నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
కేంద్ర ప్రభుత్వం తెచ్చిన పెన్షన్ ధృవీకరణ చట్టాన్ని రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ బుధవారం హైదరాబాద్‌లోని ఇందిరాపార్క్ వద్ద ధర్నా చేపట్టనున్నట్టు తెలంగాణ ఆల్ పెన్షనర్స్ అండ్ రిటైర్డ్ పర్సన్ల అసోసియేషన్ (టాప్ర) రాష్ట్ర కమిటీ ప్రకటించింది. ఈ మేరకు ఆ సంఘం రాష్ట్ర అధ్యక్షులు పి నారాయణరెడ్డి, ప్రధాన కార్యదర్శి పి కృష్ణమూర్తి, కన్వీనర్ వి కృష్ణమోహన్ సోమవారం ఒక ప్రకటన విడుదల చేశారు. ఎనిమిదో వేతన సవరణ కమిషన్‌కు ఇచ్చిన నిబంధనలను సవరించాలని డిమాండ్ చేశారు. కేంద్రం తెచ్చిన పెన్షన్ ధృవీకరణ చట్టం రానున్న కాలంలో రాష్ట్ర ప్రభుత్వ పెన్షనర్లందరి మెడకు చుట్టుకుంటుంని తెలిపారు. వాలిడేషన్ ఆఫ్ సీసీఎస్ (పెన్షన్) నిబంధనల చట్టం-2025ని రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ఎనిమిదో వేతన సవరణ కమిషన్ నిబంధనలను సవరించాలని కోరారు. ఎన్‌పీఎస్/యూపీఎస్ పెన్షన్ విధానాన్ని రద్దు చేసి ఓపీఎస్ విధానాన్ని అమలు చేయాలని తెలిపారు. కమ్యూటేషన్ ఆఫ్ పెన్షన్ రికవరీ కాలాన్ని 11 ఏండ్ల మూడు నెలలకు తగ్గించాలని పేర్కొన్నారు. 2017 జనవరి ఒకటి నుంచి జరగాల్సిన బీఎస్‌ఎన్‌ఎల్ ఎంటీఎన్‌ఎల్ పెన్షనర్ల పెన్షన్ సవరణను వెంటనే చేపట్టాలని తెలిపారు. పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ సిఫారసుల ప్రకారం పెన్షన్‌ను వెంటనే మంజూరు చేయాలని పేర్కొన్నారు. ఈపీఎస్-95 పెన్షనర్లకు కరువుభత్యంతో కూడిన కనీస పెన్షన్ నెలకు రూ.తొమ్మిది వేలు చెల్లించాలని తెలిపారు. కోల్ మైన్ పెన్షనర్లకు కరువు భత్యంతో కూడిన కనీస పెన్షన్ నెలకు రూ.15 వేలు చెల్లించాలని పేర్కొన్నారు.
రేపు ఇందిరాపార్క్ వద్ద పెన్షనర్ల ధర్నా
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



