పింఛనేది బాంచన్‌..?

Pension is Banchan..?– నెలాఖరు వచ్చినా అందని ఆసరా
– ఒక్క నెలా సమయానికి వచ్చింది లేదు..
– ఏడాదిలో ఒకటి, రెండు నెలలు ఎగవేత
– రాష్ట్రంలో పది రకాల పెన్షన్‌లు.. 44 లక్షల మంది లబ్దిదారులు
– రూ.4వేల కాంగ్రెస్‌ పింఛన్‌పై మొదలైన చర్చ
– పాలకులు ఎవరైనా ఫస్ట్‌ తారీఖు పింఛన్‌ కోసం డిమాండ్‌
నవతెలంగాణ- ఖమ్మం ప్రాంతీయ ప్రతినిధి
బీఆర్‌ఎస్‌ ప్రభుత్వ పథకాలేవైనా ఆరంభశూరత్వమే కనిపిస్తోందని విమర్శకులంటున్నారు. మొదట్లో హడావుడి చేయడం.. ఆ తర్వాత ఆ స్కీంను గాలికొదిలేయడం ఆనవాయితీగా మారిందనే విమర్శలున్నాయి. అది రైతుబంధైనా.. దళితబంధైనా.. రుణమాఫీ అయినా.. చివరకు ‘ఆసరా’ పింఛనైనా…అలసత్వమే చోటుచేసుకుంటుందనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. ముఖ్యంగా పింఛన్‌ విషయంలో ఒకనెల 1వ తేదీన వేస్తే.. ఆ తర్వాత నెల 20, లేదంటే నెల చివరి రోజు వేయడం, ఒక్కోసారి రెండు నెలలదీ ఒకేసారి వేయడం, నిర్ధిష్టత లేని తేదీల్లో వేస్తూ.. గందరగోళానికి గురిచేస్తూ మధ్యలో ఒకటి, రెండు నెలలు మిస్‌ చేస్తున్నారని లబ్దిదారులు వాపోతున్నారు. ఖమ్మం జిల్లాలో వికలాంగులు మినహా మిగిలిన వారికి సెప్టెంబర్‌ ముగింపునకు వచ్చినా ఇంకా పింఛన్‌ అందకపోవడం గమనార్హం. రాష్ట్రవ్యాప్తంగా ఇదే తీరు ఉన్నట్టు సమాచారం.
44 లక్షల మంది ఎదురుచూపు..
రాష్ట్రవ్యాప్తంగా 2014 అక్టోబర్‌ 1 నుంచి ఆసరా పింఛన్‌ పథకం ప్రారంభమైంది. ప్రస్తుతం పది కేటగిరీల్లో 43,68,784 మందికి పింఛన్‌ అందుతుంది. 2023 జూన్‌ నాటికి కేటగిరీల వారీగా 15,81,630 మంది వృద్ధులు, 15,54,525 మంది వితంతువులు, వికలాంగులు 5,05,836, నేతకారులు 37,071, కల్లుగీత కార్మికులు 65,196, ఫైలేరియా బాధితులు 17,995, డయాలసిస్‌ రోగులు 4,337, హెచ్‌ఐవీ రోగులు 35,670, బీడీ కార్మికులు 4,24,292, ఒంటరి మహిళలు 1,42,252 మంది ఉన్నారు. వీరిలో వికలాంగులకు మొన్నటి వరకు రూ.3016 పింఛన్‌ రాగా కొద్దిరోజుల క్రితం దీనిని రూ.4016కు పెంచారు. మిగిలిన కేటగిరీల వారికి నెలకు రూ.2016 చొప్పున పింఛన్‌ లభిస్తోంది. 2013-14తో పోల్చుకుంటే 2021-22 నాటికి లబ్దిదారుల సంఖ్య గణనీయంగా పెరిగినట్టు ప్రభుత్వ లెక్కలు చెబుతున్నాయి. 2023-24 వార్షిక సంవత్సరానికి రూ.11,774.90 కోట్లను ప్రభుత్వం బడ్జెట్‌లో పింఛన్‌ కోసం కేటాయించింది. వికలాంగులకు జులై నుంచి రూ.4,016 పింఛన్‌ అమలవుతోంది. పెంచిన పింఛన్‌ను కూడా కొన్నిచోట్ల రెండు నెలలు జులై, ఆగస్ట్‌ నెలలకు సంబంధించినవి ఆగస్టు ్టనెలలోనే రెండు పర్యాయాలు విడుదల చేశారు. గత రెండేండ్ల్లుగా ఏ ఒక్కరోజూ సకాలంలో పింఛన్‌ అందలేదని లబ్దిదారులు వాపోతున్నారు.
కాంగ్రెస్‌ రూ.4వేల పింఛన్‌పై చర్చ
కాంగ్రెస్‌ అధికారంలోకి వస్తే అమలు చేసే ఆరు గ్యారెంటీలపై ప్రజల్లో ఆసక్తి కనబడుతోంది. దీనిలో రూ.4వేల పింఛన్‌ కూడా ఒకటి. ఖమ్మం వేదికగా జులై 2వ తేదీన ప్రజాగర్జన సభలో రాహుల్‌గాంధీ ఈ ప్రకటన చేశారు. దీనినే ఆరు గ్యారెంటీల్లో ఒకటిగా చేర్చారు. అయితే దీనిని బలంగా జనంలోకి తీసుకెళ్లాలంటే ఇంకా సమయం పడుతుందని ఆ పార్టీ నేతలు అంటున్నారు. దీనికి మరో రూ.500 అదనంగా పెంచి ప్రకటన చేయాలనే యోచనలో బీఆర్‌ఎస్‌ ఉన్నట్టు తెలుస్తోంది. అధికారంలోకి వచ్చే ఏ ప్రభుత్వమైనా సకాలంలో పింఛన్‌ విడుదల చేయాలని లబ్దిదారులు కోరుతున్నారు. గత ఎన్నికల్లో పింఛన్‌లు, రైతుబంధు వంటి పథకాలతో అధికారంలోకి వచ్చిన బీఆర్‌ఎస్‌ ఆ తర్వాత ఈ రెండింటినీ సక్రమంగా అమలు చేయడం లేదని ప్రజలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. పింఛన్‌ పెంచడం మంచిదే కానీ దానిని సకాలంలో ఇవ్వకపోతే ఏమి ఉపయోగమని ప్రశ్నిస్తున్నారు.
ప్రతినెలా ఫస్ట్‌ తారీఖే పింఛన్‌ పడాలి.. వీర్ల సుభద్ర, వితంతు పెన్షన్‌దారు
ప్రభుత్వం పింఛనైతే ఇస్తుంది కానీ, ఏనెల ఎప్పుడు వేస్తరో తెలియట్లేదు. 1వ తారీఖు కానుంచి ఎదురుచూస్తున్నా.. ఈనెల అయిపోతున్నా ఇంత వరకు పింఛన్‌ రాలేదు. వేసినప్పుడు తీసుకోవడం తప్ప ఏమీ లేదు. ఏడాదికి 12 నెలలు రావాల్సిన పింఛన్‌ ఒకనెల వేసి, ఒకనెల వేయక..10, 11 నెలలు మాత్రమే ఇస్తున్నారు. కాంగ్రెస్‌ వస్తే రూ.4వేల పింఛన్‌ ఇస్తారట..! వాళ్లు కూడా ఇలాగే చేస్తే ఎదురుచూడక తప్పదు.

Spread the love