రూ.1,823 కోట్లు చెల్లించండి

రూ.1,823 కోట్లు చెల్లించండి– కాంగ్రెస్‌కు ఐటీ శాఖ పన్ను నోటీసు
– ఇది ట్యాక్స్‌ టెర్రరిజమేనన్న జైరాం రమేష్‌
– సుప్రీంకోర్టును ఆశ్రయిస్తామన్న మాకెన్‌
న్యూఢిల్లీ : లోక్‌సభ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో ప్రతిపక్ష పార్టీలపై బీజేపీ ప్రభుత్వం దుందుడుకు చర్యలను ముమ్మరం చేసింది. సామ దాన భేద దండోపాయాలతో ప్రతిపక్షాలను తన దారికి తెచ్చుకోవాలని విశ్వ ప్రయత్నం చేస్తోంది. దాడులు, సోదాలు, అరెస్టులతో భీతావహ వాతావరణాన్ని సృష్టిస్తోంది. ఇందుకోసం ఈడీ, సీబీఐ, ఐటీ వంటి కేంద్ర దర్యాప్తు సంస్థలను ప్రయోగిస్తోంది. దారికి వస్తే సరేసరి…లేకుంటే కష్టాలు తప్పవని హెచ్చరికలు జారీ చేస్తోంది. తాజాగా కేంద్ర దర్యాప్తు సంస్థ ఆదాయ పన్ను శాఖ శుక్రవారం ప్రధాన ప్రతిపక్షమైన కాంగ్రెస్‌కు పన్ను నోటీసు పంపింది. జరిమానా, దానిపై రావాల్సిన వడ్డీలతో కలిపి మొత్తం రూ.1,823 కోట్లు చెల్లించాలని తాఖీదు ఇచ్చింది. ఎన్నికల వేళ తనను ఆర్థికంగా దెబ్బ తీయడానికే కేంద్రం ఇలాంటి చర్యలకు పూనుకుంటోందని కాంగ్రెస్‌ మండిపడింది.
2017-18 నుండి 2020-21 మదింపు (అసెస్‌మెంట్‌) సంవత్సరాలకు సంబంధించి జరిమానా, వడ్డీలతో కలిపి మొత్తం రూ.1,823 కోట్లు చెల్లించాలని కాంగ్రెస్‌కు పంపిన నోటీసులో ఆదాయపన్ను శాఖ తెలియజేసింది. 2017-2021 కాలానికి ఆదాయపన్ను శాఖ జరుపుతున్న పున:పరిశీలన ప్రక్రియను నిలిపివేయాలంటూ కాంగ్రెస్‌ దాఖలు చేసిన పిటిషన్‌ను గురువారం ఢిల్లీ హైకోర్టు తోసిపుచ్చింది. ఆ వెంటనే ఆదాయపన్ను శాఖ అధికారులు రంగంలోకి దిగి కాంగ్రెస్‌కు నోటీసులు జారీ చేశారు.
2014-15 నుండి 2016-17 వరకూ ఐటీ శాఖ చేపట్టిన పున:పరిశీలనను సవాలు చేస్తూ గతంలో కాంగ్రెస్‌ దాఖలు చేసిన పిటిషన్‌ను కూడా ఢిల్లీ హైకోర్టు తోసిపుచ్చింది. 2014-15 నుండి 2016-17 వరకూ పున:పరిశీలనకు సంబంధించి రూ.200 కోట్లు చెల్లించాలని తేల్చి చెప్పిన ఐటీ శాఖ, కాంగ్రెస్‌ బ్యాంక్‌ ఖాతాల నుండి రూ.135 కోట్లు రికవరీ చేసింది. ఎన్నికలకు ముందు తాను తీవ్రమైన ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తోందని కాంగ్రెస్‌ పార్టీ హైకోర్టు దృష్టికి తెచ్చింది. అయితే ఈ విషయంలోనూ ఆ పార్టీకి చుక్కెదురైంది.
ఒక పన్ను డిమాండ్‌ వివాదానికి సంబంధించి పస లేని కారణం చూపుతూ గత నెల 16న తన బ్యాంక్‌ ఖాతాలను స్తంభింపజేశారని కాంగ్రెస్‌ లోగడ తెలిపింది. 2018-19 సంవత్సరానికి సంబంధించి రూ.210 కోట్ల ఐటీ డిమాండును ఆధారం చేసుకొని పార్టీ బ్యాంక్‌ ఖాతాలను స్తంభింపజేశారు. అయితే ఆ తర్వాత బ్యాంక్‌ ఖాతాల నిర్వహణకు ఆదాయపన్ను శాఖ అప్పీలెట్‌ ట్రిబ్యునల్‌ అనుమతించింది. కానీ ఖాతాలో రూ.115 కోట్ల నిల్వ ఉండాలంటూ మెలిక పెట్టింది. కాగా తన బ్యాంక్‌ ఖాతాలన్నింటినీ స్తంభింపజేశారని కాంగ్రెస్‌ పార్టీ ఈ నెల 21న మరోసారి తెలియజేసింది.
ఇది పన్ను ఉగ్రవాదం : కాంగ్రెస్‌
ఎన్నికల వేళ తనను ఆర్థికంగా దెబ్బతీయడానికి బీజేపీ ప్రభుత్వం ఆదాయపన్ను శాఖను ఉసిగొల్పుతోందని కాంగ్రెస్‌ మండిపడింది. తనకు జారీ చేసిన నోటీసులను ‘పన్ను ఉగ్రవాదం’గా అభివర్ణించింది. ఇలాంటి చర్యలను అడ్డుకోవాల్సిన అవసరం ఉన్నదని ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి జైరాం రమేష్‌ చెప్పారు. ఐటీ నోటీసులపై కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీ తీవ్రంగా స్పందించారు. పార్టీ ఖాతాలను స్తంభింపజేయడం ద్వారా కేంద్రం ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వ చర్యలు తమ పార్టీ పైనే కాకుండా ప్రజాస్వామ్య వ్యవస్థ పైన కూడా ప్రభావం చూపుతాయని చెప్పారు.
2017-18 నుండి 1,297 మంది నుండి అందిన రూ.42 కోట్ల నిధులకు సంబంధించి బీజేపీ ఎలాంటి వివరాలు అందజేయలేదని, ఇది ప్రజా ప్రాతినిధ్య చట్టాన్ని ఉల్లంఘించడమే అవుతుందని కాంగ్రెస్‌ కోశాధికారి అజరు మాకెన్‌ విమర్శించారు. దీనికి సంబంధించి ఆదాయపన్ను శాఖ ఆ పార్టీ నుండి రూ.4,600 కోట్లు వసూలు చేయాలని డిమాండ్‌ చేశారు. ఈ మొత్తంలో గత ఏడు సంవత్సరాలకు చెల్లించాల్సిన వడ్డీ కూడా ఉన్నదని చెప్పారు. ఐటీ శాఖ ఇచ్చిన నోటీసుపై వచ్చే వారం ప్రారంభంలో సుప్రీంకోర్టును ఆశ్రయిస్తామని ఆయన తెలిపారు.

Spread the love