సీసోడియాకు ఊరట

నవతెలంగాణ- న్యూఢిల్లీ: ఢిల్లీ లిక్కర్‌ స్కామ్‌లో ఆప్‌ మాజీ ఉపముఖ్యమంత్రి మనీష్‌ సిసోడియాను గతేడాది మార్చిలో ఇడి అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. దాదాపు ఆయన ఈ కేసులో అరెస్టయి ఏడాది కావస్తోంది. ఈ నేపథ్యంలో అనారోగ్యంతో ఉన్న తన భార్యను, వైద్యులను కలవడానికి ఢిల్లీ రూస్‌ అవెన్యూ కోర్టు సోమవారం అనుమతించింది. అనారోగ్యంతో బాధపడుతున్న తన భార్యను వారానికోకసారి కలిసేందుకు కస్టడీ పెరోల్‌కు కోర్టు అనుమతించాలని కోరుతూ సిసోడియా దరఖాస్తు దాఖలు చేశారు. ఈ దరఖాస్తుపై రూస్‌ అవెన్యూ కోర్టులోని ప్రత్యేక న్యాయమూర్తి ఎంకె నాగ్‌పాల్‌ ఫిబ్రవరి 2న ఇడి (ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరక్టరేట్‌)కి నోటీసు జారీ చేశారు. ఈమేరకు కస్టడీ పెరోల్‌పై అనారోగ్యంతో ఉన్న తన భార్యను వారానికొకసారి కలిసేందుకు రూస్‌ అవెన్యూ కోర్టు సోమవారం అనుమతించింది. దీంతో సిసోడియాకు ఊరట లభించింది. ఇక గతేడాది నవంబర్‌ 10న (దీపావళి) కస్టడీ పెరోల్‌ మీద తన భార్యను కలిసేందుకు సిసోడియాకు కోర్టు అనుమతించింది. కాగా, లిక్కర్‌ స్కామ్‌ కేసులో సిసోడియా 622 కోట్ల రూపాయల మేర ఆర్థిక నేరాలకు పాల్పడ్డారని ఇడి ఆరోపించింది. ఆయనను గతేడాది మార్చి 9వ తేదీన ఇడి అరెస్టు చేసింది.

Spread the love