కేరళ ప్రజల మద్దతు ఎల్డీఎఫ్‌ కే

కేరళ ప్రజల మద్దతు ఎల్డీఎఫ్‌ కే– వామపక్షాలు గెలిస్తేనే పార్లమెంటులో ప్రజావాణి : కేరళ ఎన్నికల ప్రచారంలో సీపీఐ(ఎం) కేంద్ర కమిటీ సభ్యులు బి. వెంకట్‌
నవతెలంగాణ-న్యూఢిల్లీ బ్యూరో
కేరళలో వామపక్ష అభ్యర్థులను అత్యధిక మెజార్టీతో గెలిపించి పార్లమెంట్‌కు పంపాలని అఖిల భారత వ్యవసాయ కార్మిక సంఘం జాతీయ ప్రధాన కార్యదర్శి, సీపీఐ(ఎం) కేంద్ర కమిటీ సభ్యులు బి వెంకట్‌ పిలుపునిచ్చారు. గురువారం పాల్గాట్‌ పార్లమెంటరీ నియోజకవర్గం నుండి పోటీ చేస్తున్న అఖిల భారత వ్యవసాయ కార్మిక సంఘం అధ్యక్షులు ఎ. విజయ రాఘవన్‌, ఆల్తార్‌ పార్లమెంట్‌ నియోజకవర్గం నుండి పోటీ చేస్తున్న డీఎస్‌ఎస్‌ఎం అఖిల భారత అధ్యక్షులు, రాష్ట్ర మంత్రి రాధాకృష్ణ ఎన్నికల ప్రచార సభల్లో బి.వెంకట్‌ పాల్గొన్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ వామపక్ష అభ్యర్థులు గెలిస్తేనే పార్లమెంట్‌లో ప్రజావాణిని వినిపించడానికి అవకాశం ఉంటుందని, వామపక్షాల బలం తగ్గడం వల్ల ప్రజా సమస్యలు పక్కకు పోయి కార్పొరేట్లకు ఉపయోగపడే విధానాలు ముందుకు వస్తున్నాయని అన్నారు. గత పదేండ్ల బీజేపీ పాలనలో కార్పొరేట్‌ మతోన్మాద విధానాలు బలపడ్డాయని, వీటికి వ్యతిరేకంగా వామపక్షాలే నికరంగా పోరాడాయని తెలిపారు. వామపక్ష అభ్యర్థులు గెలిస్తే ప్రజా అనుకూల ప్రత్యామ్నాయ విధానాలను ముందుకు తేవడానికి అవకాశం ఏర్పడుతుందని అన్నారు. కేరళలో బీజేపీ, యూడీఎఫ్‌ కూటమిని ఓడించి వామపక్ష కూటమి ఎల్‌డీఎఫ్‌ అభ్యర్థులను గెలిపిం చాలని విజ్ఞప్తి చేశారు. వామపక్ష అభ్యర్థుల పట్ల ప్రజల్లో సానుకూలత ఉందని అన్నారు. బీజేపీ హిందూ ముస్లింల మధ్య విభజన తెస్తుం దని విమర్శించారు.
నరేంద్ర మోడీ గుజరాత్‌ మోడల్‌ అని చెబుతున్న గుజరాత్‌లో కేంద్ర ప్రభుత్వ గణాంకాల ప్రకారం 15 శాతంపైగా పేదరికం పెరిగిందని అన్నారు. ఆర్థిక నిపుణుల అంచనా ప్రకారం ఇది 30 శాతం పైగా ఉంటుందని తెలిపారు. కానీ కేరళలో ప్రభుత్వ లెక్కల ప్రకారమే 0.7 శాతం కంటే తక్కువ పేదరికం ఉందని పేర్కొన్నారు. కేరళ ప్రభుత్వం ఉపాధి, ఉద్యోగ కల్పన, మానవ అభివృద్ధి, అందరికీ ఇండ్లు కల్పించిందని ప్రభుత్వ నివేదికలే చెబుతున్నాయని అన్నారు. శ్రమజీవులైన వ్యవసాయ కార్మికులు, రైతాంగం, కార్మికులు, కౌలు రైతులకు మేలు జరగాలంటే తిరిగి వామపక్ష అభ్యర్థులను గెలిపించుకోవడం వల్లనే సాధ్యం అవుతుందని పేర్కొన్నారు. ఈ కేరళ మోడల్‌ నేడు దేశానికి అవసరమని చెప్పారు. దేశంలో బీజేపీ ప్రభుత్వ రంగ సంస్థలను కార్పొరేట్‌ శక్తులకు అమ్ముతుంటే, వాటిని కేరళ ప్రభుత్వం తీసుకొని ప్రభుత్వ రంగంలో నడుపుతున్నదని అన్నారు. కేరళలో గెలిచిన ప్రజాప్రతినిధులు దేశానికి ఆదర్శంగా నిలుస్తున్నారని తెలిపారు.
దేశంలో కార్పొరేట్‌ శక్తులకు ఉపయోగం కలిగేలా తీసుకుని వచ్చిన రైతు నల్ల చట్టాలు, నిరుద్యోగ సమస్య, నూతన జాతీయ విద్యా విధానం, కార్మికులకు నష్టం చేసే లేబర్‌ కోడ్‌లు, సీఏఏ వంటి ప్రజా వ్యతిరేక చట్టాలకు వ్యతిరేకంగా వామపక్షాలే పోరాడాయని గుర్తుచేశారు. పార్లమెంట్‌లో వామపక్ష పార్టీలు లేకపోవడం వల్ల ప్రజలకు ఎలాంటి నష్టం జరిగిందో కేరళ ప్రజలు ఆలోచిస్తున్నారని బి.వెంకట్‌ తెలిపారు. దేశాన్ని కార్పొరేట్‌, మతోన్మాద విధానాలతో నష్టం చేస్తున్న బీజేపీ, కేరళ ప్రయోజనాల కోసం కాకుండా అవకాశ వాదంతో ఉన్న కాంగ్రెస్‌ను ప్రజలు ఓడించాలని ఆయన పిలుపునిచ్చారు.

Spread the love