రాజకీయాలకు పాండియన్‌ గుడ్‌బై

రాజకీయాలకు పాండియన్‌ గుడ్‌బైభువనేశ్వర్‌: ఒడిశా మాజీ సీఎం నవీన్‌ పట్నాయక్‌ సన్నిహితులు, మాజీ ఐఏఎస్‌ అధికారి వికె పాండియన్‌ రాజకీయాలకు గుబ్‌బై చెప్పారు. ఇటీవల జరిగిన ఒడిశా అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికల్లో బిజూ జనతాదళ్‌ (బీడేడీ) ఓటమి నేపథ్యంలో పాండియన్‌ ఈ నిర్ణయం తీసుకున్నారు. రాజకీయాల నుంచి వైదొలుగుతున్నట్లు ప్రకటించారు. ఆదివారం ఈ మేరకు వీడియో సందేశం విడుదల చేశారు. తాను నవీన్‌ పట్నాయక్‌కు సహాయకారిగా ఉండాలనే ఉద్దేశంతోనే రాజకీయాల్లోకి వచ్చానని, ఇప్పుడు రాజకీయాల నుంచి వైదొలగాలని నిర్ణయించుకున్నట్లు చెప్పారు. తన ప్రయాణంలో ఎవర్నైనా నొప్పించి ఉంటే క్షమించాలని కోరారు. అలాగే, తనపై జరిగిన ప్రచారం వల్ల పార్టీ ఓటమి పాలై ఉంటే అందుకూ క్షమించాలన్నారు. నవీన్‌ మరోసారి విజయం సాధించని పక్షంలో తాను రాజకీయ సన్యాసం స్వీకరిస్తానని గతంలో చెప్పిన పాండియన్‌ అందుకు తగ్గట్టే తన నిర్ణయాన్ని వెలువరించారు. తమిళనాడుకు చెందిన పాండియన్‌ ఒడిశా కేడర్‌ ఐఏఎస్‌ అధికారిగా ఈ రాష్ట్రంలో విధుల్లో చేరారు. ముఖ్యమంత్రి నవీన్‌ పట్నాయక్‌కు సన్నిహితుగా మారారు. ఎన్నికల ముందు ఉద్యోగానికి రాజీనామా చేసి బీడేడీలో చేరారు. నవీన్‌ పట్నాయక్‌ నిర్ణయాలను పాండియన్‌ తీసుకుంటున్నారని ఎన్నికల ప్రచారంలో బీజేపీ విమర్శలు చేసింది.

Spread the love