ఉత్తమ పర్యాటక గ్రామాలుగా పెంబర్తి, చంద్లాపూర్‌

The best tourist villages are Pemberti and Chandlapur– అంతర్జాతీయ పర్యాటక దినోత్సవం పురస్కరించుకొని 27న అవార్డులందజేత
నవతెలంగాణ-న్యూఢిల్లీ బ్యూరో
తెలంగాణ కు చెందిన పెంబర్తి, చంద్లాపూర్‌ గ్రామాలు 2023 ఏడాదికి గాను ఉత్తమ పర్యాటక గ్రామాలుగా నిలిచాయి. ఇప్పటికే తెలంగాణ కళలకు, సాంస్కృతిక, పర్యాటక కేంద్రాలకు అంతర్జాతీయ గుర్తింపు వచ్చింది. తాజాగా ఈ రెండు గ్రామాలను ఉత్తమ పర్యాటక గ్రామాలుగా ఎంపిక చేసినట్టు కేంద్ర పర్యాటక శాఖ సోమవారం ఒక ప్రకటనలో పేర్కొంది. 27న అంతర్జాతీయ పర్యాటక దినోత్సవం సందర్బంగా ఢిల్లీలో జరిగే కార్యాలయం లో ఈ అవార్డులను అందజేయనున్నట్టు వెల్లడించింది.
హస్తకళలతో ఆకర్షిస్తోన్న పెంబర్తి
కాకతీయుల కాలం నుంచీ హస్తకళలకు పెంబర్తి ప్రసిద్ధి చెందింది. ఇత్తడి, కంచు లోహాలతో ఈ గ్రామంలో తయారు చేసే కళాకృతులకు ప్రపంచ వ్యాప్తంగా డిమాండ్‌ ఉంది. అమెరికా, జర్మనీ, బెల్జియం, జపాన్‌, తదితర దేశాలు ఈ హస్తకళలను దిగుమతి చేసుకుంటున్నాయి. ముఖ్యంగా సంస్కృతి సంప్రదాయాలను, ఆచార వ్యవహారాలను ప్రతిబింబించే కళాకృతులు, దేవతల విగ్రహాలు, కళా ఖండాలు, గృహ అలంకరణ వస్తువులెన్నో ఇక్కడి కళాకారుల నైపుణ్యంతో చేతివృత్తులు ప్రత్యేక ఆకర్షణీయంగా నిలుస్తాయి. అలాగే ప్రతి ఏటా దాదాపు 25 వేల మంది పర్యాటకులు ఈ గ్రామాన్ని సందర్శిస్తున్నట్టు రికార్డులు చెబుతున్నాయి. అయితే తెలంగాణకే సొంతమైన ఈ సంస్కృతి, కార్మికుల కృషితో జరుగుతోన్న వ్యాపారాన్ని దృష్టిలో ఉంచుకుని.. పెంబర్తిని కేంద్ర ప్రభుత్వం ఉత్తమ పర్యాటక గ్రామంగా ఎంపిక చేసింది. అలాగే పెంబర్తి ఉత్పత్తులకు జీఐ ట్యాగ్‌ గుర్తింపు విషయంలోనూ కేంద్ర ప్రభుత్వం చొరవతీసుకుంది.
చంద్లాపూర్‌ ‘గొల్లభామ’ చీరలు
రంగనాయక స్వామి దేవాలయం, పరిసర ప్రాంతాలు గ్రామీణ పర్యాటకానికి ప్రసిద్ధి చెందడంతో పాటు ఇక్కడి గొల్లభామల చీరలకున్న ప్రత్యేకత కారణంగా ఈ ప్రాంతాన్ని ఉత్తమ పర్యాటక గ్రామంగా కేంద్రం గుర్తించింది. తెలంగాణ నుంచి పెంబర్తి, చంద్లాపూర్‌ లు ఉత్తమ పర్యాటక గ్రామాలుగా ఎంపికవడం పై కేంద్ర మంత్రి కిషన్‌ రెడ్డి హర్షం వ్యక్తం చేశారు. అంతర్జాతీయ వేదికలతో పాటు, ఇటీవల నిర్వహించిన జీ 20 సదస్సులోనూ భూదాన్‌ పోచంపల్లి ఇక్కత్‌ చీరలను, నేతన్నలు నేసిన కండువాలను వివిధ దేశాల అధినేతలకు, విదేశీ ప్రముఖులకు అందజేసినట్లు గుర్తు చేశారు. అలాగే 2021లో భూదాన్‌ పోచంపల్లి గ్రామానికి డబ్ల్యూఎన్‌ డబ్ల్యూటీఓ ఉత్తమ పర్యాటక గ్రామంగా గుర్తింపు కల్పించే విషయంలో కేంద్రం ప్రత్యేక చొరవతీసుకుందని గుర్తు చేశారు.

Spread the love