– సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి
కాంగ్రెస్ వైఫల్యాలు తెరమీదకు రాగానే డైలీ సీరియల్లా ఏదో ఒక లీకును విడిచి ప్రజల దృష్టిని మళ్లిస్తున్నారని మాజీ మంత్రి, బీఆర్‌ఎస్ నేత సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి విమర్శించారు. ఫోన్ ట్యాపింగ్ ఆరోపణలు…లీగల్ సెన్స్ లేని నాన్సెన్స్ అంటూ కొట్టిపారేశారు. టెలిగ్రాఫిక్ చట్టం ప్రకారం ప్రభుత్వంలోని అధికారులు నిర్ణయం తీసుకుని ఫోన్ ట్యాపింగ్ చేయొచ్చని స్పష్టం చేశారు. బుధవారం హైదరాబాద్‌లోని తెలంగాణ భవన్ లో ఆయన మీడియాతో మాట్లాడారు. ఫోన్ ట్యాపింగ్ అనేది వ్యవస్థలో భాగంగా ఆయా సంస్థల పరిధిలో జరిగేదని స్పష్టం చేశారు. ప్రభుత్వాన్ని కూల్చే కుట్రలో ప్రజాప్రతినిధిని కొనుగోలు చేయడానికి వెళ్లి రెడ్ హ్యాండెడ్‌గా దొరికిన వ్యక్తి రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్నారని ఈ సందర్భంగా ఆయన ఎద్దేవా చేశారు. లైవ్‌లో దొరికిన రేవంత్‌కు లై డిటెక్టర్ పెడితే ఎలా ఉంటుంది ? అని ప్రశ్నించారు. కేసీఆర్‌కు లై డిటెక్టర్ పెడితే కాళేశ్వరం విషయాలు బయటకు వస్తాయని సీఎం మాట్లాడడం అవివేకమని విమర్శించారు.
తెలంగాణ ఆనవాళ్లను తుడిచేయడం అవివేకం :దాసోజు శ్రవణ్
ప్రజల జీవితాలలో మార్పు తెస్తానని అధికారంలోకి వచ్చిన సీఎం రేవంత్ రెడ్డి తెలంగాణ చరిత్ర ఆనవాళ్ళను తుడిచేసే పనిలో పడటం అవివేకమని బీఆర్‌ఎస్ నేత దాసోజు శ్రవణ్ విమర్శించారు. ఈ మేరకు బుధవారం ఒక ప్రకటన విడుదల చేశారు. ప్రభుత్వాలు మారిన ప్రతిసారి ప్రభుత్వ గుర్తులు మార్చడం తుగ్లక్ చర్య అని ఆగ్రహం వ్యక్తం చేశారు. రేవంత్ రెడ్డి తర్వాత మరో ముఖ్యమంత్రి మరో కొత్త లోగో తేవాలా? అని ప్రశ్నించారు. సీఎం అంటే రాజు కాదనీ, ప్రధాన సేవకుడు మాత్రమేనని గుర్తుచేశారు. అది కూడా శాశ్వతం కాదని హితవు పలికారు.
విధ్వంసం దిశగా కాంగ్రెస్:మాజీ ఎమ్మెల్సీ కర్నె ప్రభాకర్
కాంగ్రెస్ పాలన విధ్వంసం దిశగా కొనసాగనున్నదని బీఆర్‌ఎస్ నేత, మాజీ ఎమ్మెల్సీ కర్నె ప్రభాకర్ విమర్శించారు. బుధవారం హైదరాబాద్‌లోని తెలంగాణ భవన్‌లో ఆయన మీడియాతో మాట్లాడారు. బీఆర్‌ఎస్ ఆధ్వర్యంలో జూన్ 1 నుంచి 3 వరకు తెలంగాణ దశాబ్ది ముగింపు ఉత్సవాలు నిర్వహిస్తున్నట్టు తెలిపారు. జూన్ 1 వ తేదీన గన్ పార్క్ అమరవీరుల స్థూపం వద్దకు కేసీఆర్ చేరుకుని నివాళులు అర్పిస్తారు. గన్‌పార్క్ అమరవీరుల స్థూపం నుండి సెక్రటేరియట్ ఎదురుగా వున్న అమరవీరుల స్థూపం వరకు పది వేల మందితో ర్యాలీ నిర్వహిస్తాం. జూన్ 2 న జాతీయ జెండా,పార్టీ జెండాను హైదరాబాద్‌లోని తెలంగాణ భవన్ లో ఎగురవేస్తాము. అదే రోజు తెలంగాణ భవన్‌లో సమావేశం,ఫోటో ఎగ్జిబిషన్ ఉంటుంది. 3న జిల్లా కార్యాలయాల్లో జాతీయ జెండాలు, పార్టీ జెండాలను జిల్లా అధ్యక్షులు ఎగురవేస్తారు. ఆస్పత్రులు, అనాథ శరణాలయాల్లో స్వీట్లు, పండ్లు పంపిణీ కార్యక్రమం వుంటుందని ప్రభాకర్ వివరించారు. రాజముద్రలో కాకతీయ కళాతోరణాన్ని చెరిపేస్తామంటున్న ప్రభుత్వం వారు నిర్మించిన గొలుసుకట్టు చెరువులను లేకుండా చేస్తుందా అని ప్రశ్నించారు. మీడియా సమావేశంలో మాజీ మంత్రి సత్యవతి రాథోడ్, మాజీ ఎమ్మెల్సీ శ్రీనివాస్ రెడ్డి, వికలాంగుల కార్పొరేషన్ మాజీ చైర్మెన్ వాసుదేవ రెడ్డి, టూరిజం కార్పొరేషన్ మాజీ చైర్మెన్ గెల్లు శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.