లను ఖర్చు చేసింది. మంజూరైన ఇండ్లల్లో 154389 ఇండ్ల నిర్మాణం పూర్తయ్యింది. వీటిలో కొన్నింటిని పేదలకు అలాట్‌ చేసి అప్పజెప్పారు. మరో 41925 ఇండ్లు నిర్మాణం చివరి దశలో ఉన్నాయి. ఇంకో 34022 ఇండ్లు మాత్రం వివిధ దశల్లో నిర్మాణం ఆగిపోయి ఉన్నాయి. సంగారెడ్డి జిల్లాలో 3506 డబుల్‌ ఇండ్ల కోసం మంజూరయ్యాయి. అయితే 4198 ఇండ్ల నిర్మాణం పూర్తయ్యింది. సిద్దిపేట జిల్లా కేసీఆర్‌, హరీశ్‌రావు ఇలాకా కావడంతో ఏకంగా 15860 డబుల్‌ బెడ్‌రూం ఇండ్ల మంజూరు చేశారు. వీటిల్లో 11803 ఇండ్ల నిర్మాణం పూర్తవ్వగా మరో 4 వేల ఇండ్ల నిర్మాణ పనులు స్థల వివాదాల వల్ల ప్రారంభం కాలేదు. మెదక్‌ జిల్లాలోనూ 1500 ఇండ్లు మంజూరవ్వగా 1250 ఇండ్ల నిర్మాణం పూర్తయ్యింది. గ్రేటర్‌ హైదరాబాద్‌లో డబుల్‌ ఇండ్ల కోసం దరఖాస్తు చేసుకున్న ఎంతోమంది ఎదురుచూస్తున్నారు.
పడావుపడుతున్న డబుల్‌ ఇండ్లు
కోట్ల రూపాయలు ఖర్చు చేసి నిర్మించిన డబుల్‌ బెడ్‌రూం ఇండ్లు పడావు పడ్డాయి. వంద శాతం నిర్మాణం పూర్తయిన ఇండ్లను కూడా పేదలకు అలాట్‌ చేసి పంపిణీ చేయక పోవడంతో అవన్నీ వృథాగా పడి ఉన్నాయి. సంగారెడ్డి జిల్లాలోని నారాయణఖేడ్‌ పట్టణంలో 785 డబుల్‌ బెడ్‌రూం ఇండ్లను నిర్మించారు. వంద శాతం నిర్మాణం పూర్తయ్యింది. లబ్దిదారుల జాబితా సిద్ధం చేసి అలాట్‌మెంట్‌ చేశారు. అయితే లబ్దిదారులకు పట్టా ఇవ్వలేదు. ఎంపికైన పేదలకు ఇండ్లను కూడా అప్పజెప్పలేదు.
దీంతో 785 పూర్తయిన ఇండ్లు పడావు పడి ఉన్నాయి. జహీరాబాద్‌ నియోజకవర్గంలోనూ 99 శాతం పనులు పూర్తయిన 660 ఇండ్లు పడావుగా ఉన్నాయి. ఇక్కడ కూడా లబ్దిదారులకు అప్పజెప్పలేదు. అందోల్‌ నియోజకవర్గంలోని పుల్కల్‌లో 48 ఇండ్లను నిర్మించి లబ్దిదారులకు కేటాయించి పంపిణీ చేయకుండా వదిలేశారు. సిద్దిపేట జిల్లాలో 15 వేల ఇండ్లు మంజూరవగా ఇందులో 11803 ఇండ్ల నిర్మాణం పూర్తయ్యింది. ఇందులో లబ్ధిదారులకు కేవలం 10 వేల ఇండ్లను మాత్రమే లబ్దిదారులకు కేటాయించి పంపిణీ చేశారు. మరో 4057 ఇండ్ల నిర్మాణం అసంపూర్తిగా ఉండడంతో పేదలు ఎదురు చూస్తున్నారు. గజ్వేల్‌ నియోజకవర్గంలో 4243 ఇండ్లు మంజూరవ్వగా వీటిలో 3408 ఇండ్ల నిర్మాణం పూర్తయ్యింది. వీటిలో 3వేల ఇండ్లను లబ్దిదారులకు కేటాయించి పంపిణీ చేశారు.
మరో వెయ్యి ఇండ్ల నిర్మాణం వివిధ దశల్లో ఆగిపోయింది. మెదక్‌ జిల్లా పెద్దశంకరంపేటలో నిర్మించిన ఇండ్లను కూడా ఇప్పటికీ లబ్దిదారులకు కేటాయించలేదు. రాష్ట్రవ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల్లో ఇదే పరిస్థితి. ఇండ్లు కట్టిస్తామని చెప్పగానే పేదలు తాము నివాసముంటున్న రేకుల షెడ్లను కూలగొట్టి ..వేరేచోట నివాసం ఉంటున్నారు. డబుల్‌ బెడ్‌రూమ్‌ ఇండ్లను పంపిణీ చేయాలని పేదలు ప్రభుత్వాన్ని కోరుతున్నారు. ఆందోళనలు చేపడుతున్నారు.
నిర్మాణం పూర్తయిన ఇండ్లను పేదలకివ్వాలి: సీపీఎం(ఎం)
రాష్ట్రంతో పాటు ఉమ్మడి మెదక్‌ జిల్లా వ్యాప్తంగా నిర్మాణం పూర్తయిన డబుల్‌బెడ్‌ రూం ఇండ్లను అర్హులైన పేదలకు మంజూరు చేసి పంపిణీ చేయాలని సీపీఐ(ఎం) డిమాండ్‌ చేస్తుంది. మెదక్‌ జిల్లాలోని పెద్దశంకరంపేట, రామాయంపేట, సంగారెడ్డి జిల్లాలోని నారాయణఖేడ్‌, జహీరాబాద్‌, ఇస్మాయిల్‌ఖాన్‌పేట, పుల్కల్‌, సిద్దిపేట జిల్లాలోని గజ్వేల్‌ ఇతర ప్రాంతాల్లో ప్రారంభానికి సిద్ధమైన ఇండ్లను వెంటనే ప్రభుత్వం పేదలకు అలాట్‌మెంట్‌ చేసి పొజిషన్‌ చూపాలని కోరుతూ ఇప్పటికే జిల్లా అధికారుల్ని కలిశారు. చాలా చోట్ల నిర్మాణ పనులు వివిధ దశలో ఆగిపోయిన ఇండ్లనిర్మాణాన్ని కూడా పూర్తి చేసేందుకు అవసరమైన నిధుల్ని మంజూరు చేయాలని సీపీఐ(ఎం) సంగారెడ్డి జిల్లా కార్యదర్శి జయరాజ్‌ కోరారు.

Spread the love