పెలికాన్‌ సిగల్స్‌ ఎంతో ఉపయోగకరం

– నగర సీపీ సీవీ ఆనంద్‌
– ట్యాంక్‌బండ్‌పై పెలికాన్‌ సిగల్స్‌నుప్రారంభించిన నగర సీపీ సీవీ ఆనంద్‌
నవతెలంగాణ-సిటీబ్యూరో
పెలికాన్‌ సిగల్స్‌ ఎంతో ఉపయోగ కరమని నగర సీపీ సీవీ ఆనంద్‌ తెలిపారు. బుధవారం ట్యాంక్‌బండ్‌పై పెలికాన్‌ సిగల్స్‌ ప్రారంభించారు. ఈ సందర్భంగా అదనపు సీపీ సుధీర్‌బాబుతో కలిసి సీపీ మాట్లాడారు. నగరంలో ఫుట్‌ ఓవర్‌ బ్రిడ్జిలను ప్రజలు ఉపయోగించడం లేదన్నారు. ట్రాఫిక్‌లో రోడ్‌ దాటేందుకు పెలికాన్‌ సిగల్స్‌ చాలా ఉపయోగపడుతాయన్నారు. హైదరా బాద్‌లో 30 పెలికాన్‌ సిగల్స్‌ ఏర్పాటు చేసినట్టు తెలిపారు. ప్రతీ పెలికాన్‌ సిగల్‌ వద్ద వాలెంటీర్స్‌ ఉన్నారని చెప్పారు. ప్రతీ ఏడాది రోడ్డు ప్రమాదాల్లో 45 శాతానికి పైగా పాదాచారులే చనిపోతున్నారని, ఈ ఏడాది ఇప్పటి వరకు 50 మంది పాదా చారులు మృతి చెందినట్టు తెలిపారు. రోడ్డు దాటుతున్న సమయాల్లోనే ఎక్కువ ప్రమాదాలు జరుగుతున్నాయన్నారు. రోడ్డు ప్రమాదాలను నివారించేందుకు పెలికాన్‌ సిగల్‌ను ఏర్పాటు చేశామని పేర్కొన్నారు. సేఫ్‌ సిటీ ప్రాజెక్టులో భాగంగా మహిళల భద్రతపై ప్రత్యేక చర్యలు తీసుకున్నామన్నారు.పెలికాన్‌ సిగలింగ్‌ సిస్టమ్‌ ఎంతో ఉపయోగ కరంగా ఉంటుందన్నారు. మూడు కమిషనరేట్‌ పరిధిల్లో సిగల్‌ సిస్టమ్‌లు ఏర్పాటు చేశామన్నారు. కొన్ని దేశాల్లో ఇలాంటి సిస్టమ్‌ ఆటోమేటిక్‌గా పనిచేస్తున్నాయని తెలిపారు. ఫుట్‌పాత్‌లు, పెలికాన్‌ సిగల్స్‌ ఉపయోగంపై ప్రజల్లో అవగాహన తీసుకొస్తామన్నారు. ఈ కార్యక్రమంలో ట్రాఫిక్‌ పోలీస్‌ల కోసం బ్యాగ్‌ కిట్‌, బాడీ ఓన్‌ కెమెరాలు కిట్స్‌ అందజేశారు. ఈ కార్యాక్రమంలో జాయింట్‌ సీపీ గజారావుభూపాల్‌తోపాటు జీహెచ్‌ఎంసీ నోడల్‌ ఆఫిసర్‌ ప్రియాంకా, ట్రాఫిక్‌ ఏసీపీలు, ఇన్‌స్పెక్టర్లు తదితరులు పాల్గొన్నారు.

Spread the love