నవతెలంగాణ – కామారెడ్డి
రామారెడ్డి మండలంలో గ్రామ పాలన అధికారిపై జరిగిన దాడిని తీవ్రంగా ఖండిస్తూ కామారెడ్డి అదనపు కలెక్టర్‌కు జీపీఓల సంఘం నాయకులు శుక్రవారం వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా కామారెడ్డి జిల్లా జీపీఓల సంఘం అధ్యక్షుడు వెంకటేష్, కామారెడ్డి డివిజన్ అధ్యక్షుడు బోరంచ నరేష్ మాట్లాడుతూ.. గ్రామ పాలన అధికారులు ప్రభుత్వ ఆస్తులను కాపాడుతూ.. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు విధులు నిర్వహిస్తున్నారని తెలిపారు. అయితే కొందరు అక్రమార్కులు విధులకు ఆటంకం కలిగిస్తూ అధికారులపై దాడులకు పాల్పడటం సిగ్గుచేటని అన్నారు. క్షేత్రస్థాయిలో విధులు నిర్వహించే గ్రామ పాలన అధికారులకు రక్షణ కల్పించేలా ప్రభుత్వం, అధికారులు తగిన చర్యలు తీసుకోవాలని వారు కోరారు. విధి నిర్వహణలో అధికారులపై దాడులకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
కార్యక్రమంలో రాష్ట్ర అసోసియేట్ అధ్యక్షుడు మూదం చిరంజీవి, జిల్లా ప్రధాన కార్యదర్శి తిరుపతి, జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ ముజీబ్, జిల్లా సభ్యులు రవికుమార్, ప్రవీణ్, జనరల్ సెక్రెటరీ లక్ష్మీనారాయణ, బాబు, సంయుక్త కార్యదర్శి సత్యనారాయణ, అనిల్, బాన్సువాడ డివిజన్ అధ్యక్షుడు సాయిలు, ఉపాధ్యక్షుడు సత్యం, మండల నాయకులు పాల్గొన్నారు.



