మహారాష్ట్రలో స్కీమ్ వర్కర్ల ఆందోళన
అజాదీ మైదాన్‌లో మూడు రోజుల నిరసనలు
ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని డిమాండ్
మహారాష్ట్ర : పెండింగ్‌లో ఉన్న బకాయిలు, గౌరవ వేతనాల చెల్లింపులో జాప్యాన్ని నిరసిస్తూ, అనేక నెలలుగా చెల్లించకుండా ఉన్న బకాయిలను తక్షణమే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ వేలాదిమంది స్కీమ్ వర్కర్లు మహారాష్ట్రలోని ఆజాద్ మైదాన్‌లో భారీ ఆందోళన చేపట్టారు. తమ సేవలను క్రమబద్ధీకరించాలని, శ్రమకు తగిన వేతనాలు చెల్లించాలని, బకాయి పడిన జీతాలను తక్షణమే చెల్లించాలని డిమాండ్ చేస్తూ మహారాష్ట్ర వ్యాప్తంగా వేలాది మంది అంగన్‌వాడీ కార్యకర్తలు, ఆశా కార్యకర్తలు, జాతీయ ఆరోగ్య మిషన్ (ఎన్‌హెచ్‌ఎం) ఉద్యోగులు సోమవారం నుండి మూడు రోజుల నిరసనను ప్రారంభించారు. మంగళవారం రెండో రోజు నిరసన కొనసాగుతోంది. సెంటర్ ఆఫ్ ఇండియన్ ట్రేడ్ యూనియన్స్ (సీఐటీయూ) ఆధ్వర్యంలో జరిగిన ఈ ఆందోళనలో, సమీకృత శిశు అభివృద్ధి సేవలు (ఐసీడీఎస్), ఎన్‌హెచ్‌ఎం, పీఎం పోషణ్ కార్యక్రమంతో సహా ప్రభుత్వ సంక్షేమ పథకాలకు సంబంధించి దాదాపు ఎనిమిది వేల మంది కార్మికులు పాల్గొన్నారు. కీలకమైన ఆరోగ్య, పోషకాహార, విద్యా కార్యక్రమాలను నిర్వహిస్తున్నప్పటికీ, తమను తాత్కాలిక కార్మికులుగా పరిగణిస్తూ, ఉద్యోగ ప్రయోజనాలను నిరాకరిస్తున్నారని వారు విమర్శించారు. తమకు ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తింపు ఇవ్వాలని, సామాజిక భద్రతా ప్రయోజనాలు అందించాలని, సకాలంలో జీతాలు చెల్లించాలని వారు డిమాండ్ చేశారు. చాలా మంది ఎన్‌హెచ్‌ఎం కాంట్రాక్ట్ ఉద్యోగులకు, ఆశా కార్యకర్తలకు ఆరు నెలలుగా జీతాలు చెల్లించలేదని సీఐటీయూ రాష్ట్ర ఉపాధ్యక్షురాలు, అంగన్‌వాడీ ఉద్యోగుల సంఘం అధ్యక్షురాలు శుభా షమీమ్ తెలిపారు. బుధవారం ఈ నిరసన కార్యక్రమం ముగిసేలోపు రాష్ట్ర ప్రభుత్వం తమ డిమాండ్లను నెరవేర్చాలని, లేనిపక్షంలో తమ ఆందోళనను తీవ్రతరం చేస్తామని యూనియన్లు హెచ్చరించాయి. నెలకు కనీస వేతనం రూ.30 వేలు, గ్రాట్యుటీ, పెన్షన్ ఇవ్వాలని, కాంట్రాక్టు సిబ్బందిని క్రమబద్ధీకరించాలని యూనియన్లు డిమాండ్ చేస్తున్నాయి. దశాబ్దానికి పైగా కాంట్రాక్టు పద్ధతిలో పనిచేస్తున్న వైద్యులు, నర్సులు, అత్యవసర వైద్య సిబ్బందిని శాశ్వత ఉద్యోగులుగా మార్చాలని ఎన్‌హెచ్‌ఎం ఉద్యోగులు డిమాండ్ చేశారు. మహిళా, శిశు అభివృద్ధి శాఖ మంత్రి అదితి తట్కరే, ఉన్నతాధికారులతో యూనియన్ ప్రతినిధులు సమావేశమైనప్పటికీ స్పష్టమైన హామీ లభించకపోవడంతో ఉద్యోగులు నిరసన చేపట్టారు. గ్రాట్యుటీ ఇవ్వడానికి, అంగన్‌వాడీ కేంద్రాల్లో ఇంటర్నెట్ సౌకర్యాల వంటి కొన్ని డిమాండ్లకు ప్రభుత్వం అంగీకరించినప్పటికీ, క్రమబద్ధీకరణ లేదా వేతన సవరణపై ఎలాంటి హామీ ఇవ్వలేదని యూనియన్లు తెలిపాయి. రాయితీలు, ప్రోత్సాహకాలకు అర్హత సాధించడం కోసం పోషణ్ ట్రాకర్ యాప్‌లో పోషకాహార లోపం డేటాను తక్కువగా నమోదు చేయాలంటూ తమపై ఒత్తిడి తెచ్చారని గడ్చిరోలి, నందూర్బార్, పాల్ఘర్ సహా పలు గిరిజన జిల్లాలకు చెందిన అనేక మంది వర్కర్లు ఆరోపించారు. ఎన్‌హెచ్‌ఎం నిధుల విడుదలలో జాప్యాలపై కేంద్ర ఆరోగ్య శాఖ వద్ద మహారాష్ట్ర ప్రభుత్వం ఆందోళన వ్యక్తం చేసింది. రెండు ఆర్థిక సంవత్సరాల కాలంలో రూ.1800 కోట్లకు పైగా మొత్తాలు పెండింగ్‌లో వున్నాయని అధికారులు తెలిపారు.
పెండింగ్ బకాయిలు చెల్లించండి
- Advertisement -
- Advertisement -



